హైదరాబాద్, వెలుగు: తెలంగాణ బ్రేక్ఫాస్ట్ పథకానికి సింగరేణి సంస్థ తన సామాజిక బాధ్యతతో అండగా నిలుస్తోంది. గ్రామీణ, పేద విద్యార్థుల ఆకలి తీర్చి, వారి చదువుకు తోడ్పడే ఈ కార్యక్రమానికి రూ.61.44 కోట్ల ఆర్థిక సహకారం అందిస్తోంది.
దేశానికి విద్యుత్ వెలుగులు అందించడమే కాకుండా, భావితరాల విద్యాభివృద్ధికి తోడ్పడటం ద్వారా ఉత్తమ పౌరుల నిర్మాణంలోనూ తన వంతు బాధ్యతను నిర్వర్తిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ బ్రేక్ఫాస్ట్ పథకాన్ని అమలు చేయాలన్న ప్రభుత్వ సంకల్పంలో భాగంగా హరే కృష్ణ ఫౌండేషన్ నిర్వహణలో సెంట్రలైజ్డ్ వంటశాలలు ఏర్పాటు చేస్తోంది. వీటిలో 9 వంటశాలల నిర్మాణానికి సింగరేణి నిధులు కేటాయించింది.
పూర్తిగా సింగరేణి కార్పొరేట్ సామాజిక బాధ్యత నిధుల(సీఎస్ఆర్)తో అత్యాధునిక సదుపాయాలతో వీటిని నిర్మిస్తున్నారు. వీటి వల్ల ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీల్లో చదువుతున్న 4 లక్షల మందికిపైగా విద్యార్థులకు నిత్యం ఉచితంగా పౌష్టిక అల్పాహారం అందించనున్నారు.
9 చోట్ల సెంట్రలైజ్డ్ కిచెన్లు ఏర్పాటు..
తొలిదశలో కొడంగల్లో నిర్మించిన సెంట్రలైజ్డ్ కిచెన్ నిర్మాణానికి సింగరేణి రూ.2 కోట్లు మంజూరు చేసింది. సీఎం రేవంత్ రెడ్డి ఇదివరకే ఈ వంటశాలను ప్రారంభించారు. ఆ తర్వాత రూ.21.03 కోట్లతో మధిర, మంథని, మంచిర్యాల ప్రాంతాల్లో కూడా ఈ కిచెన్లను ఏర్పాటు చేశారు.
ప్రస్తుతం రూ.38.41 కోట్లతో కొత్తగూడెం, భూపాలపల్లి, కాగజ్నగర్, మునగాల (సూర్యాపేట) ప్రాంతాలలో సెంట్రలైజ్డ్ కిచెన్లను నిర్మించనున్నారు. సింగరేణి సంస్థ చేపట్టిన ఈ కార్యక్రమం ద్వారా మొత్తం 8 వేల స్కూళ్ల పరిధిలో 4 లక్షల మందికి పైగా విద్యార్థులు లబ్ధి పొందనున్నారని సింగరేణి సీఎండీ బుద్ధా ప్రకాష్ జ్యోతి వెల్లడించారు.
