హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని ప్రభుత్వ, లోకల్ బాడీ, కేజీబీవీ, మోడల్ స్కూళ్లు, టీజీఆర్ఐఈ విద్యాసంస్థల్లోని పదో తరగతి విద్యార్థుల కోసం డిసెంబర్‌లో మ్యాథ్స్ టాలెంట్ టెస్ట్ (క్విజ్ పోటీలు) నిర్వహించనున్నట్లు ఎస్సీఈఆర్టీ ప్రకటించింది.
రాష్ట్రీయ ఆవిష్కార్ అభియాన్ (ఆర్ఏఏ) కింద మ్యాథమెటిక్స్ ఫోరం సహకారంతో మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో ఈ పోటీలు జరగనున్నాయి. ఈ మేరకు ఎస్‌సీఈఆర్టీ డైరెక్టర్ జి. రమేశ్ శుక్రవారం షెడ్యూల్ రిలీజ్ చేశారు.
డిసెంబర్ 5న మండల స్థాయిలో, ఇందులో విజేతలుగా నిలిచిన వారికి 11న జిల్లా స్థాయిలో, అనంతరం 21న హైదరాబాద్‌లో రాష్ట్ర స్థాయి పోటీలు నిర్వహిస్తారు. తెలుగు, ఇంగ్లిష్, ఉర్దూ మీడియం విద్యార్థులందరికీ సమాన అవకాశాలు కల్పిస్తున్నట్లు ఎస్సీఈఆర్టీ స్పష్టం చేసింది. పోటీల నిర్వహణ కోసం 33 జిల్లాలకు ఒక్కో జిల్లాకు రూ.15 వేల చొప్పున మొత్తం రూ.4.95 లక్షలు మంజూరు చేస్తూ, విద్యార్థులు, టీచర్లకు భోజనం, స్నాక్స్, సర్టిఫికెట్లు, విజేతలకు బహుమతులు, మెమెంటోలు అందజేయాలని డీఈవోలను ఆదేశించింది.
