బ్రిస్బేన్: బౌలింగ్‌లో జెమీ ఓవర్టన్ (5/12) దుమ్మురేపడంతో.. శుక్రవారం జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో ఇంగ్లండ్ 7 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాపై గెలిచింది. దాంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇంగ్లండ్ 2–1 ఆధిక్యంలో నిలిచింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్ 16.5 ఓవర్లలో 108 రన్స్‌కే కుప్పకూలింది. సొంతగడ్డపై ఆసీస్‌కు ఇదే అత్యల్ప స్కోరు కావడం విశేషం. లెఫ్టార్మ్ స్పిన్నర్ లియామ్ డాసన్ (2/19) వరుస విరామాల్లో మిచెల్ మార్ష్ (11), సామ్ హార్పర్ (26)ను ఔట్ చేసి ఆసీస్ పతనానికి తెరతీశాడు.
ఈ రెండు క్యాచ్‌లను ఓవర్టన్ అందుకోవడం విశేషం. ఆ తర్వాత బాల్‌తో ఆసీస్ ఇన్నింగ్స్‌ను కూల్చాడు. జేక్ ఫ్రేజర్-మెక్‌గర్క్ (22), టిమ్ డేవిడ్ (6), జోయెల్ డేవిస్ (3)లను పెవిలియన్‌కు పంపిన అతను.. తన చివరి ఓవర్లో ఎడమచేతికి బంతి తగిలినా బాధను లెక్కచేయకుండా నిఖిల్ చౌదరి (19), బెన్ డ్వార్షుయిస్ (0)లను అవుట్ చేశాడు. అంతర్జాతీయ టీ20ల్లో ఇంగ్లండ్ తరఫున ఐదు వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా ఓవర్టన్ నిలిచాడు.
గతంలో సామ్ కరన్ (5/10), అఫ్గానిస్థాన్‌పై (2022లో) ఈ ఘనత సాధించాడు. వర్షం కారణంగా ఇంగ్లండ్ లక్ష్యాన్ని 16 ఓవర్లలో 93 రన్స్‌గా నిర్దేశించారు. దీన్ని ఇంగ్లండ్ 9వ ఓవర్లోనే 93/3 స్కోరు చేసి ఛేదించింది. ఆసీస్ పేసర్ రిలీ మెరిడిత్ (3/21) వరుస బంతుల్లో కెప్టెన్ హ్యారీ బ్రూక్ (9), అనూరిన్ డొనాల్డ్ (32)లను అవుట్ చేయడంతో ఇంగ్లండ్ 49/3తో కాస్త తడబడింది. అయితే జోర్డాన్ కాక్స్ (14 బంతుల్లో 33 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్ ఆడి జట్టును విజయతీరాలకు చేర్చాడు.
