- డైరెక్ట్ మైగ్రేషన్‌లో రూ. 50 వేలు, విదేశీ భాషా కేటగిరీలో రూ. 1.75 లక్షల వరకు రాయితీ
- 2026–27లో 7 వేల మందికి లబ్ధి
- మహిళలకు 33.33%, దివ్యాంగులకు 5% రిజర్వేషన్
- తెలంగాణలో 6 నుంచి టెన్త్ క్లాస్ వరకు చదువు తప్పనిసరి
- సీఎం ఓవర్సీస్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ మార్గదర్శకాలు విడుదల
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఆర్థికంగా వెనుకబడిన వర్గాల (ఈడబ్ల్యూఎస్) నిరుద్యోగ యువత సురక్షితంగా విదేశాల్లో ఉద్యోగాలు పొందేందుకు ఉద్దేశించిన 'చీఫ్ మినిస్టర్ ఓవర్సీస్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ (సీఎంఓఈఎస్)' మార్గదర్శకాలను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. 2026–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 'తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్‌పవర్ కంపెనీ లిమిటెడ్ (టామ్‌కామ్)', ఉపాధి కల్పన–శిక్షణ శాఖ ద్వారా ఈ పథకాన్ని అమలు చేసేందుకు నైపుణ్య, మానవ వనరుల శాఖ (శక్తి) కార్యదర్శి హరిచందన ఉత్తర్వులు జారీ చేశారు.
నైపుణ్యాభివృద్ధి, అంతర్జాతీయ సర్టిఫికేషన్, విదేశీ భాషా శిక్షణ, ప్రీ–డిపార్చర్ ఓరియంటేషన్ అందించడంతో పాటు నకిలీ రిక్రూట్మెంట్ మోసాల బారిన పడకుండా యువతకు అండగా నిలవడమే దీని లక్ష్యమని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మొదటి ఏడాది రాష్ట్రవ్యాప్తంగా 7,000 మందిని (డైరెక్ట్ మైగ్రేషన్‌లో 60 శాతం అంటే 5,880 మంది, విదేశీ భాషా ఆధారిత మైగ్రేషన్‌లో 40 శాతం అంటే 1,120 మంది) ఎంపిక చేయనున్నారు.
మొత్తం వ్యయంలో ప్రభుత్వం 50 శాతం సబ్సిడీ ఇవ్వనుండగా.. మిగిలిన 50 శాతాన్ని లబ్ధిదారుడు లేదా జాతీయ బ్యాంకుల సహకారంతో రూపొందించే ప్రత్యేక రుణం ద్వారా సమకూర్చుకోవాలి. కేటగిరీ–1 (డైరెక్ట్ మైగ్రేషన్) కింద గరిష్ట అర్హత వ్యయం రూ. లక్ష కాగా, ఇందులో వీసా, విమాన ప్రయాణ ఖర్చులకు గరిష్టంగా రూ. 50 వేల వరకు (50%) సబ్సిడీ ఇస్తారు. కేటగిరీ–2 (విదేశీ భాషా ఆధారిత మైగ్రేషన్) కింద గరిష్ట వ్యయం రూ. 3.50 లక్షలు కాగా, ప్రభుత్వం గరిష్టంగా రూ. 1.75 లక్షల వరకు (50%) సబ్సిడీ అందిస్తుంది.
10 రంగాల్లో కొలువులకు రాయితీ
కేటగిరీ–2లో అభ్యర్థులు ఏదైనా ఒక ఆప్షన్‌ను మాత్రమే ఎంచుకోవాల్సి ఉంటుంది. టామ్‌కామ్ ఆమోదిత విదేశీ భాషా శిక్షణ తీసుకుంటే శిక్షణ ఫీజులో 50 శాతం సబ్సిడీ (ప్రయాణ సబ్సిడీ వర్తించదు) లేదా ముందే భాషా పరీక్ష ఉత్తీర్ణులైన వారికి వీసా, విమాన టికెట్ ఖర్చుల్లో 50 శాతం రాయితీ (శిక్షణ సబ్సిడీ ఉండదు) లభిస్తుంది. నిర్మాణ–మౌలిక సదుపాయాలు, తయారీ–పారిశ్రామిక రంగం, ఆటోమోటివ్–మెకానికల్, ఎలక్ట్రికల్–ఎలక్ట్రానిక్స్, లాజిస్టిక్స్–రవాణా, ఫెసిలిటీ మేనేజ్మెంట్, హెల్త్‌కేర్ సపోర్ట్, హాస్పిటాలిటీ–టూరిజం, రిపేర్–మెయింటెనెన్స్, డొమెస్టిక్–పర్సనల్ సర్వీసెస్ అనే 10 రంగాల్లో ఉద్యోగాలకు ఈ పథకం వర్తిస్తుంది.
