రాష్ట్రవ్యాప్తంగా అటవీకరణ చేపట్టండి : హైకోర్టు

రాష్ట్రవ్యాప్తంగా అటవీకరణ చేపట్టండి : హైకోర్టు
  • ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
  • దామగుండం రాడార్‌‌ ప్రాజెక్టుపై పిల్‌‌ విచారణ ముగింపు

హైదరాబాద్‌‌, వెలుగు: వికారాబాద్‌‌ జిల్లా దామగుండం రిజర్వు అటవీ ప్రాంతానికే పరిమితం కాకుండా రాష్ట్రవ్యాప్తంగా మొక్కల పెంపకం, అటవీకరణ కార్యక్రమాలను కొనసాగించాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. దామగుండంలో ఫ్రీక్వెన్సీ రాడార్‌‌ కేంద్రం ఏర్పాటుకు అటవీ భూములను కేటాయించినందుకు ప్రత్యామ్నాయంగా చేపట్టిన అటవీకరణ చర్యలపై సంతృప్తి వ్యక్తం చేస్తూ, ఈ ప్రాజెక్టును సవాలు చేస్తూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యంపై విచారణను ముగించింది.

దామగుండంలో 2,900 ఎకరాల అటవీ భూమిని రాడార్‌‌ కేంద్రం ఏర్పాటుకు కేటాయించడాన్ని సవాలు చేస్తూ ‘దామగుండం ఫారెస్ట్‌‌ ప్రొటెక్షన్‌‌ జేఏసీ’ 2020లో పిల్‌‌ దాఖలు చేసింది. దీనిపై తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌‌ పి.శ్యాంకోశీ, జస్టిస్‌‌ సుద్దాల చలపతిరావులతో కూడిన డివిజన్‌‌ బెంచ్‌‌ శుక్రవారం విచారణ చేపట్టింది. పర్యావరణ సమతుల్యత, జీవవైవిధ్య పరిరక్షణకు విస్తృత చర్యలు చేపట్టాలని, మొక్కల పెంపకాన్ని ఒక జిల్లాకే పరిమితం చేయకుండా రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని ధర్మాసనం సూచించింది.