ప్రకృతి పరిరక్షణలో రేవంత్ కృషి అభినందనీయం : గురుదేవ్ శ్రీశ్రీ రవిశంకర్

ప్రకృతి పరిరక్షణలో రేవంత్ కృషి అభినందనీయం : గురుదేవ్ శ్రీశ్రీ రవిశంకర్
  • చెరువుల పునరుద్ధరణ, డ్రగ్స్ నియంత్రణపై శ్రీశ్రీ రవిశంకర్ ప్రశంసలు
  • ప్రపంచంలోనే తొలిసారిగా క్లైమేట్ యాక్షన్‌కు కార్యాచరణ
  • కాప్ సదస్సుల్లో చర్చలే.. తెలంగాణలో పనులు షురూ చేశారని వ్యాఖ్య

హైదరాబాద్: వాతావరణ మార్పుల నియంత్రణకు సీఎం రేవంత్ రెడ్డి చేపట్టిన చర్యలు ప్రపంచంలోనే తొలిసారిగా చెప్పుకోదగ్గవని ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు గురుదేవ్ శ్రీశ్రీ రవిశంకర్ ప్రశంసించారు. చెరువుల పునరుద్ధరణ, డ్రగ్స్ నియంత్రణకు తీసుకుంటున్న చర్యలను అభినందించారు. తెలంగాణ క్లైమేట్ కాన్‌క్లేవ్ కర్టెన్ రైజర్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కాప్–20, 21, 22తోపాటు ఇటీవల ఇస్తాంబుల్‌లో జరిగిన అంతర్జాతీయ సదస్సుల్లో చర్చలే తప్ప క్షేత్రస్థాయి ఫలితాలు తక్కువగా ఉన్నాయని రవిశంకర్ అన్నారు.

తెలంగాణలో మాత్రం సీఎం రేవంత్ రెడ్డి ప్రణాళికతో పనులు ప్రారంభించారని చెప్పారు. కార్యక్రమానికి ముందు చెరువుల పునరుద్ధరణ వివరాలు తెలుసుకున్నానని, ఇది సమాజానికి ఆదర్శంగా నిలుస్తుందని పేర్కొన్నారు. డిప్రెషన్‌తో బాధపడేవారు తమ గదిని కూడా శుభ్రంగా ఉంచుకోలేరని, అలాంటివారు సమాజం, ప్రకృతి గురించి ఎలా ఆలోచిస్తారని రవిశంకర్ అన్నారు. దేశాన్ని నశా ముక్త్​గా మార్చేందుకు సీఎం చేపడుతున్న చర్యలు అభినందనీయమన్నారు. 

జెన్​జీకి ప్రకృతి స్పృహ

నేటి జెన్–జీ యువతలో వినియోగవాదం కంటే పర్యావరణంపై స్పృహ పెరిగిందన్నారు. 'ధర్మో రక్షతి రక్షితః' అన్నట్లు ప్రకృతిని కాపాడితే అది మనల్ని కాపాడుతుందని చెప్పారు. ప్రకృతి వనరుల దుర్వినియోగం వల్లే ఎల్‌నినో, కరువు, అతివృష్టి, అనావృష్టి వంటి విపత్తులు వస్తున్నాయని పేర్కొన్నారు. ప్రతి ఇంట్లో ప్రకృతిపై సంవేదన పెరగాలని ఆకాంక్షించారు. ప్రకృతి వనరులను కాపాడుకుంటూనే సాంకేతికతలో ముందుకు సాగాలని రవిశంకర్ సూచించారు.

బెంగళూరుతో టెక్నాలజీలో పోటీపడుతున్న హైదరాబాద్.. ప్రకృతి పరిరక్షణకూ ప్రాధాన్యం ఇవ్వడం శుభపరిణామమన్నారు. అన్ని ప్రయత్నాలకూ మానసిక ఆరోగ్యమే పునాది అన్నారు. డబ్ల్యూహెచ్‌వో గణాంకాల ప్రకారం ప్రపంచంలో ప్రతి నలుగురిలో ఒకరు మానసిక సమస్యలతో బాధపడుతున్నారని, బాధితుల్లో మూడింట రెండొంతుల మంది భారత్‌కు చెందినవారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతి 40 సెకన్లకు ప్రపంచంలో ఒక ఆత్మహత్య జరుగుతోందని తెలిపారు. ఐఐటీలు, ఐఐఎంలు, కాలేజీల్లో విద్యార్థుల ఆత్మహత్యలను నివారించాల్సిన అవసరం ఉందన్నారు.