ఏ సామాజిక వర్గానికైనా ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఈడబ్ల్యూఎస్ వార్షిక ఆదాయ పరిమితికి లోబడి ఉండి, 18 నుంచి 40 ఏండ్ల మధ్య వయసు ఉన్నవారు అర్హులు. సంబంధిత దేశ నిబంధనలను బట్టి మారవచ్చు. దరఖాస్తుదారుడు తెలంగాణ స్థానికుడై ఉండి 6 నుంచి 10వ తరగతి వరకు రాష్ట్రంలోనే చదివి ఉండాలి. ఐటీఐ అవసరమైన విభాగాల్లో రాష్ట్రంలోని గుర్తింపు పొందిన సంస్థ నుంచి పూర్తి చేసి ఉండాలి.
కనీసం 6 నెలల గడువున్న పాస్‌పోర్ట్, ఆధార్, రేషన్/ఆహార భద్రత కార్డు, రిజిస్ట్రేషన్ నాటి చెల్లుబాటు అయ్యే ఆదాయ ధ్రువీకరణ పత్రం, ఆధార్ లింక్డ్ బ్యాంక్ ఖాతా, మెడికల్ ఫిట్నెస్, రెండేండ్ల పని అనుభవం (ఆయా దేశాల వీసా నిబంధనలను బట్టి మినహాయింపు ఉంటుంది), వెరిఫైడ్ విదేశీ సంస్థ నుంచి జాబ్ ఆఫర్ లెటర్ తప్పనిసరి. ఒక రేషన్ కార్డులో ఒకరికి మాత్రమే అవకాశం ఉంటుంది.మొత్తం లక్ష్యంలో మహిళలకు కనీసం 33.33 శాతం, దివ్యాంగులకు 5 శాతం రిజర్వేషన్ కల్పించారు.
తప్పుడు పత్రాలు సమర్పిస్తే రాయితీ రికవరీ
పారదర్శకత కోసం దరఖాస్తుల స్వీకరణ నుంచి రాయితీ పంపిణీ వరకు ప్రక్రియ అంతా టామ్‌కామ్–సీఎంఓఈఎస్ ఆన్లైన్ పోర్టల్ ద్వారానే నిర్వహిస్తారు (ఆఫ్‌లైన్ దరఖాస్తులు అనుమతించరు). అందిన దరఖాస్తులను జిల్లా ఉపాధి అధికారి క్రోడీకరిస్తారు. ఆర్డీవో, తహసీల్దార్ ప్రాథమిక పరిశీలన చేస్తారు. అనంతరం 33 జిల్లాల్లో కలెక్టర్ల చైర్మన్‌గా ఉండే జిల్లా స్థాయి పర్యవేక్షణ కమిటీలు (డీఎల్ఎంసీ) అర్హులను సిఫారసు చేస్తాయి.
వాటిని టామ్‌కామ్ ఎండీ చైర్మన్‌గా, ప్రొటెక్టర్ ఆఫ్ ఎమిగ్రెంట్స్ (పీవోఈ) సహా వివిధ శాఖల అధికారులతో కూడిన రాష్ట్ర స్థాయి పర్యవేక్షణ కమిటీ (ఎస్ఎల్ఎంసీ) పరిశీలించి, దరఖాస్తు గడువు ముగిసిన 30 రోజుల్లోగా తుది జాబితాను ఖరారు చేస్తుంది. మహిళలు, దివ్యాంగుల కోటాలో తగిన అభ్యర్థులు లేకపోతే ఆ ఖాళీలను ఇతర అర్హులకు కేటాయించే అధికారం ఎస్ఎల్ఎంసీకి ఉంటుంది.
టామ్‌కామ్ ఎండీ నిధుల మంజూరు అధికారిగా వ్యవహరిస్తూ.. శిక్షణ పూర్తి, భాషా పరీక్ష ఉత్తీర్ణత, జాబ్ ఆఫర్, వీసా, ప్రయాణ దశల ఆధారంగా ఆధార్ లింక్డ్ ఖాతాలోకి డీబీటీ ద్వారా సబ్సిడీ జమ చేస్తారు. ప్రతి విభాగానికీ ఒకసారి మాత్రమే రాయితీ ఇస్తారు. తొలి ప్రయత్నంలో విఫలమైతే తదుపరి ఖర్చులు అభ్యర్థే భరించాలి. నమోదుకు ముందు చేసిన ఖర్చులకు క్లెయిమ్ ఉండదు. అభ్యర్థి మధ్యలో వైదొలిగినా, తప్పుడు పత్రాలు సమర్పించినా రాయితీని రికవరీ చేస్తామని మార్గదర్శకాల్లో స్పష్టం చేశారు.
