రూ.90 వేల అప్పుతో 14 ఏండ్లుగా వెట్టిచాకిరి..ఇటుకబట్టిలో జీతాల్లేకుండా బానిస బతుకులు

రూ.90 వేల అప్పుతో 14 ఏండ్లుగా వెట్టిచాకిరి..ఇటుకబట్టిలో జీతాల్లేకుండా బానిస బతుకులు
  • నెల్లూరు జిల్లాకు చెందిన 24 మంది
  • హనుమకొండ జిల్లా కమలాపూర్‍ మండల కేంద్రంలో ఘటన
  • రెస్క్యూ చేసి బాధితులను కాపాడిన ఆఫీసర్లు 

వరంగల్‍, వెలుగు: హనుమకొండ జిల్లా కమలాపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 14 ఏండ్లుగా వెట్టిచాకిరి చేస్తున్న 24 మందిని ఆఫీసర్లు కాపాడిన ఘటన హనుమకొండ జిల్లా కమలాపూర్​ మండల కేంద్రంలో జరిగింది. బాధితులు, ఆఫీసర్ల కథనం ప్రకారం.. 

ఏపీలోని నెల్లూరు జిల్లాకు చెందిన మూడు కుటుంబాలను ఓ ఇటుకబట్టీ యజమాని రూ.90 వేలు ఇచ్చి పనికి తీసుకొచ్చాడు. వీరిలో 9 మంది పురుషులు, 9 మంది పిల్లలు, ఆరుగురు మహిళలు ఉన్నారు. 14 ఏండ్లుగా తిండి ఖర్చులు, పండుగల సమయంలో కొంత డబ్బు ఇవ్వడం తప్ప ఎలాంటి జీతాలు చెల్లించకుండా వారితో బలవంతంగా పని చేయించాడు.

 మహిళలు, పిల్లలతోనూ బాలకార్మికులుగా పని చేయిస్తూ వేధించేవాడని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. స్వగ్రామాలకు వెళ్లాలంటే వడ్డీతో సహా రూ.90 వేలు చెల్లించాలని బెదిరించేవాడని, జీతం అడిగితే విచక్షణారహితంగా కొట్టేవాడని కన్నీటిపర్యంతమయ్యారు. ఈ ఘటనపై కలెక్టర్ చాహత్ బాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పాయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు సమాచారం అందడంతో ఆఫీసర్లు రంగంలోకి దిగారు. 

గురువారం రాత్రి ఇటుకబట్టీ వద్దకు వెళ్లిన రెస్క్యూ బృందం శుక్రవారం ఉదయం బాధితులను ఆర్టీవో వెంకటేశ్ వద్దకు తీసుకువచ్చింది. తమకు న్యాయం చేసి, స్వగ్రామాలకు పంపించాలని బాధితులు అధికారులను వేడుకున్నారు. ఘటనపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇచ్చారు.