జడ్జిల నియామకంలో వివక్ష.. రాష్ట్రపతికి మాజీ సీజేఐ బీఆర్ గవాయ్ లేఖ

జడ్జిల నియామకంలో వివక్ష..  రాష్ట్రపతికి మాజీ సీజేఐ బీఆర్ గవాయ్ లేఖ
  •  ఒకే సామాజిక వర్గానికి పెద్దపీట అంటూ ఆరోపణ
  • కొలీజియం పనితీరుపై అసంతృప్తి
  • అణగారిన వర్గాలకు న్యాయం చేయాలని విజ్ఞప్తి 

న్యూఢిల్లీ: ఉన్నత న్యాయవ్యవస్థలో ఇటీవల జరుగుతున్న నియామకాలు, బదిలీలపై భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కొలీజియం పనితీరులో ప్రతిభ, సమ్మిళితత్వ సూత్రాలను పూర్తిగా విస్మరించి, ఒకే సామాజిక వర్గానికి ప్రాధాన్యం ఇస్తున్నారని ఆరోపిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు మూడు పేజీల లేఖ రాశారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీ వర్గాలు, మహిళల ప్రాతినిధ్యం తక్కువగా ఉన్న ఈ అంశంలో రాష్ట్రపతి తక్షణమే జోక్యం చేసుకోవాలని కోరారు.

 భారత న్యాయవ్యవస్థకు నేతృత్వం వహించిన తొలి బౌద్ధుడిగా, రెండో దళిత సీజేఐగా గతంలో కొలీజియం వ్యవస్థను సమర్థించిన జస్టిస్ గవాయ్.. ప్రస్తుత పరిణామాలపై ఆందోళన వ్యక్తం చేశారు. తాను సీజేఐగా ఉన్నప్పుడు అగ్రవర్ణాలతో పాటు అన్ని అణగారిన వర్గాలకు, మహిళలకు సమాన ప్రాతినిధ్యం కల్పించానని గుర్తుచేశారు. అయితే, గత నవంబర్‌లో తాను పదవీ విరమణ చేసిన తర్వాత ప్రస్తుత సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని కొలీజియం సుప్రీంకోర్టుకు కొత్తగా నియమించిన జడ్జిల ప్రక్రియలో అసంబద్ధ అంశాలకు ప్రాధాన్యం ఇచ్చారని పేర్కొన్నారు. ఆ ప్రత్యేక సామాజిక వర్గానికి చెందని అగ్రవర్ణాల వారిని కూడా పక్కనపెట్టి, 
కేవలం ఒకే వర్గాన్ని సంతృప్తి పరిచేలా నియామకాలు జరుగుతున్నాయని, దీనిని ఏ వర్గానికో వ్యతిరేకంగా భావించరాదని స్పష్టం చేశారు.
 
హైకోర్టు న్యాయమూర్తుల్లో కేవలం 22 మంది ఎస్సీలు..

 2018 నుంచి నియమితులైన 715 మంది హైకోర్టు న్యాయమూర్తుల్లో కేవలం 22 మంది ఎస్సీలు, 16 మంది ఎస్టీలు, 89 మంది ఓబీసీలు, 37 మంది మైనారిటీలు మాత్రమే ఉన్నారని వివరించారు. 2021–2026 మధ్య నియామకాల్లో అగ్రవర్ణాల వాటా 80% ఉందని, దేశ జనాభాలో 40 నుంచి 50% ఉన్న ఓబీసీలకు 14% లోపే ప్రాతినిధ్యం దక్కిందని పేర్కొన్నారు. దేశ జనాభాలో 5% లోపు ఉన్న ఒక వర్గానికి సుప్రీంకోర్టులో 40% పైగా ప్రాతినిధ్యం ఉందని తెలిపారు. రాజ్యాంగ బద్ధమైన సమాన ప్రాతినిధ్యం కోసం జోక్యం చేసుకోవాలని రాష్ట్రపతికి విజ్ఞప్తి చేశారు.