రాయ్‌పూర్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం.. BJP ఎంపీ లక్ష్మీ వర్మకు తీవ్ర గాయాలు

రాయ్‌పూర్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం.. BJP ఎంపీ లక్ష్మీ వర్మకు తీవ్ర గాయాలు

రాయ్‌పూర్: బీజేపీ సీనియర్ నేత, రాజ్యసభ ఎంపీ లక్ష్మీ వర్మ తీవ్రంగా గాయపడ్డారు. శుక్రవారం (నవంబర్ 22న) బలోదా బజార్ నుంచి రాయ్‌పూర్‌కు తిరిగి వస్తుండగా ఖరోరా పోలీస్ స్టేషన్ పరిధిలోని బంగోలి దగ్గర ఆమె ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఎంపీ లక్ష్మీ వర్మ తీవ్రంగా గాయపడ్డారు. ఆమెతో పాటు కారులో ఉన్న డ్రైవర్, వ్యక్తిగత భద్రతా అధికారి, పర్సనల్ అసిస్టెంట్ కూడా గాయపడ్డారు. 

స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను వెంటనే రాయ్‌పూర్ ఎయిమ్స్‌లో చేర్పించారు. అనంతరం ఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు.. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. అతి వేగమే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ ఘటనపై ఛత్తీస్ గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయి సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఎంపీ లక్ష్మీ వర్మ త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు. 

ఎంపీ లక్ష్మీ వర్మ ఎవరు..? 

లక్ష్మీ వర్మ ఛత్తీస్‌గఢ్ నుంచి బీజేపీ తరుఫున రాజ్యసభ ఎంపీగా ఉన్నారు. ఆమె గతంలో బీజేపీ ఛత్తీస్‌గఢ్ ఉపాధ్యక్షురాలిగా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర మహిళా కమిషన్ మాజీ సభ్యురాలిగా, రాయ్‌పూర్ జిల్లా పంచాయత్ మాజీ అధ్యక్షురాలిగా పని చేశారు.  ఎఫ్‌ఎస్‌ఎన్‌ఎల్‌లో (భారత ప్రభుత్వ ఉక్కు మంత్రిత్వ శాఖ) మాజీ స్వతంత్ర డైరెక్టర్‌గాను వ్యవహరించారు.