నియామీ(నైజర్): పశ్చిమ నైజర్‌లోని ఒక సైనిక స్థావరంపై సాయుధ దుండగులు జరిపిన దాడిలో నేషనల్ గార్డ్‌కు చెందిన 13 మంది సైనికులు మరణించగా, మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషయాన్ని ఆ దేశ రక్షణ శాఖ వెల్లడించింది. గురువారం అర్థరాత్రి ప్రభుత్వ టెలివిజన్ వెల్లడించిన ప్రకారం, టిల్లాబేరి ప్రాంతంలోని సనమ్ వద్ద ఈ దాడి జరిగింది. సైన్యం జరిపిన ఎదురుదాడిలో పలువురు దుండగులు కూడా హతమయ్యారని, వారి ఆయుధ సామగ్రిని ధ్వంసం చేశామని రక్షణ మంత్రిత్వ శాఖ పేర్కొంది.
భారీ ఆయుధాలతో కూడిన పెద్ద బృందం ఈ దాడికి పాల్పడిందని, ప్రస్తుతం వారి కోసం సైన్యం గాలింపు చేపట్టిందని అధికారులు తెలిపారు. గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. నైజర్, దాని పొరుగు దేశాలు మాలి, బుర్కినా ఫాసోలు గత కొన్ని సంవత్సరాలుగా అల్-ఖైదా, ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థలతో సంబంధం ఉన్న జిహాదీ తిరుగుబాటుదారులతో పోరాడుతున్నాయి. 2023 జులైలో సైన్యం ప్రభుత్వాన్ని కూల్చివేసి అధికారాన్ని చేజిక్కించుకున్నప్పటి నుంచి నైజర్‌లో భద్రతా సంక్షోభం ముదిరిందని విశ్లేషకులు చెబుతున్నారు.
