హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో బీజేపీ ఎదుగుదలను చూసి సీఎం రేవంత్ రెడ్డికి వణుకు పుడుతోందని, ఆ భయంతోనే నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేట బహిరంగ సభలో తమ పార్టీపై అనుచిత, దిగజారుడు వ్యాఖ్యలు చేశారని మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేసేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య చీకటి ఒప్పందం కుదిరిందని, అందులో భాగంగానే కాళేశ్వరం స్కాం, ఫోన్ ట్యాపింగ్ కేసుల్లో చర్యలు తీసుకోకుండా కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు. ఈ మేరకు ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు.
రేవంత్ రెడ్డి గతం మరచిపోయి మాట్లాడుతున్నారని, మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో ఆయన సొంత స్థానమైన మహబూబ్నగర్లో ఏడుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నా ప్రజలు బీజేపీనే గెలిపించారని ఆమె గుర్తు చేశారు. సిట్టింగ్ స్థానమైన మల్కాజ్గిరి ఎంపీగా, గత అసెంబ్లీ ఎన్నికల్లో కామారెడ్డిలో ఓడించింది సామాన్య కార్యకర్తలే అన్న విషయం మర్చిపోతే ఎలా అని ప్రశ్నించారు. మహిళలకు రూ.2,500, 2 లక్షల ఉద్యోగాలు, తులం బంగారం హామీలను ఎందుకు అమలు చేయలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. పాలమూరు రైతులకు తీరని అన్యాయం చేసింది కేసీఆర్, రేవంతేనని విమర్శించారు.
పాలమూరు బిడ్డనని చెప్పుకునే రేవంత్.. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని మూడేళ్లలో పూర్తి చేయకుండా భూములను పడావు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజలు ఇప్పటికే బీఆర్ఎస్కు పాడె కట్టారని, హామీలు విస్మరించిన కాంగ్రెస్ను కూడా రాబోయే రోజుల్లో రాజకీయంగా బొంద పెట్టడం ఖాయమని.. ఆ 2 పార్టీలు కలిసి పోటీ చేసినా రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయడం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు.
