- కార్డు లేకున్నా ఇందిరమ్మ బీమాకు అప్లై చేసుకోవచ్చన్న ప్రభుత్వం
- ఇంకా ఆప్షన్ రాలేదంటున్న సిబ్బంది
- రిజిస్ర్టేషన్ కాకపోవడంతో సమస్యలు
- ఈకేవైసీ పెండింగ్‌తో కార్డుల్లో పేర్ల తొలగింపు
- ఆందోళన చెందుతున్న సామాన్యులు
మంచిర్యాల, వెలుగు: రాష్ర్ట ప్రభుత్వం ఈ నెల 19న ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకంలో పేదల గుర్తింపునకు రేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకోవడం తెలిసిందే. అయితే తెలంగాణలో నేటికీ వేలాది కుటుంబాలు కార్డుల కోసం ఎదురుచూస్తున్నాయి. వారికి ఇప్పటికిప్పుడు జారీ చేసే అవకాశం లేకపోవడంతో ప్రభుత్వం ఒక వెసులుబాటు కల్పించింది. రేషన్ కార్డు లేకున్నా బీమాకు దరఖాస్తు చేసుకోవచ్చునని ప్రకటించింది. కానీ, క్షేత్రస్థాయిలో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉన్నది. కార్డు లేకపోతే ఆన్లైన్లో రిజిస్ర్టేషన్ కావడం లేదు. రేషన్ కార్డు నంబర్‌నే ఇన్సూరెన్స్ అప్లికేషన్ నంబర్‌గా పరిగణిస్తుండడంతో కార్డు లేనివారిని ఎంట్రీ చేయడం సాధ్యపడడం లేదని సిబ్బంది చెబుతున్నారు.
దీనికి సంబంధించి ఇప్పటివరకు ఎటువంటి గైడ్‌లైన్స్ రాలేదని పేర్కొంటున్నారు. దీంతో చాలామంది బీమా నమోదు సెంటర్లకు వెళ్లి నిరాశతో వెనుతిరుగుతున్నారు. రేషన్ కార్డు లేకుండా బీపీఎల్ కుటుంబాలను ఎలా గుర్తించాలి? దానికి ఏ డాక్యుమెంట్లను ప్రామాణికంగా తీసుకోవాలి? అన్నది ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాల్సిన అవసరమున్నది. లేదంటే వేలాది పేద కుటుంబాలు రేషన్ కార్డు లేదన్న కారణంగా ఇన్సూరెన్స్ స్కీమ్‌కు దూరమయ్యే పరిస్థితి నెలకొన్నది.
రేషన్ కార్డుల్లో పేర్ల తొలగింపు...
రేషన్ కార్డుదారులు తప్పనిసరిగా ఈకేవైసీ చేసుకోవాలని ప్రభుత్వం నిర్దేశించింది. ఇందుకోసం పలుమార్లు గడువులు పొడిగించింది. అయినప్పటికీ చాలామంది నిర్లక్ష్యం వహించారు. దీంతో వారి పేర్లను రేషన్ కార్డుల్లో నుంచి తొలగించారు. వారికి రేషన్ సైతం కట్ చేశారు. ఉదాహరణకు ఒక కుటుంబంలో నలుగురు సభ్యులు ఉంటే రేషన్ కార్డు మహిళ పేరిట జారీ చేశారు. ఈకేవైసీ చేసుకోకపోవడంతో మిగతా ముగ్గురి పేర్లను తొలగించారు. ఇలాంటి వారికి బీమా నమోదులో చుక్కెదురవుతోంది. నిబంధనల ప్రకారం 59 ఏండ్ల లోపు వయస్సు గల కుటుంబ యజమానికి బీమా వర్తింపజేస్తూ భార్య, లేదా కుటుంబసభ్యులను నామినీలుగా నమోదు చేస్తున్నారు. రేషన్ కార్డు భార్య పేరిట ఉండి, అందులో భర్త పేరు డిలీట్ కావడం సమస్యగా మారింది. మహిళ పేరిట బీమా చేద్దామన్నా రేషన్ కార్డులో ఆ ఒక్క పేరు మాత్రమే చూపుతుండడంతో ఆన్లైన్లో నమోదు కావడం లేదు.
ఈకేవైసీ చేసుకుంటేనే బీమా...
ఈకేవైసీ చేసుకోనందుకు రేషన్ కార్డుల్లో పేర్లు డిలీట్ అయినవారు వెంటనే సంబంధిత రేషన్ డీలర్లను సంప్రదించి ఈకేవైసీ చేసుకోవాలని ఆఫీసర్లు సూచిస్తున్నారు. అంతకుముందు రేషన్ కార్డుల్లో నుంచి తొలగించిన పేర్లను తిరిగి అందులో నమోదు చేయించాలి. దీనికి సదరు కుటుంబసభ్యులు ఆధార్ కార్డులతో మీ సేవలో దరఖాస్తు చేయాలి. తహసీల్దార్లు ఆమోదించిన తర్వాత ఆ పేర్లు రేషన్ కార్డుల్లో రీ ఎంట్రీ చేయబడుతాయి. అనంతరం ఈకేవైసీ చేసుకోవాలి. ఈ ప్రక్రియ పూర్తికావడానికి ఎంత టైమ్ పడుతుందో తెలియదు. బీమా పథకంలో నమోదుకు ప్రభుత్వం నెలరోజులు గడువు ఇవ్వగా, ఇప్పటికే వారం రోజులు గడిచాయి. దీంతో అన్ని అర్హతలు ఉండి కూడా ఇన్సూరెన్స్ స్కీమ్ అందకుండా పోతుందేమోనని సామాన్యులు దిగులు పడుతున్నారు. పేదలకు రూ.5 లక్షల బీమా దీమా కల్పించాలన్న సర్కారు ఆశయం నెరవేరాలంటే పై అంశాలపై వెంటనే స్పందించాల్సిన అవసరమున్నది.
