హైదరాబాద్, వెలుగు: రైతులకు అనువైన వరి రకాలను గుర్తించేందుకు ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ వర్సిటీ, వరి పరిశోధన సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో రైతుల అభిప్రాయ సేకరణ కార్యక్రమం నిర్వహించారు.
రాజేంద్రనగర్లోని వ్యవసాయ పరిశోధనా సంస్థ (ఏఆర్ఐ) వరి పరిశోధనా విభాగం ఆధ్వర్యంలో శుక్రవారం జరిగిన ఈ కార్యక్రమంలో నల్గొండ, సూర్యాపేట, జనగామ, యాదాద్రి భువనగిరి, వనపర్తి, మహబూబ్నగర్ జిల్లాల రైతులు పాల్గొన్నారు. పది రకాల వరి మినీకిట్లను పరిశీలించిన రైతులు మొలక దశ లక్షణాలు, మొక్కల పెరుగుదల, ఇతర గుణగణాల ఆధారంగా తమ అభిప్రాయాలను నమోదు చేశారు.
ఏఆర్ఐ డైరెక్టర్, వరి పరిశోధనా విభాగాధిపతి వై.చంద్ర మోహన్ నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో శాస్త్రవేత్తలు యాసంగి వరి సాగు, చలి ప్రభావం, వెదజల్లే పద్ధతిలో సాగు, పురుగులు, తెగుళ్ల నివారణ, నాణ్యమైన విత్తనోత్పత్తిపై రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా రైతులకు సజ్జ విత్తనాలను పంపిణీ చేశారు. శాస్త్రవేత్తలు శ్రీధర్ సిద్ధి, పరిమళ కుమార్, ఐ.అరుణశ్రీ, లక్ష్మీ ప్రసన్న, అరుణకుమారి, పద్మజ తదితరులు పాల్గొన్నారు.
