న్యూఢిల్లీ: ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీ కంపెనీలు తమ వ్యాపార విధానాలను మార్చుకుంటున్నాయి. ఈ క్రమంలో జర్మనీకి చెందిన సాఫ్ట్‌వేర్ కంపెనీ ఎస్‌ఏపీ కనీసం 10 వేల ఉద్యోగాలను తగ్గించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు బ్లూమ్‌బర్గ్ వార్తాసంస్థ వెల్లడించింది. కంపెనీలో 1.10 లక్షలకు పైగా ఉద్యోగులు ఉండగా, ఈ కోతలు మొత్తం సిబ్బందిలో దాదాపు 9 శాతానికి సమానం.
ఉత్పత్తుల అభివృద్ధి, ఇంజినీరింగ్, అమ్మకాల విభాగాలపై ప్రధానంగా దృష్టి పెట్టినట్లు సమాచారం. అయితే ఉద్యోగాల కోతపై తుది నిర్ణయం తీసుకోలేదని, కార్మిక సంఘాలతో చర్చల తర్వాత సంఖ్య మారవచ్చని తెలుస్తోంది. ఏఐ ఆధారిత సాఫ్ట్‌వేర్ సేవలకు అనుగుణంగా సంస్థను మార్చడమే ఈ పునర్వ్యవస్థీకరణ లక్ష్యం. గతంలో 2024లోనూ ఎస్‌ఏపీ సుమారు 10,000 ఉద్యోగులను తొలగించింది.
ఇన్‌స్టామార్ట్‌లో 340 మంది ఔట్
క్విక్ కామర్స్ రంగంలోనూ ఉద్యోగాల కోత చోటుచేసుకుంది. స్విగ్గీకి చెందిన ఇన్‌స్టామార్ట్ సుమారు 340 మంది ఉద్యోగులను తొలగించినట్లు సమాచారం. సంస్థాగత, సహాయక విభాగాల్లో ఈ కోతలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ఏఐ వినియోగం, పనిలో మార్పులు, విభాగాల మధ్య ఉన్న పునరావృత బాధ్యతలను తగ్గించడం ద్వారా సామర్థ్యాన్ని పెంచుకోవడమే లక్ష్యమని సంబంధిత వర్గాలు తెలిపాయి. సెప్టెంబర్ త్రైమాసికంలో ఇన్‌స్టామార్ట్ సర్దుబాటు చేసిన ఇబిటా నష్టం రూ.895 కోట్లకు పెరిగింది. నికర ఆర్డర్ విలువ 13.4 శాతం పెరిగి రూ.6,594 కోట్లకు చేరింది. కొత్తగా 69 డార్క్ స్టోర్లను ప్రారంభించడంతో
మొత్తం సంఖ్య 1,240కి చేరింది.
