డీలిమిటేషన్ బిల్లుకు మద్దతిస్తున్నం .. ఎన్సీపీ సీనియర్ నేత జితేంద్ర అవ్హాడ్

డీలిమిటేషన్ బిల్లుకు మద్దతిస్తున్నం .. ఎన్సీపీ సీనియర్ నేత జితేంద్ర అవ్హాడ్
  •  శరద్ పవార్ తో భేటీ అనంతరం వెల్లడి
  •     రాజ్యాంగ ప్రక్రియగా పేర్కొన్న అవ్హాడ్
  •     అన్ని రాష్ట్రాల్లో లోక్‌సభ సీట్ల సంఖ్య 50 శాతం పెంపునకు షరతు
  •     బిల్లు చూడకుండా ఎలా స్పందిస్తాం? అన్న ఎంపీ సుప్రియా సూలే


ముంబై: కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) బిల్లుకు మద్దతు ఇస్తామని ఎన్సీపీ (శరద్ పవార్) సీనియర్ నేత, ఎమ్మెల్యే జితేంద్ర అవ్హాడ్ ప్రకటించారు. శుక్రవారం ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆస్పత్రిలో పార్టీ అధినేత శరద్ పవార్‌తో భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రాజ్యాంగ నిబంధనల ప్రకారం డీలిమిటేషన్ చేపట్టాల్సి ఉంటుందని, ఈ ప్రక్రియకు తమ పార్టీ మద్దతు ఇస్తుందని స్పష్టం చేశారు.

శరద్ పవార్‌తో పాటు సుప్రియా సూలే, పార్టీ ఎంపీలు కూడా ఈ అంశంపై నిర్ణయం తీసుకున్నారని వెల్లడించారు. అయితే లోక్‌సభ స్థానాలను అన్ని రాష్ట్రాల్లో సమానంగా 50 శాతం పెంచాలన్నది తమ పార్టీ ప్రధాన డిమాండ్‌గా ఉంది. మరోవైపు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ సుప్రియా సూలే మాత్రం బిల్లుపై ఆచితూచి స్పందించారు. బిల్లు ప్రతిని చూడకుండా దానిపై ఎలా మాట్లాడగలమని ప్రశ్నించారు. పార్లమెంట్ సమావేశాల ఎజెండా, బిల్లు వివరాలు అందిన తర్వాతే తమ వైఖరిని స్పష్టం చేస్తామని తెలిపారు. మహిళా రిజర్వేషన్ల అమలు, అన్ని రాష్ట్రాల్లో లోక్‌సభ స్థానాల సంఖ్య 50 శాతం పెంపు, డీలిమిటేషన్ కమిషన్‌లో ప్రతిపక్షాలకు తగిన ప్రాతినిధ్యం వంటి అంశాలను గతంలో ఆమె షరతులుగా ప్రస్తావించారు. నవంబర్ 30 నుంచి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు జరగనున్న నేపథ్యంలో ఎన్సీపీ వైఖరి రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.