క్యూఆర్ కోడ్‌తో ఉచితంగా..రైతులకు వాటర్‌ప్రూఫ్ పాస్‌బుక్స్

క్యూఆర్ కోడ్‌తో ఉచితంగా..రైతులకు వాటర్‌ప్రూఫ్ పాస్‌బుక్స్
  • వ్యవసాయ, ఆబాదీ ఆస్తులకు రెండు వేర్వేరుగా ఇస్తాం
  • 10,750 గ్రామాల్లో ప్రతి అంగుళం సమగ్ర భూ రీ-సర్వే
  • భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపుతాం
  • మీడియాతో చిట్‌చాట్‌లో మంత్రి పొంగులేటి 

హైదరాబాద్, వెలుగు: సమగ్ర భూ రీ-సర్వే అనంతరం రాష్ట్రంలోని రైతులకు క్యూఆర్ కోడ్‌తో ఉచితంగా వాటర్‌ప్రూఫ్ పాస్‌బుక్‌లు జారీ చేయనున్నట్లు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. వ్యవసాయ భూములకు, ఆబాదీ ఆస్తులకు రెండు వేర్వేరుగా పాస్‌బుక్‌లు ఇవ్వనున్నట్లు తెలిపారు. ప్రతి ల్యాండ్ పార్శిల్‌కు ఒక ఎల్‌పీఎం నంబర్ కేటాయించి, శాటిలైట్ మ్యాపింగ్‌తో భూముల వివరాలను అనుసంధానం చేస్తామని చెప్పారు.

ఏడాదిన్నరలో 2028 మధ్య నాటికి రాష్ట్రంలోని మొత్తం 10,750 గ్రామాల్లో ప్రతి అంగుళం భూమిని సర్వే చేసి ఈ నూతన పాస్‌బుక్‌లు అందిస్తామని స్పష్టం చేశారు. శుక్రవారం సచివాలయంలో మీడియా ప్రతినిధులతో నిర్వహించిన చిట్‌చాట్‌లో మంత్రి మాట్లాడారు. కొత్త పాస్ పుస్తకాలు చిరిగిపోకుండా, నీళ్లలో తడవని విధంగా రూపొందిస్తున్నామన్నారు. క్యూఆర్ కోడ్ స్కాన్ చేయగానే సంబంధిత భూమి సర్వే నంబర్, ఎల్‌పీఎం విస్తీర్ణం, శాటిలైట్ ల్యాండ్ పార్శిల్ మ్యాప్, హద్దులన్నీ కనిపిస్తాయని వివరించారు.

ఒకే గ్రామంలో వేర్వేరు చోట్ల భూములుంటే ఒకే పాస్‌బుక్‌లో వేర్వేరు పేజీల్లో వివరాలు ఉంటాయని, రికార్డులు కాలిపోయినా, భూకంపం వచ్చినా డేటా సురక్షితంగా ఉంటుందన్నారు. వ్యవసాయ భూములకు ఒక రంగు, గ్రామాల్లో పత్రాలు లేని ఆబాదీ (గ్రామకంఠం) ఇండ్లు, స్థలాలకు (100, 150 లేదా 500 గజాలు) మరో రంగులో పాస్ పుస్తకాలు జారీ చేస్తామన్నారు.

నిబంధనలు ఉల్లంఘించే అధికారులపై చర్యలు..

మొదటి విడతలో హైదరాబాద్ మినహా 32 జిల్లాల్లో జిల్లాకు 70 గ్రామాలతోపాటు నక్షాలు లేని 373 గ్రామాల్లో (డిసెంబర్ చివరినాటికి సుమారు 2,300 గ్రామాలు) సర్వే పూర్తి చేస్తామని మంత్రి చెప్పారు. ఇందుకోసం రాష్ట్ర స్థాయిలో 840, కలెక్టర్ల ద్వారా 700 కలిపి మొత్తం 1,550 రోవర్లు కొనుగోలు చేశామని, 4 ఎకరాలను 10 నిమిషాల్లోనే సర్వే చేస్తున్నారని వివరించారు. ఇప్పటికే 9 ఉమ్మడి జిల్లాల్లో పర్యటించి స్థానిక ప్రజాప్రతినిధులతో ఒక్కోచోట 4 నుంచి 6 గంటల పాటు చర్చించామని, తన సొంత నియోజకవర్గం పాలేరులో 10–15 గ్రామాల్లో సర్వే చివరి దశకు వచ్చిందన్నారు.

