డ్రగ్స్ కు బానిసైతే కుటుంబం రోడ్డున పడ్డట్టే : చిరంజీవి

డ్రగ్స్ కు బానిసైతే కుటుంబం రోడ్డున పడ్డట్టే : చిరంజీవి
  •     మన వ్యతిరేకత మనిషిపై కాకుండా డ్రగ్స్‌‌‌‌పైనే ఉండాలని పిలుపు
  •     2029 నాటికి డ్రగ్ ఫ్రీ 
  • ఇండియానే మోదీ సంకల్పం: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి 
  •     భవిష్యత్తు కోసం డ్రగ్స్ నిర్మూలన అవసరం: నాగార్జున
  •     జూబ్లీహిల్స్‌‌‌‌లో ముగిసిన ‘నషా ముక్త్ భారత్’ పాదయాత్ర 

హైదరాబాద్, వెలుగు: డ్రగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు బానిసైతే కుటుంబాన్ని రోడ్డున పడేసినట్టేనని కేంద్ర మాజీ మంత్రి, సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవి అన్నారు. మత్తుకు బానిసైన స్నేహితులను రీహాబిలిటేషన్ సెంటర్లలో చేర్పించాలని.. మన వ్యతిరేకత మనిషిపై కాకుండా డ్రగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పైనే ఉండాలని పిలుపునిచ్చారు. యువత తాము ఎంచుకున్న రంగాల్లో అత్యున్నత స్థానానికి ఎదిగి నిజమైన హీరోలు కావాలని..లక్ష్యంపై దృష్టి పెట్టినందుకే తాను మెగాస్టార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా నిలబడ్డానని వెల్లడించారు.  డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణమే లక్ష్యంగా కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి చేపట్టిన మూడు రోజుల ‘హైదరాబాద్ వాక్స్ ఫర్ నషా ముక్త్ భారత్’ మహా పాదయాత్ర శుక్రవారం సాయంత్రం జూబ్లీహిల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ముగిసింది. అంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పేట నుంచి నగరవ్యాప్తంగా సుమారు 40 కిలోమీటర్ల మేర సాగిన యాత్ర ముగింపు సభను జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్ ప్రాంగణంలో నిర్వహించారు. దీనికి ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు, ప్రముఖ ఆధ్యాత్మిక గురువు శ్రీ శ్రీ రవి శంకర్,  మాజీ గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు, బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి, ఎంపీలు రఘునందన్ రావు తదితరులు అటెండ్ అయ్యారు. 

కిషన్ రెడ్డి తన గళాన్ని అప్పగించారు 

ముగింపు సభలో చిరంజీవి మాట్లాడుతూ.. కిషన్ రెడ్డి తన గళాన్ని అందరికీ అప్పగించారని, ఆయన లక్ష్యాన్ని ప్రతి ఒక్కరూ ముందుకు తీసుకెళ్లాలని కోరారు. 48 ఏండ్ల క్రితం 22 ఏండ్ల వయసులో ‘ప్రసాద్’ అనే పేరుతో హీరో అవ్వాలనే లక్ష్యంతో తాను చెన్నై ఫిల్మ్ ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టిట్యూట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో చేరినట్లు గుర్తుచేసుకున్నారు. లక్ష్యానికి డ్రగ్స్ పెనుభూతంలా అడ్డుపడుతున్నాదని.. స్నేహితుల ప్రభావంతో చిన్నపిల్లలు కూడా మత్తుకు బానిసలవుతుండటం ఆందోళనకరమన్నారు. యువత లక్ష్యం వైపు దూసుకెళ్తే ఆర్థిక వ్యవస్థలో భారత్ నంబర్ వన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా నిలవడాన్ని ఎవరూ ఆపలేరని మెగస్టార్ పేర్కొన్నారు.


