పునర్విభజన బిల్లుపై వైసీపీ ఆచి తూచి..సవరణలు పరిశీలించిన తర్వాతే  తుది నిర్ణయం

పునర్విభజన బిల్లుపై వైసీపీ ఆచి తూచి..సవరణలు పరిశీలించిన తర్వాతే  తుది నిర్ణయం

ఢిల్లీ: నియోజకవర్గాల పునర్విభజన బిల్లుపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) ఆచి తూచి వ్యవహరించాలని నిర్ణయించింది. సవరించిన బిల్లులోని నిబంధనలను పూర్తిగా పరిశీలించిన తర్వాతే తమ వైఖరిని ప్రకటిస్తామని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో ఈ బిల్లును ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఈ సమాచారాన్ని ఎన్డీటీవీ పేర్కొంది. కేంద్ర మంత్రిమండలి శుక్రవారం ఆమోదించిన కొత్త బిల్లు ప్రకారం లోక్‌సభ స్థానాల సంఖ్యను అన్ని రాష్ట్రాల్లో సమానంగా 50 శాతం పెంచనున్నారు. రాష్ట్రాల మధ్య ఉన్న ప్రస్తుత సీట్ల నిష్పత్తిని 2051 వరకు కొనసాగించేలా నిబంధనలు చేర్చారు. ఈ మార్పులను పార్లమెంటు వచ్చే వారంలో చర్చకు చేపట్టనుంది. గతంలో ఏప్రిల్, జూలై నెలల్లో ఈ బిల్లుకు వైసీపీ సూత్రప్రాయంగా మద్దతు తెలిపింది.

మారుతున్న రాజకీయ పరిణామాలు

కొన్ని నెలలుగా బీజేపీపై జగన్ విమర్శలు పెంచారు. ఓటర్ల జాబితా సవరణ, ఎన్నికల కమిషనర్ల నియామక ప్రక్రియపై అభ్యంతరాలు వ్యక్తం చేశారు. గతంలో ఎన్నికల కమిషనర్ల నియామక చట్టానికి మద్దతు ఇచ్చినందుకు విచారం వ్యక్తం చేశారు.  ఇదిలా ఉండగా.. జగన్ పై ఉన్న కేసుల్లో దర్యాప్తు సంస్థల విచారణ వేగవంతమైంది. దాల్మియా సిమెంట్ కేసులో ఈడీ  10 చార్జిషీట్ వేసింది.  లైమ్ స్టోన్ మైనింగ్ లీజులు, జగన్ కంపెనీల్లో పెట్టుబడుల విషయంలో మనీలాండరింగ్ జరిగినట్లు ఆరోపించింది. రూ.120 కోట్ల విలువైన ఆస్తుల జప్తునకు అనుమతి కోరింది. జగన్, ఇతర 73 మందిపై ఉన్న తొమ్మిది మనీలాండరింగ్ కేసుల విచారణను వేగవంతం చేయాలని తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై నవంబర్ 30న విచారణ జరగనుంది.

వైసీపీ మద్దతు కీలకమే..

పార్లమెంటులో ఈ బిల్లు ఆమోదం పొందడానికి వైసీపీ మద్దతు కీలకం కానుంది. లోక్‌సభలో ప్రస్తుతం నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్డీయే)కు 320 మంది ఎంపీల బలం ఉంది. ఇందులో వైసీపీ ప్రధాన ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ (టీడీపీ)కి చెందిన 16 మంది సభ్యులు ఉన్నారు. వైసీపీకి నలుగురు ఎంపీలు ఉన్నారు. రాజ్యాంగ సవరణ బిల్లు నెగ్గడానికి మూడింట రెండు వంతుల మెజారిటీ అవసరం. 540 మంది సభ్యులు ఓటింగ్‌లో పాల్గొంటే 360 ఓట్లు రావాల్సి ఉంటుంది. వైసీపీ మద్దతు లభిస్తే ఎన్డీయే బలం 324 కు చేరుతుంది. బిల్లులోని రక్షణలు, నిబంధనల ఆధారంగానే తుది నిర్ణయం తీసుకుంటామని పార్టీ వర్గాలు స్పష్టం చేశాయి