- రోడ్డు మార్గంలోనే భారీగా తరలింపు..
- వచ్చే ఏడాది నుంచి 60 లక్షల టన్నుల ఉత్పత్తికి సన్నాహాలు
- ప్రత్యేక రైల్వే కారిడార్ ఏర్పాటుకు సింగరేణి కసరత్తు
కోల్‌బెల్ట్, వెలుగు : ఒడిశా రాష్ట్రంలోని సింగరేణి సంస్థకు చెందిన నైనీ బొగ్గు గని మరో కీలక మైలురాయిని అధిగమించింది. ఈ గని నుంచి రికార్డు స్థాయిలో 10 లక్షల టన్నుల బొగ్గు రవాణా పూర్తయింది. నేరుగా రైల్వే సైడింగ్ సదుపాయం లేకపోయినా, రోడ్డు మార్గం ద్వారానే ఈ ఘనత సాధించింది. దీంతో ట్రాన్స్పోర్ట్సామర్థ్యాన్ని మరింత పెంచేందుకు సింగరేణి యాజమాన్యం చర్యలు చేపడుతోంది.
రాష్ట్ర విద్యుత్ రంగానికి వెన్నెముకగా నిలిచే నైనీ గనిలో 2025 ఏప్రిల్ 16న బొగ్గు ఉత్పత్తి ప్రారంభమైంది. ఈ గనిలో 340.78 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలు ఉండగా, ఏటా 10 మిలియన్ టన్నుల ఉత్పత్తి లక్ష్యంగా సాగుతోంది. ఉత్పత్తి పెరుగుతున్నా ఆశించిన స్థాయిలో బొగ్గు రవాణా కాకపోవడం మొదటి నుంచీ సమస్యగా మారింది. దీంతో అనేక నెలల పాటు గని వద్ద బొగ్గు నిల్వలు పేరుకుపోయాయి.
నైనీ గని నుంచి సమీపంలోని రైల్వే సైడింగ్‌కు నేరుగా రైలు కారిడర్సౌకర్యం లేకపోవడంతో సుమారు 54 కి.మీ లారీల్లోనే బొగ్గును తరలించాల్సి వస్తోంది. లారీల రాకపోకలతో శబ్ద కాలుష్యం పెరుగుతోందని స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఒడిశా ప్రభుత్వ సహకారంతో రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు మాత్రమే రోడ్డు మార్గంలో బొగ్గు రవాణా చేసే లారీలకు పర్మిషన్ ఇచ్చారు. ప్రస్తుతం సుమారు 200 లారీల ద్వారా నైనీ గని నుంచి హిందోల్, హండపా, కామాక్షయనగర్ రైల్వే సైడింగ్‌లకు బొగ్గును తరలిస్తున్నారు. అక్కడి నుంచి రైళ్ల ద్వారా వివిధ రాష్ట్రాల్లోని థర్మల్ పవర్ ప్లాంట్లకు సప్లై చేస్తున్నారు.
ప్రధానంగా తెలంగాణలోని యాదాద్రి, జైపూర్ థర్మల్ ప్లాంట్లకు సప్లై నడుస్తోంది. రవాణా ఇబ్బందులను అధిగమించే క్రమంలో నైనీ సమీపంలోని హిందోల్ సైడింగ్ నుంచి తొలి బొగ్గు రైల్వే రేక్ (గూడ్స్‌రైలు) 2026 ఆగస్టు 1న బయలుదేరి, సుమారు 1,131 కిలోమీటర్లు ప్రయాణించి తెలంగాణలోని మంచిర్యాల జిల్లా జైపూర్ సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్‌కు అదే నెల 6న చేరుకుంది. ఆ తర్వాత వారం రోజులకు తొలి రైల్వే రేక్ యాదాద్రి ప్లాంట్‌కు (వైటీపీఎస్) చేరింది.
రవాణా సమస్యలున్నా రోజుకు కనీసం 20 వేల టన్నుల బొగ్గును తరలించేలా సింగరేణి సన్నాహాలు చేస్తోంది. నైనీ గనిలో లభించే జీ-10 గ్రేడ్ బొగ్గుకు మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది. ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు జెన్‌కోలతో పాటు పలు స్థానిక ప్రైవేట్ సంస్థలు కూడా ఈ బొగ్గు కోసం ఆసక్తి చూపుతున్నాయి.