2029 నాటికి డ్రగ్ ఫ్రీ ఇండియా: కిషన్ రెడ్డి

దేశాన్ని 2029 నాటికి ‘డ్రగ్ ఫ్రీ ఇండియా’ చేయాలని ప్రధాని మోదీ సంకల్పించారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఇది రాజకీయాలకు అతీతమైన అంశమని.. టెక్నాలజీ, ఐటీ, హెల్త్, మెడికల్, సర్వీస్ సెక్టార్లలో ప్రపంచవ్యాప్తంగా కీలక పాత్ర పోషిస్తున్న మన యువశక్తిని సన్మార్గంలో నడిపించాల్సిన అవసరం ఉందన్నారు. మూడు రోజుల వాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో యూనివర్సిటీల వీసీలు, మెడికల్ కాలేజీల డాక్టర్లు, విద్యార్థులు, బస్తీల నుంచి యువతీయువకులు, మహిళలు భారీగా తరలిరావడం చూస్తే మోదీ లక్ష్యం కచ్చితంగా నెరవేరుతుందన్న నమ్మకం కలిగిందన్నారు. ఈ ఉద్యమంపై సామాజిక స్పృహ ఉన్న ప్రతి ఇంట్లో చర్చ జరుగుతోందని, ఇందుకు మద్దతు పలికిన చిరంజీవి, నాగార్జున సహా సినీ, ఆధ్యాత్మిక ప్రముఖులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. నషా ముక్త్ భారత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై దేశంలో మూడు రోజుల పాటు భారీ స్థాయిలో పాదయాత్ర నిర్వహించిన ఘనత కిషన్ రెడ్డికే దక్కుతుందని మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు కొనియాడారు. భారత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను అస్థిరపరిచే కుట్రలను అడ్డుకోవాలన్నారు.

వికసిత్ భారత్ కోసమే: రాంచందర్ రావు

అంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పేట నుంచి జూబ్లీహిల్స్ వరకు కిషన్ రెడ్డి చేపట్టిన ప్రజా ఉద్యమం చారిత్రాత్మకమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు ప్రశంసించారు. ఉగ్రవాదం, నక్సలిజం, మావోయిజంపై పోరాడినట్లుగానే డ్రగ్స్ మహమ్మారిని కూడా సమూలంగా నిర్మూలించేందుకు ప్రధాని మోదీ కట్టుబడి ఉన్నారని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డీపీఎస్ చట్టాన్ని కఠినంగా అమలు చేయాలని కోరారు. అభినవ సర్దార్ వల్లభాయ్ పటేల్ అమిత్ షా దేశంలో వామపక్ష తీవ్రవాదాన్ని రూపుమాపినట్టే, 2029 కల్లా డ్రగ్స్ ఫ్రీ భారత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ప్రతి ఒక్కరూ సహకరించాలని మెదక్ ఎంపీ రఘునందన్ రావు పిలుపునిచ్చారు. మూడు రోజుల పాటు సాగిన ఈ పాదయాత్రలో వివిధ స్కూళ్లు, కాలేజీల నుంచి సుమారు 43 వేల మంది విద్యార్థులు తరలివచ్చి మత్తుకు వ్యతిరేకంగా గళమెత్తారు. కార్యక్రమంలో రామకృష్ణ మఠం అధ్యక్షుడు స్వామి బోధానంద, డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యేలు వెంకటరమణారెడ్డి, పైడి రాకేశ్ రెడ్డి, ధన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పాల్ సూర్యనారాయణ, ఎమ్మెల్సీలు అంజిరెడ్డి, మల్క కొమరయ్య తదితరులు పాల్గొని, యాత్రకు సంఘీభావం తెలిపి, కలిసి నడిచారు.
 
డ్రగ్స్ రహిత భారత్ కోసం అంతా కదలాలి: నాగార్జున

దేశం నుంచి డ్రగ్స్ మహమ్మారిని పూర్తిగా తరిమికొట్టేందుకు ప్రధాని మోదీ తీసుకున్న సంకల్పం విజయవంతం కావాలని సినీ నటుడు నాగార్జున ఆకాంక్షించారు. నషా ముక్త్ భారత్ పేరుతో కిషన్ రెడ్డి మంచి ఆలోచనతో ఈ యాత్ర చేపట్టారని అభినందించారు. శుక్రవారం ఆయన పాదయాత్రలో పాల్గొని మాట్లాడారు. డ్రగ్స్ నిర్మూలన అనేది యువత, రాబోయే తరాల భవిష్యత్తుకు సంబంధించిన అంశమని స్పష్టం చేశారు. 
 

వివేకానంద స్ఫూర్తితో సాగాలి: సాయికుమార్

యువత మత్తు పదార్థాలకు బానిసలై భవిష్యత్తును పాడుచేసుకోవద్దని సినీ నటుడు సాయికుమార్ సూచించారు. మత్తులో నిద్రపోకుండా, సూర్యుడిలా దేశాన్ని మేల్కొలిపే శక్తిగా ఎదగాలని పిలుపునిచ్చారు. విద్యార్థి దశ ఎంతో విలువైనదని.. తల్లిదండ్రుల మాట వింటూ, గురువులను గౌరవిస్తూ, దైవాన్ని ప్రార్థిస్తూ హద్దులు దాటకుండా నడుచుకోవాలని హితవు పలికారు.