పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ విపక్ష నేత నియామకం రద్దు .. కలకత్తా హైకోర్టు సంచలన తీర్పు

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ   విపక్ష నేత నియామకం రద్దు .. కలకత్తా హైకోర్టు సంచలన తీర్పు

మమతా బెనర్జీకి భారీ ఊరట

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ప్రతిపక్ష నేతగా రితబ్రత బెనర్జీ నియామకాన్ని కలకత్తా హైకోర్టు రద్దు చేసింది. స్పీకర్ రతీంద్ర బోస్ తీసుకున్న ఈ నిర్ణయం రద్దు చేస్తూ, పది రోజుల్లోగా కొత్తగా నిర్ణయం తీసుకోవాలని జస్టిస్ కృష్ణారావు శుక్రవారం ఆదేశించారు. తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) పార్టీకి చెందిన అఖ్రుజ్జామన్‌ను చీఫ్ విప్‌గా నియమిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని కూడా న్యాయస్థానం కొట్టివేసింది. టీఎంసీ నాయకుడు శోభన్‌దేబ్ ఛటోపాధ్యాయ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు ఈ తీర్పు ఇచ్చింది. 

తిరుగుబాటు వర్గం నాయకుడైన రితబ్రతను ప్రతిపక్ష నేతగా గుర్తించడాన్ని ఆయన సవాలు చేశారు. 2026 మే 6వ తేదీన జరిగిన పార్టీ సమావేశంలో తనను ప్రతిపక్ష నేతగా ఎంపిక చేసినట్లు శోభన్‌దేబ్ తెలిపారు. దీనికి సంబంధించి 80 మంది సభ్యుల సంతకాలతో కూడిన లేఖను 2026 మే 19న స్పీకర్‌కు పంపినట్లు పిటిషన్‌లో పేర్కొన్నారు. రితబ్రత 59 మంది ఎమ్మెల్యేలతో టీఎంసీ నుంచి విడిపోయి డెమోక్రటిక్ తృణమూల్ కాంగ్రెస్‌ను ఏర్పాటు చేశారు. తననే ప్రతిపక్ష నేతగా గుర్తించాలని ఆయన స్పీకర్‌ను కోరగా.. అందుకు స్పీకర్ అంగీకరించారు. 

అయితే అసమ్మతి ఎమ్మెల్యేలు విడిపోయే వరకు స్పీకర్ ఉద్దేశపూర్వకంగా నిర్ణయాన్ని ఆలస్యం చేశారని పిటిషనర్ తరపు న్యాయవాది కల్యాణ్ బందోపాధ్యాయ ఆరోపించారు. రితబ్రత తరపు న్యాయవాది జైదీప్ కర్ వాదనలు వినిపిస్తూ.. పార్టీ గుర్తుల వివాదం కేంద్ర ఎన్నికల సంఘం దగ్గర పెండింగ్‌లో ఉందని కోర్టుకు తెలిపారు.