అయినప్పటికీ, ఉత్పత్తి అవుతున్న బొగ్గులో మొదటి ప్రాధాన్యం తెలంగాణ జెన్‌కోకు ఇవ్వాలని సింగరేణి నిర్ణయించింది. ఇందులో భాగంగా యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రానికి అధిక మొత్తంలో నైనీ బొగ్గును సరఫరా చేస్తోంది. మరోవైపు, రానున్న రోజుల్లో ఎల్‌నినో ప్రభావంతో విద్యుత్ అవసరాలు పెరిగే అవకాశం ఉండటంతో తెలంగాణ జెన్‌కో థర్మల్ విద్యుత్ కేంద్రాలకు సింగరేణి గనుల నుంచి రోజుకు 75 వేల టన్నుల బొగ్గు సరఫరా చేయాలని యాజమాన్యం లక్ష్యంగా పెట్టుకుంది.
నైనీ గనిలో మిగిలిన బొగ్గును స్థానిక పరిశ్రమలకు సరఫరా చేయడంతో పాటు, ఎన్టీపీసీతో ఇప్పటికే ఉన్న బొగ్గు సరఫరా ఒప్పందాలకు అనుబంధంగా ఒడిశాలోని కనిహా థర్మల్ విద్యుత్ కేంద్రానికి కూడా బొగ్గు అందించేందుకు తాజాగా అంగీకారం కుదిరింది. ఈ నేపథ్యంలో ఈ నెల 23 నాటికి నైనీ గని నుంచి బొగ్గు రవాణా 10 లక్షల టన్నుల మైలురాయిని దాటింది.
ఇతర కంపెనీల సహకారంతో ప్రత్యేక రైల్వే కారిడార్..
నైనీ గని నుంచి సమీపంలోని రైల్వే సైడింగ్ వరకు ప్రస్తుతం రోడ్డు మార్గం ద్వారా బొగ్గును తరలిస్తున్నారు. కామన్కోల్ కారిడార్ రైల్వే లైన్(సీసీఆర్ఎల్) పేరుతో రూ.1,700 కోట్లతో కేంద్ర ప్రభుత్వం 68 కి.మీ దూరం రెండు దశల్లో రైల్వే లైన్ వేసే పనులు చేపట్టింది.
తొలిదశలో అంగూల్ నుంచి బలరాం వరకు 14 కి.మీ దూరం పూర్తి అయింది. మరో 54 కి.మీ పనులు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ ప్రాజెక్టు పూర్తయ్యేందుకు మరో మూడేండ్ల కాలం పట్టే ఛాన్స్ ఉంది. ప్రస్తుతం నైనీ బ్లాక్ నుంచి ఉత్పత్తి చేస్తున్న బొగ్గును సమీపంలోని జరపడా రైల్వే జంక్షన్ కు రవాణా చేయడానికి చండీపడా, -జరపడా గ్రామాల మధ్య బైపాస్ నిర్మించాలని సింగరేణి సంస్థ తనవంతుగా ఇప్పటికే రూ.35 కోట్లు డిపాజిట్ చేసింది. రైల్ కారిడర్ పూర్తికాకపోవడం వల్ల బొగ్గు రవాణా కష్టాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి నైనీ గనిలో ఏడాదికి 60 లక్షల టన్నుల బొగ్గును (6 మిలియన్ టన్నులు) ఉత్పత్తి చేయాలని నిర్ణయించింది.
నైనీ గని ఉన్న సమీప ప్రాంతంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న మహానది కోల్‌ఫీల్డ్స్, నాల్కో, ఓఎంసీ తదితర ప్రభుత్వ రంగ సంస్థల భాగస్వామ్యంతో సపరేట్ రైల్వే కారిడార్ ఏర్పాటుకు సింగరేణి ప్లాన్ చేస్తోంది. దీని ద్వారా నైనీ ఓపెన్‌కాస్ట్ గని నుంచి సమీపంలోని బలరాం జరపడా ప్రధాన రైల్వే లైన్‌కు నేరుగా ట్రాక్ వేసి ఏటా 60 లక్షల నుంచి కోటీ టన్నుల బొగ్గును రవాణా చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ముందస్తూ నైనీ ఓసీపీ వద్దే నేరుగా బొగ్గును రైలు వ్యాగన్లలో లోడ్ చేసేందుకు వీలుగా ప్రత్యేక రైల్వే సైడింగ్, కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్ (సీహెచ్‌పీ) మౌలిక సదుపాయాల అభివృద్ధిపై దృష్టి సారించింది.
