హైదరాబాద్‌ చేపల మార్కెట్లలో కుళ్లిన చేపలు, రొయ్యలు అమ్మకం

హైదరాబాద్‌ చేపల మార్కెట్లలో  కుళ్లిన చేపలు, రొయ్యలు అమ్మకం
  • రాం​నగర్, బేగంబజార్ మార్కెట్లలో 19 బృందాలతో టీజీ సేఫ్ తనిఖీలు
  • రూ.1.56 లక్షల విలువైన 858 కిలోల పాడైన చేపలు, రొయ్యల పట్టివేత 

బేగంబజార్, వెలుగు: హైదరాబాద్‌లోని రెండు ప్రధాన చేపల మార్కెట్లలో తెలంగాణ ఫుడ్ సేఫ్టీ (టీజీ సేఫ్) అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం ఆధ్వర్యంలో రాంనగర్, బేగంబజార్ చేపల మార్కెట్లలో 19 ప్రత్యేక బృందాలతో తనిఖీలు చేపట్టారు. చాలా రోజుల కిందటే చనిపోయి, కుళ్లిపోయి కంపుకొడుతున్న చేపలు, రొయ్యలను విక్రయిస్తున్నట్లు గుర్తించారు. ఈ తనిఖీల్లో సుమారు రూ.1,56,880 విలువైన 858 కిలోల పాడైన చేపలు, రొయ్యలను స్వాధీనం చేసుకున్నారు.

చేపలను అత్యంత అపరిశుభ్రమైన వాతావరణంలో నిల్వ చేసి విక్రయిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. నిల్వకు వాడే నీళ్లు, మంచు నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా లేవని, ఉష్ణోగ్రతలను ఏమాత్రం పర్యవేక్షించడం లేదని తేల్చారు. తాజా చేపలతో పాత నిల్వలను కలిపి ఉంచడంతో పాటు కుళ్లిపోయిన వాటిని కూడా అమ్మకానికి సిద్ధంగా ఉంచారు. నిల్వకు వాడే ప్లాస్టిక్‌ పెట్టెలు, థర్మాకోల్‌ బాక్సులు అపరిశుభ్రంగా ఉండటంతో పాటు ఆ ప్రాంతంలో ఎలుకల సంచారం ఉన్నట్లు గుర్తించారు. వ్యాపారులు వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం లేదని, నిల్వల వివరాలు, సిబ్బంది ఆరోగ్య రికార్డులు, కీటక నియంత్రణ రికార్డులు నిర్వహించడం లేదని స్పష్టమైంది.

మరోవైపు చేపలు, రొయ్యల్లో ఫార్మాలిన్‌ వంటి హానికర రసాయనాల కల్తీని గుర్తించేందుకు ఫుడ్ ల్యాబొరేటరీ టెక్నీషియన్లు క్షేత్రస్థాయి పరీక్షలు నిర్వహించారు. చేపల మొప్పల రంగు, కళ్ల స్పష్టత, గట్టిదనం, ఆకృతితో పాటు రొయ్యల రంగు, నాణ్యతను పరిశీలించి అవి తినడానికి యోగ్యమైనవా కాదా అని అంచనా వేశారు. వినియోగానికి పనికిరావని తేలిన 858 కిలోల చేపలు, రొయ్యలను జీహెచ్‌ఎంసీ పారిశుధ్య వాహనాల ద్వారా డంపింగ్ యార్డుకు తరలించి పారవేసినట్లు కమిషనర్‌ పేర్కొన్నారు. ఈ దాడుల్లో ఆహార భద్రతా అధికారులు, టీజీ సేఫ్‌ పోలీసు సిబ్బంది, రాష్ట్ర ఫుడ్ ల్యాబొరేటరీ టెక్నీషియన్లు, జీహెచ్‌ఎంసీ పశువైద్య అధికారులు పాల్గొన్నారు.