- లిస్ట్‌లో జారా, హెచ్&ఎం, సెలియో, మార్క్స్ & స్పెన్సర్
- ఇండియన్ కంపెనీలకు 18 రోజుల్లో రూ.2,140 కోట్ల ఆర్డర్లు
- వియత్నాం, కంబోడియా, ఇండోనేషియా వైపు కూడా చూస్తున్న బ్రాండ్లు
న్యూఢిల్లీ: బంగ్లాదేశ్ సంక్షోభంతో ఇండియా లాభపడుతోంది. పొరుగు దేశంలో కార్మికుల ఆందోళనలు, రాజకీయ అనిశ్చితి, తయారీ ఖర్చులు పెరగడంతో గ్లోబల్ ఫ్యాషన్ బ్రాండ్లు ఇతర దేశాలకు తరలిపోతున్నాయి. బట్టల తయారీకి ఆటంకాలు ఏర్పడటంతో జారా, హెచ్&ఎం, మార్క్స్ & స్పెన్సర్, సీలియో వంటి అంతర్జాతీయ బ్రాండ్లు ఇప్పుడు ప్రత్యామ్నాయ దేశాల వైపు చూస్తున్నాయి.
నవంబర్ 1–18 మధ్య బంగ్లాదేశ్ నుంచి దాదాపు 254 మిలియన్ డాలర్ల (సుమారు రూ. 2,140 కోట్లు) విలువైన ఆర్డర్లు ఇతర దేశాలకు మళ్లగా, అందులో ఎక్కువభాగం భారత్‌కే దక్కాయని అంతర్జాతీయ వార్తా సంస్థ రాయిటర్స్ వెల్లడించింది. వియత్నాం, కంబోడియా, ఇండోనేషియా దేశాలకు కూడా కొన్ని ఆర్డర్లు వెళ్లాయి.
బంగ్లాదేశ్‌ను ఎందుకు వీడుతున్నాయంటే?
బంగ్లాదేశ్ ఎగుమతుల్లో 80 శాతానికి పైగా వాటా గార్మెంట్స్ సెక్టార్దే ఉంది. దాదాపు 40 శాతం తయారీ రంగ ఉద్యోగాలు ఇందులోనే ఉన్నాయి. కార్మికుల కనీస వేతనాలను ప్రభుత్వం 36 శాతం పెంచినప్పటికీ, ఆందోళనలు ఆగకపోవడంతో ఇప్పటివరకు 400 మిలియన్ డాలర్లకు పైగా (సుమారు రూ. 3,370 కోట్లు) ఉత్పత్తి నష్టం వాటిల్లిందని బంగ్లాదేశ్ గార్మెంట్ మాన్యుఫ్యాక్చరర్స్ అండ్ ఎక్స్‌పోర్టర్స్ అసోసియేషన్ (బీజీఎంఈఏ) అంచనా వేసింది.
ఫ్యాషన్ బ్రాండ్లకు సీజన్ ప్రకారం సమయానికి బట్టలు చేరడం చాలా ముఖ్యం. ఆలస్యమైతే అమ్మకాలు దెబ్బతింటాయి. భారత్, వియత్నాం వంటి దేశాలు 60 నుంచి 90 రోజుల్లో ఆర్డర్లను పూర్తి చేస్తుంటే, బంగ్లాదేశ్‌లో ఏకంగా 120 రోజులు పడుతోంది. డెలివరీ గడువు దాటిపోతుందన్న భయంతో కంపెనీలు ధర కొంచెం ఎక్కువైనా పర్వాలేదని భారత్ వైపు మొగ్గు చూపుతున్నాయని బీజీఎంఈఏ డైరెక్టర్ ఎం. మొహియుద్దీన్ చౌదరి పేర్కొన్నారు.
తిరుప్పూర్‌కు క్యూ కడుతున్న బ్రాండ్లు
మన దేశంలో తిరుప్పూర్, బెంగళూరు, నోయిడా, గురుగ్రామ్, లుధియానా, అహ్మదాబాద్ వంటి ప్రాంతాల్లో గార్మెంట్స్ తయారీ కేంద్రాలు, నైపుణ్యం గల కార్మికులు ఎక్కువగా ఉన్నారు. కొత్త ఆర్డర్ల కోసం జారా, హెచ్&ఎం ప్రతినిధులు ఇప్పటికే తిరుప్పూర్ ఫ్యాక్టరీలను సందర్శించడం విశేషం. కాగా, సీఐఐ బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ రిపోర్ట్ ప్రకారం, భారత్‌లో వ్యవసాయం తర్వాత 4.5 కోట్ల మందికి ఉపాధి కల్పిస్తున్న అతిపెద్ద రంగం గార్మెంట్స్ ఇండస్ట్రీనే. బంగ్లాదేశ్ నుంచి వస్తున్న ఈ ఆర్డర్లను అందిపుచ్చుకునే సత్తా మనకుంది.
సవాళ్లు లేకపోలేదు..
గత పదేళ్లుగా భారత గార్మెంట్స్ ఎగుమతులు 37 బిలియన్ డాలర్ల వద్దే నిలిచిపోయాయి. మన దగ్గర నూలు, బట్టల ఉత్పత్తి బాగున్నప్పటికీ, పూర్తిస్థాయి రెడీమేడ్ దుస్తులను భారీ స్థాయిలో ఎగుమతి చేయడంలో వెనుకబడ్డాం. ముఖ్యంగా సింథటిక్ ఫైబర్‌తో తయారయ్యే స్పోర్ట్స్‌వేర్, జాకెట్లు, నిట్వేర్ విభాగాల్లో ప్రపంచ మార్కెట్లో మన దేశ వాటా 1 శాతం కంటే తక్కువే ఉంది. దీనికితోడు అమెరికా నుంచి డిమాండ్ తగ్గడం, పత్తి, పాలిస్టర్ ధరలు పెరగడం వల్ల ఈ ఏడాది ఏప్రిల్–సెప్టెంబర్ మధ్య మన దేశంలో దుస్తుల ఉత్పత్తి 5.6 శాతం తగ్గింది. దీనికి తోడు యూరప్ దేశాల కఠినమైన నాణ్యత, పర్యావరణ నిబంధనలు పెట్టడంతో మన తయారీదారుల ఖర్చులు పెరిగాయి.
ఈ సవాళ్లను అధిగమిస్తే బం గ్లాదేశ్ నుంచి గార్మెంట్ ఆర్డర్లను శాశ్వతంగా పొందే వీలుంటుంది. ఒకసారి చేజారిన ఆర్డర్లు బంగ్లాదేశ్‌లో పరిస్థితులు చక్కబడినా తిరిగి అక్కడికి వెళ్లడం కష్టమే. ఇప్పటికే పలు కంపెనీలు అక్కడ ఆర్డర్లను రద్దు చేసుకోవడం లేదా వాయిదా వేయడం చేశాయి. అయితే, విదేశీ బ్రాండ్లు కేవలం ఒక్క దేశంపైనే ఆధారపడాలని అనుకోవడం లేదు. వియత్నాం, ఇండోనేషియా వైపూ చూస్తున్నాయి. కాబట్టి భారతీయ కంపెనీలు నాణ్యత, పోటీ ధరలు, వేగవంతమైన డెలివరీని నిలబెట్టుకుంటేనే.. ఫ్యాషన్ బ్రాండ్లు భారత కంపెనీలకు భారీ ఆర్డర్లు ఇస్తాయి.
