- డీలిమిటేషన్ బిల్లుకు మద్దతుతో ఎన్డీయే వైపు ఎన్సీపీ (ఎస్పీ)
- మహారాష్ట్ర సర్కారులో రెండు కేబినెట్ బెర్తులకు బేరం
- పార్టీ చీలకుండా ఉండాలంటే
- తప్పదని కాంగ్రెస్‌కు పవార్ ఫోన్
- పవార్‌ను రాజ్యసభకు పంపింది మేమే.. ఇప్పుడేంటి?: కాంగ్రెస్
ముంబై: డీలిమిటేషన్ బిల్లుకు మద్దతిచ్చి ఇండియా కూటమి నుంచి ఎన్డీయే వైపు మళ్లుతున్నందుకు ప్రతిఫలంగా శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ (ఎస్పీ) కేంద్రంలో, మహారాష్ట్రలో అధికారంలో వాటా కోసం బేరమాడుతోందని జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. పవార్ కూతురు, ఎంపీ సుప్రియా సూలేకు మోదీ కేబినెట్‌లో బెర్త్ ఇవ్వాలని పార్టీ పట్టుబడుతున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. మహారాష్ట్ర ప్రభుత్వంలోనూ రెండు కేబినెట్ బెర్తులు (జయంత్ పాటిల్‌కు ఆర్థిక శాఖ, జితేంద్ర ఆవ్హాడ్‌కు మరో శాఖ), రెండు సహాయ మంత్రి పదవులు కోరుతోందని సమాచారం. సుప్రియాను మహారాష్ట్ర సీఎం చేయాలని పవార్ కోరుతున్నారనే వార్తలను ఆమె కొట్టిపారేశారు. ఈ నెల 30న సభలో ఓటింగ్‌కు ముందే ఒప్పందం ఖరారు చేసేందుకు తెరవెనుక చర్చలు జోరుగా సాగుతున్నాయి.
ఇండియా కూటమి మీటింగ్ కు వెళ్లను: సుప్రియా
అనారోగ్యంతో బాధపడుతున్న శరద్ పవార్ ఇప్పటికే కాంగ్రెస్ నాయకత్వానికి ఫోన్ చేసి, పార్టీ చీలిపోకుండా ఉండాలంటే బిల్లుకు మద్దతివ్వడం తప్పనిసరని చెప్పినట్లు తెలిసింది. సోమవారం నేరుగా ఢిల్లీకి వెళ్తానని ప్రకటించిన సుప్రియా, శనివారం జరిగే ఇండియా కూటమి భేటీకి హాజరుకావడం లేదు. దీనిపై మహారాష్ట్ర కాంగ్రెస్ ‘ఎక్స్’లో స్పందిస్తూ 10 మంది ఎమ్మెల్యేలే ఉన్నా 85 ఏండ్ల పవార్‌ను ఈ ఏడాది మార్చిలో రాజ్యసభకు పంపేందుకు సుప్రియా కోరగానే రాహుల్, ఖర్గే ఏమాత్రం సంకోచించకుండా మద్దతిచ్చారని గుర్తుచేసింది. ‘మరి ఇప్పుడేంటి?’ అని ప్రశ్నించింది.
