హైదరాబాద్, వెలుగు: అసిస్టెంట్ ప్రొఫెసర్, లెక్చరర్ అర్హత కోసం నిర్వహించిన తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టీజీ-సెట్–2026) ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఉస్మానియా యూనివర్సిటీ ఈ ఫలితాలను అధికారికంగా ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా 2,371 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. శుక్రవారం ఓయూలో టీజీ సెట్ ఫలితాలను ఓయూ వీసీ ప్రొఫెసర్ కుమార్ మొలుగరం, రిజిస్ర్టార్ నరేశ్ కుమార్, తెలుగు వర్సిటీ వీసీ నిత్యానందరావు తదితరులు రిలీజ్ చేశారు.
కాగా, సెప్టెంబర్ 28, 29, 30 తేదీల్లో మొత్తం 29 సబ్జెక్టులకు ఆన్ లైన్ లో నిర్వహించారు. ఈ పరీక్షకు మొత్తం 40,863 మంది అభ్యర్థులు రిజిస్టర్ చేసుకోగా, 35,003 మంది పరీక్ష రాశారు. వీరిలో 2,371 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్, లెక్చరర్‌షిప్‌కు అర్హత పొందారు. అభ్యర్థులు తమ ఫలితాలను www.telanganaset.org, www.osmania.ac.in వెబ్సైట్లలో చూసుకోవచ్చని వర్సిటీ వీసీ కుమార్ మొలుగరం ప్రకటించారు.
