ఓపీఎస్ అమలు ఖజానాకు భారం కాదు.. సీఎస్, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీకి సీపీఎస్ఈయూ వినతి

ఓపీఎస్ అమలు ఖజానాకు భారం కాదు.. సీఎస్, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీకి సీపీఎస్ఈయూ వినతి

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని 2.80 లక్షల మంది సీపీఎస్ ఉద్యోగులు, టీచర్లకు పాత పెన్షన్ విధానం పునరుద్ధరించాలని కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయీస్ యూనియన్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. శుక్రవారం సెక్రటేరియెట్ లో సీఎస్ సంజయ్ జాజు, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ శేషాద్రిని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు స్థితప్రజ్ఞ, ప్రధాన కార్యదర్శి కల్వల్ శ్రీకాంత్ కలిసి వినతిపత్రం అందించారు. ఓపీఎస్ అమలు తెలంగాణ ఖజానాకు ఏమాత్రం భారం కాదని వారు గణాంకాలతో వివరించారు.

ప్రస్తుతం సీపీఎస్ కింద ఉద్యోగుల 10 శాతం వాటా, ప్రభుత్వ 10 శాతం మ్యాచింగ్ గ్రాంట్ కలిపి నెలకు రూ.200 నుంచి రూ.300 కోట్లు ఎన్ఎస్‌డీఎల్/ఎన్‌పీఎస్ ట్రస్టుకు, ప్రైవేట్ మార్కెట్లకు తరలిపోతున్నాయని తెలిపారు. ఓపీఎస్ పునరుద్ధరిస్తే ప్రభుత్వం చెల్లించే 10 శాతం మ్యాచింగ్ గ్రాంట్ బయటకు వెళ్లడం ఆగిపోయి ఖజానాలోనే మిగులుతుందని చెప్పారు. ఓపీఎస్ అమలు చేస్తే జీపీఎఫ్ రూపంలో రాష్ట్ర అభివృద్ధికి నిధులు అందుబాటులో ఉంటాయని స్పష్టం చేశారు. కాంగ్రెస్ మేనిఫెస్టో హామీ మేరకు ఓపీఎస్ పునరుద్ధరించాలని కోరుతూ ఈనెల17న 1.72 లక్షల మంది సీపీఎస్ ఎంప్లాయసీ మాస్ లీవ్ పెట్టినట్టు గుర్తుచేశారు.