మండలానికి రెండు సర్వే యూనిట్లు (రెగ్యులర్ సర్వేయర్, లైసెన్స్‌డ్ సర్వేయర్, జీపీవో) ఏర్పాటు చేసి.. ముందుగా గ్రామసభ, చాటింపు ద్వారా సమాచారం ఇచ్చి గ్రామ సరిహద్దు, ఆబాదీ, ఫారెస్ట్–ఎండోమెంట్–వక్ఫ్–ఇరిగేషన్–రోడ్ల హద్దులు తేల్చిన తర్వాతే ప్రైవేట్ పట్టా భూములు కొలుస్తున్నామన్నారు. సర్వేకు 3 రోజుల ముందు జాబితా, ముందురోజు 100 జెండాలు ఇవ్వడంతో 90 శాతం మంది రైతులు పరస్పర అవగాహనతో జెండాలు పాతుకుంటున్నారని, సర్వే తర్వాత అభ్యంతరాలు స్వీకరించి సవరణలు చేస్తామని చెప్పారు. నిబంధనలు ఉల్లంఘించే అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు.

రికార్డుల ప్రకారం పరిష్కరిస్తాం..

ఒక్కో గ్రామానికి 25–30 రోజుల సమయం పడుతుండగా తహసీల్దార్ రోజు విడిచి రోజు, ఆర్డీవో వారానికోసారి హాఫ్ డే, అడిషనల్ కలెక్టర్ వారానికోసారి, కలెక్టర్ ప్రతి 10 రోజులకోసారి పర్యవేక్షిస్తారని మంత్రి పొంగులేటి తెలిపారు. వచ్చే మంగళవారం నుంచి సచివాలయం రూమ్ నెం.33లో మూడు విడతలుగా కలెక్టర్లు, డీఎఫ్‌వోలు, పీసీసీఎఫ్‌తో సమీక్షిస్తానని పేర్కొన్నారు. డిసెంబర్‌లో తానే వారం రోజులు గ్రామాల్లో ఇందిరమ్మ ఇండ్లలో నిద్ర చేసి ప్రజలు, రైతుల సమస్యలు పరిష్కరిస్తానని తెలిపారు. ప్రైవేటు భూ వివాదాల్లో ప్రభుత్వం ఏకపక్షంగా జోక్యం చేసుకోకుండా న్యాయబద్ధంగా వ్యవహరిస్తుందని, ప్రభుత్వ భూములను మాత్రం రికార్డుల ప్రకారం పరిష్కరిస్తామని స్పష్టం చేశారు.

హెచ్చుతగ్గులు ఉన్న చోట కలెక్టర్లు, అడిషనల్ కలెక్టర్లు, ఆర్డీవోలు, తహసీల్దార్లు మూడు సమావేశాల్లో మధ్యవర్తిత్వం ద్వారా ఇరు పక్షాలకు ఆమోదయోగ్యమైన పరిష్కారం చూపడంతో 97 శాతం సమస్యలు తీరిపోతాయన్నారు. మొండికేసే 2–3 శాతం మంది పాత పాస్‌బుక్‌లు రద్దు చేయకపోయినా ఆన్‌లైన్ మ్యాపింగ్ వాస్తవ స్థితిని చూపిస్తుందన్నారు. సాదాబైనామాలతో పొజిషన్‌లో ఉన్నవారికి 100 శాతం పట్టాలు, 22ఏ పరిష్కారం లభిస్తాయని తెలిపారు. రోడ్లు–ప్రాజెక్టుల భూసేకరణ లోపాలు, అసైన్డ్ భూముల తేడాలు సవరిస్తామని, 26 లక్షల ఎకరాల ఫారెస్ట్ షార్ట్‌ఫాల్ భూములకు క్లియర్ టైటిల్ ఇస్తామని వివరించారు.

రాష్ట్రంపై కేంద్రం సవతి తల్లి ప్రేమ..

రాష్ట్రంపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సవతి తల్లి ప్రేమ చూపుతోందని మంత్రి పొంగులేటి విమర్శించారు. రాష్ట్రానికి 13 లక్షల ఇండ్లు కావాలని అడిగితే కేవలం రెండు లక్షలే మంజూరు చేశారని చెప్పారు. గతంలో జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో ఏపీకి 17 లక్షల ఇండ్లు ఇచ్చి, మొన్న మనకు రెండు లక్షలు మంజూరు చేస్తూ ఏపీకి నాలుగు లక్షల ఇండ్లు ఇచ్చారని గుర్తుచేశారు. ఈ నెల 29న కరువు పరిశీలనకు కేంద్ర బృందం వస్తోందని తెలిపారు. అధికారంలోకి వస్తామని బీఆర్ఎస్ పగటి కలలు కంటోందని ఎద్దేవా చేశారు. తమ ప్రభుత్వానికి ఎవరిపైనా కక్ష సాధింపు చర్యలు చేపట్టాలనే ఉద్దేశం లేదని స్పష్టం చేశారు.