- 50% పెంపుతో 605కి యూపీ అసెంబ్లీ సీట్లు
- రాజ్యాంగ పరిమితి 500 దాటిపోతున్న ఏకైక రాష్ట్రం
లక్నో: డీలిమిటేషన్ బిల్లు దేశమంతటికీ ఒక సమస్య అయితే, ఉత్తరప్రదేశ్‌కు అది పెద్ద చిక్కుముడిగా మారింది. లోక్‌సభతో పాటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీల్లో సీట్లను 50 శాతం పెంచేలా కేంద్రం తెచ్చిన రాజ్యాంగ (132వ సవరణ) బిల్లు అమలైతే, ఇప్పుడు 403 సీట్లున్న యూపీ అసెంబ్లీ దాదాపు 605 సీట్లకు చేరుతుంది. కానీ రాజ్యాంగంలోని ఆర్టికల్ 170(1) ప్రకారం ఏ రాష్ట్ర అసెంబ్లీలోనైనా 500 మందికి మించి సభ్యులు ఉండటానికి వీల్లేదు. 50 శాతం పెంపుతో ఈ పరిమితిని దాటిపోయేది దేశంలో ఒక్క యూపీయే. దీంతో రాజ్యాంగాన్ని సవరించి పరిమితి పెంచాలా, లేదా రాష్ట్రాన్నే విభజించాలా అనే చర్చ మొదలైంది.
రాజ్యాంగ సవరణకే కేంద్రం మొగ్గు
ఈ సమస్యకు కేంద్రం రాజ్యాంగ సవరణ మార్గాన్నే ఎంచుకుంది. రాష్ట్ర అసెంబ్లీల గరిష్ఠ పరిమితిని 500 నుంచి 650కి పెంచాలని తాజా బిల్లులో ప్రతిపాదించింది. దీంతో యూపీలో 605 సీట్ల అసెంబ్లీకి రాజ్యాంగపరమైన అడ్డంకి తొలగుతుంది. లోక్‌సభలోనూ యూపీ సీట్లు 80 నుంచి 120కి పెరుగుతాయి. అంటే దాదాపు 815 మంది సభ్యుల లోక్‌సభలో ఏడో వంతు ఒక్క యూపీ నుంచే వస్తారు.
605 మందితో సభ ఎలా?
అయితే ఒక్క అసెంబ్లీలో 605 మంది సభ్యులతో సభ నడపడం, ప్రతి ఎమ్మెల్యేకు మాట్లాడే అవకాశం ఇవ్వడం, కొత్త అసెంబ్లీ భవనం వంటి ఏర్పాట్లు సవాలేనని నిపుణులు చెబుతున్నారు. దాదాపు 24 కోట్ల జనాభాతో ప్రపంచంలోని చాలా దేశాల కంటే పెద్దదైన యూపీని పాలనా సౌలభ్యం కోసం విభజించాలనే డిమాండ్ చాలాకాలంగా ఉంది. 2011 నవంబర్‌లో అప్పటి సీఎం మాయావతి ప్రభుత్వం యూపీని పూర్వాంచల్, బుందేల్‌ఖండ్, అవధ్ ప్రదేశ్, పశ్చిమ ప్రదేశ్ అనే నాలుగు రాష్ట్రాలుగా విభజించాలని అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపింది. ఆ తీర్మానం అప్పట్లోనే మూలకుపడింది. ఇప్పుడు డీలిమిటేషన్‌తో అసెంబ్లీ సైజు భారీగా పెరగనుండటంతో విభజన డిమాండ్ మళ్లీ తెరపైకి వస్తోంది.
ఎన్నికల ముంగిట..
వచ్చే ఏడాది యూపీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. సీట్ల పెంపు, మూడో వంతు మహిళా రిజర్వేషన్‌తో దాదాపు 200 సీట్లు మహిళలకు దక్కనున్నాయి. ఏ నియోజకవర్గం ఎటు పోతుందోనని బీజేపీ, ఎస్పీ, కాంగ్రెస్, బీఎస్పీ నేతలు లెక్కలు వేసుకుంటున్నారు. సోమవారం లోక్‌సభ ముందుకు రానున్న ఈ బిల్లు పాసు కావాలంటే మూడింట రెండొంతుల మెజారిటీ కావాలి.
