నా బిడ్డ..భర్తను వదిలేసి ఇంటికి రావాలె..ప్రేమ పెండ్లి చేసుకున్న కూతురిపై తండ్రి క్షుద్ర పూజలు

నా బిడ్డ..భర్తను వదిలేసి  ఇంటికి రావాలె..ప్రేమ పెండ్లి  చేసుకున్న కూతురిపై తండ్రి క్షుద్ర పూజలు
  •     రూ.50 లక్షలకు ఒప్పందం 
  •     ఫలించకపోవడంతో ఫిర్యాదు 
  •     నిందితుడు అరెస్ట్​  

కీసర,వెలుగు : తనను కాదని ప్రేమ పెండ్లి చేసుకుని వెళ్లిపోయిన ఓ కూతురు తన మొగుడిని వదిలేసి ఇంటికి రావాలని ఓ తండ్రి క్షుద్ర పూజలు చేయించేందుకు సిద్ధమయ్యాడు. దీనికోసం ప్లాటు అమ్మి రూ.25లక్షలు కూడా ముట్టజెప్పాడు. అయితే, పూజలు చేయకపోవడం, బిడ్డ ఇంటికి రాకపోవడంతో తాను మోసపోయానని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో నిందితుడని పోలీసులు అరెస్ట్​ చేశారు. ఈ ఘటనలో క్షుద్రపూజల కోసం ఇచ్చిన రూ. 22 లక్షలను పోలీసులు రికవరీ చేశారు. కీసర పోలీస్ స్టేషన్లో జవహర్ నగర్ ఏసీపీ చక్రపాణి వివరాలు వెల్లడించారు. 

కుందన్ పల్లికి చెందిన మణికంఠ రాముకు ఒక కూతురు, కొడుకు ఉన్నారు. కూతురు బ్రహ్మమణి అదే గ్రామానికి చెందిన తుడం రామును ప్రేమించింది. ఈ విషయం ఇంట్లో తెలియడంతో బిడ్డను అతిగా ప్రేమించే రాము తన కూతురికి నచ్చజెప్పాడు. ‘బిడ్డా నిన్ను అల్లారుముద్దుగా పెంచుకున్నా..నువ్వు ఎవడినో పెండ్లి చేసుకుని కష్టాలు పడితే నేను చూడలేను.వద్దు బిడ్డ..అతడిని మర్చిపో’ అని నచ్చజెప్పాడు. అయితే, అతడి మాట వినని ఆమె నాలుగు నెలల కింద పెళ్లి చేసుకొని వెళ్లిపోయింది. దీంతో మనస్థాపం చెందిన రాము మనశ్శాంతి కోసం కీసరలోని కాళీ మాతా టెంపుల్​కు వెళ్లి రోజు సాయంత్రం వరకు అక్కడే కూర్చొని వచ్చేవాడు. 

ఇది చూసిన కళ్ళం క్రాంతి కుమార్ ఏమైందని అడిగాడు. జరిగిన విషయం చెప్పడంతో ‘నీ బాధ నాకు అర్థమైంది. నీ కూతురు నీ దగ్గరకు వచ్చేలా చేస్తే అది కేవలం క్షుద్రపూజలతోనే సాధ్యం’ అని చెప్పాడు. అది నిజమే అని నమ్మిన రాము క్షుద్ర పూజలకు ఒప్పుకున్నాడు. దీని కోసం క్రాంతి కుమార్ రూ. 50 లక్షలకు బేరం కుదుర్చుకున్నాడు. ముందుగా రూ. 25 లక్షలు ఇచ్చాడు. డబ్బులు ఇచ్చి మూడు నెలలవుతున్న కూతురు ఇంటికి రాకపోవడంతో మోసం చేశాడని కీసర పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు క్రాంతి కుమార్ ను అరెస్ట్​ చేసి రూ. 22 లక్షల 52 వేల నగదు, రెండు వెండి బిస్కెట్లు, బంగారు ఉంగరం స్వాధీనం చేసుకున్నారు. ఇదే కేసులో క్రాంతి కుమార్ భార్యను, మరో వ్యక్తి సాయిలను సైతం విచారిస్తున్నారు. సమావేశంలో కీసర సీఐ ఎలక్షన్ రెడ్డి, ఎస్ఐ లు రఘురామ్,వెంకట్ రెడ్డి,గౌరేందర్ గౌడ్ పాల్గొన్నారు.