తమిళనాడు వాటా తగ్గొద్దు..  కేంద్రం ముందు డీఎంకే రెండు షరతులు

తమిళనాడు వాటా తగ్గొద్దు..  కేంద్రం ముందు డీఎంకే రెండు షరతులు
  •      దక్షిణాది ప్రయోజనాలకే ప్రాధాన్యమన్న స్టాలిన్

చెన్నై: డీలిమిటేషన్ బిల్లుతో తమిళనాడు ప్రయోజనాలకు భంగం కలగకూడదని, లోక్‌సభలో రాష్ట్రానికి ఇప్పుడున్న 7.18 శాతం సీట్ల వాటా యథాతథంగా కొనసాగాలని డీఎంకే షరతు పెట్టింది. 1971 జనాభా లెక్కల ఆధారంగా నిర్ణయించిన అన్ని రాష్ట్రాల సీట్ల నిష్పత్తిని మరో 25 ఏండ్ల పాటు కొనసాగించాలని డిమాండ్ చేసింది. ఈ రెండు హామీలను బిల్లులోనే స్పష్టంగా పొందుపర్చాలని, రాష్ట్ర ప్రయోజనాల విషయంలో ఎలాంటి రాజీ ఉండదని డీఎంకే అధినేత, మాజీ సీఎం స్టాలిన్ స్పష్టం చేశారు.

సీట్ల పెంపునకు ఓకే.. కానీ

లోక్‌సభ స్థానాలను ఇప్పుడున్న దానికంటే 50 శాతం పెంచే ప్రతిపాదనకు డీఎంకే సూత్రప్రాయంగా అంగీకరిస్తున్నట్టు ప్రచారం జరుగుతున్నా.. స్టాలిన్ మాత్రం తమ వైఖరిలో ఎలాంటి మార్పు లేదని, దక్షిణాది, ముఖ్యంగా తమిళనాడు ప్రయోజనలే ముఖ్యమని అన్నారు.  పెరిగే స్థానాల కేటాయింపుతో రాష్ట్రాల మధ్య ప్రస్తుత ప్రాతినిధ్య నిష్పత్తి మారకూడదని కోరుతోంది. జనాభా పెరుగుదల ఆధారంగా డీలిమిటేషన్ చేస్తే, దక్షిణాది రాష్ట్రాలకు ప్రాతినిధ్యం తగ్గే ప్రమాదం ఉందని ఆ పార్టీ ఆందోళన వ్యక్తం చేస్తోంది

డీఎంకే చేతిలోనే బిల్లు భవిష్యత్తు

డీఎంకేకు 22 మంది ఎంపీలు ఉండటంతో, బిల్లుకు అవసరమైన మూడింట రెండొంతుల మెజారిటీ సాధించేందుకు వారి మద్దతు కేంద్రానికి కీలకంగా మారింది. బిల్లుకు మద్దతిస్తామని ఎన్సీపీ (ఎస్పీ) శుక్రవారమే ప్రకటించడంతో ఎన్డీయే బలం 354కు చేరగా, బిల్లు పాసుకు ఇంకా 7 ఓట్లు అవసరం. ఈ నేపథ్యంలో  ఈ నెల 30 నుంచి జరగనున్న పార్లమెంట్ సెషన్​లో  డీఎంకే షరతులు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.