హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని విద్యాసంస్థల్లో మత్తు పదార్థాల వినియోగాన్ని అరికట్టడంతో పాటు విద్యాసంస్థల యాజమాన్యాల జవాబుదారీతనాన్ని ఖరారు చేసేందుకు ప్రభుత్వం కొత్త చట్టాన్ని తీసుకురానుంది. ‘తెలంగాణ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ (ప్రివెన్షన్ ఆఫ్ సబ్‌స్టాన్స్ అబ్యూజ్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటబిలిటీ) బిల్లు–2026’ ముసాయిదా రూపకల్పన కోసం నియమించిన కమిటీ ఈ నెల 30న సెక్రటేరియెట్ లో సమావేశం కానుంది.
కాలేజియేట్ ఎడ్యుకేషన్ కమిషనర్ ఎ. శ్రీదేవసేన చైర్‌పర్సన్‌గా ఉన్న ఈ కమిటీ సమావేశానికి సంబంధించి ఉన్నత విద్యాశాఖ ప్రత్యేక కార్యదర్శి వెంకటేశ్ ధోత్రే మెమో జారీ చేశారు. రాష్ట్రంలోని స్కూళ్లు, జూనియర్ కాలేజీలు, పాలిటెక్నిక్, టెక్నికల్, ఒకేషనల్ విద్యాసంస్థలు, డిగ్రీ కాలేజీలు, యూనివర్సిటీలన్నింటికీ ఈ బిల్లు వర్తించనుంది. దీనికి గత నెలలో సీఎస్ సంజయ్ జాజు 16 మంది సభ్యులతో కమిటీని ఏర్పాటు చేశారు.
స్క్రీనింగ్, కౌన్సెలింగ్.. పెనాల్టీలపై కసరత్తు
ముసాయిదా బిల్లులో భాగంగా మత్తు పదార్థాల నివారణ, స్క్రీనింగ్/టెస్టింగ్, కౌన్సెలింగ్, చికిత్స, పునరావాసం, విద్యార్థుల ప్రైవసీ, సంక్షేమం, అమలు, జరిమానాలు వంటి అంశాలను కమిటీ లోతుగా పరిశీలించనుంది. దశలవారీ అమలుతో పాటు పరిపాలన, ఆర్థిక అంశాలను అంచనా వేయనుంది. సమగ్ర ముసాయిదా బిల్లును సిద్ధం చేసేందుకు 30న జరిగే అత్యవసర సమావేశానికి సభ్యులందరూ తగిన సమాచారం, సూచనలతో విధిగా హాజరుకావాలని ఆదేశించారు.
