అమెరికాలో రాకాసి అలల బీభత్సం.. కుప్పకూలిన పసిఫికా ఫియర్

అమెరికాలో రాకాసి అలల బీభత్సం.. కుప్పకూలిన పసిఫికా ఫియర్

శాన్ ఫ్రాన్సిస్కో, వెలుగు: అమెరికాలో థాంక్స్ గివింగ్ పండుగ సమయంలో భీకర వాతావరణం నెలకొంది.  కాలిఫోర్నియా తీరంలో రాకాసి అలలు ఎగసిపడుతుండటంతో తీరంలో భయంకర వాతావరణం కొనసాగుతోంది.  తుపాను, అలల ఉధృతి వల్ల దేశవ్యాప్తంగా లక్షలాది మంది ఇబ్బందులు పడుతున్నట్లు అధికారులు తెలిపారు. కింగ్ టైడ్స్ గా పిలిచే రాకాసి అలల ధాటికి పసిఫికా ఫియర్ కుప్పకూలిపోయింది. ఈ వీడియోలు వైరల్ గా మారింది. 

కాలిఫోర్నియా తీరంలో కింగ్ టైడ్స్ బీభత్సం సృష్టించాయి. శాన్ ఫ్రాన్సిస్కోకు దక్షిణంగా ఉన్న పసిఫికాలో  సముద్రపు అలలు ఒక పసిఫికా పియర్‌ను ధ్వంసం చేశాయి. తీర ప్రాంత ఆస్తులు నీట మునిగాయి. శాన్ ఫ్రాన్సిస్కో బే, శాన్ పాబ్లో బే ప్రాంతాల్లో వరద హెచ్చరికలు జారీ చేశారు. 

స్ట్రిన్సన్ బీచ్ దగ్గర నివసించే వారిని సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని మారిన్ కౌంటీ అధికారులు సూచించారు. దక్షిణ కాలిఫోర్నియాలో కూడా అలల ఉధృతి ఎక్కువగా ఉందని పేర్కొన్నారు. శాన్ డియాగోలో   8 అడుగుల 11 అంగుళాల ఎత్తులో అలలు ఎగిసిపడ్డాయి. లాస్ ఏంజిల్స్‌లో 8.19 అడుగుల మేర అలలు నమోదయ్యాయి. 

సూర్యుడు, చంద్రుడి గురుత్వాకర్షణ శక్తి వల్ల వచ్చే కింగ్ టైడ్స్‌కు 2026 సూపర్ ఎల్ నినో తోడైంది. దీనివల్ల పసిఫిక్ సముద్ర జలాలు వేడెక్కి అలల ఉధృతి పెరిగినట్లు అధికారులు వెల్లడించారు. అమెరికా తూర్పు తీరంలో నార్ ఈస్టర్ తుపాను ప్రభావం చూపుతోంది. ఈ క్రమంలో భారీ వర్షాలు, బలమైన గాలులు వీస్తున్నాయి. 

100 ఏళ్లలో తొలిసారి మేసీ పరేడ్ వాయిదా

వాతావరణం అనుకూలించకపోవడంతో న్యూయార్క్‌లో నిర్వహించే 100వ మేసీ థాంక్స్ గివింగ్ పరేడ్ వాయిదా పడింది. 2026 నవంబర్ 26 ( గురువారం) జరగాల్సిన ఈ వేడుకను  శనివారానికి (నవంబర్ 28) మార్చారు. వంద ఏళ్ల చరిత్రలో వాతావరణం కారణంగా పరేడ్ వాయిదా పడటం ఇదే తొలిసారి. బలమైన గాలుల వల్ల ప్రదర్శనలో వాడే భారీ బెలూన్లు ప్రేక్షకులకు ప్రమాదకరంగా మారతాయని ఈ నిర్ణయం తీసుకున్నారు. 

పండుగ కోసం ప్రయాణాలు చేసే లక్షలాది మందికి ఈ తుపాను ఆటంకంగా మారింది. మరోవైపు ఐరోపాలోని ఆల్ప్స్ పర్వత ప్రాంతాల్లో భారీగా మంచు కురుస్తోంది.ఫ్రాన్స్‌లోని టిగ్నెస్-వాల్ డీ ఇసెరే ప్రాంతంలో గురువారం నాటికి 120 సెంటీమీటర్ల మేర మంచు పేరుకుపోయింది. లెస్ డ్యూక్స్ ఆల్ప్స్, ఆల్ప్ డీ హ్యూజ్, లెస్ ట్రోయిస్ వ్యాలీస్ ప్రాంతాల్లోనూ భారీగా మంచు పడింది. ఫ్రాన్స్, స్విట్జర్లాండ్, ఇటలీ, ఆస్ట్రియాలోని మరికొన్ని ప్రాంతాల్లో రాబోయే రోజుల్లో మంచు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.