- గత ఆదేశాలను పాటించకపోవడంపై ఆగ్రహం
- కోర్టు ధిక్కరణను ఉక్కుపాదంతో అణచివేస్తామని వార్నింగ్
చెన్నై: తమిళనాడు మధురైలోని తిరుప్పరంకుండ్రం కొండపై ఉన్న దీపతూన్ వద్ద కార్తీక దీపం వెలిగించాలన్న ఆదేశాన్ని పాటించనందుకు తమిళనాడు ప్రభుత్వంపై సుప్రీంకోర్టు మండిపడింది. అధికారుల తీరు చూస్తుంటే కావాలనే కోర్టు ధిక్కరణకు పాల్పడినట్లు అనిపిస్తోందని వ్యాఖ్యానించింది. శనివారం ఎట్టి పరిస్థితుల్లోనూ దీపతూన్ రాతి స్తంభంపై దీపం వెలిగించాలని స్పష్టం చేసింది. రాతి స్తంభం వద్ద కార్తీక దీపం వెలిగించేందుకు సుప్రీంకోర్టు గతంలో రాష్ట్ర ప్రభుత్వానికి అనుమతిచ్చింది.
అయితే, ఈ నెల 24న అధికారులు కోర్టు ఆదేశాలను పక్కనపెట్టి.. పాత పద్ధతిలోనే ఉచ్చిపిళ్లయార్ మండపం వద్ద మాత్రమే దీపం వెలిగించారు. దీనిపై భారత పురావస్తు శాఖ (ఏఎస్ఐ) సుప్రీంకోర్టులో కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌ను జస్టిస్ అరవింద్ కుమార్ ధర్మాసనం శుక్రవారం విచారించింది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం తీరుపై బెంచ్ అసహనం వ్యక్తం చేసింది. కోర్టు ఆదేశాలను ఎవరూ ఉల్లంఘించలేరని, ఇలాంటి పరిస్థితులను ఉక్కుపాదంతో అణచివేయాల్సిన టైమొచ్చిందని హెచ్చరించింది.
లేకుంటే దేశంలో రాజ్యాంగ సంక్షోభం తలెత్తే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. మధురై జిల్లాలో పరిపాలన పూర్తిగా అరాచకంగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేసిన కోర్టు.. అరుల్మిగు సుబ్రమణ్యస్వామి ఆలయ ధర్మకర్తల మండలిని తక్షణమే సస్పెండ్ చేస్తున్నట్లు స్పష్టం చేసింది. ఆలయ నిర్వహణ బాధ్యతలను మేఘాలయ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తికి అప్పగిస్తూ రిసీవర్ (తాత్కాలిక నిర్వాహకుడు)గా నియమించింది. శనివారం దీపం వెలిగించే సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా సీఆర్పీఎఫ్ బలగాలను మోహరించాలని ఆదేశించింది.
కలెక్టర్‌తోపాటు పలువురికి నోటీసులు
ధిక్కరణ అంశంపై మధురై జిల్లా కలెక్టర్ దాఖలు చేసిన నివేదికను కోర్టు తప్పుబట్టింది. అది కేవలం మొసలి కన్నీరు కార్చే ప్రయత్నంలా ఉందని మండిపడింది. కలెక్టర్‌తో పాటు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ మహేశ్ అగర్వాల్, దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు, మధురై పోలీస్ కమిషనర్, ఎస్పీలకు కోర్టు నోటీసులు జారీ చేసింది. దీపం వివాదానికి సంబంధించి జరిగిన సమావేశాలు, అధికారుల మధ్య నడిచిన మెసేజ్‌లు, కాల్ డీటెయిల్స్ వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది. తదుపరి విచారణకు ఆయన స్వయంగా కోర్టు ముందు హాజరుకావాలని స్పష్టం చేసింది. ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా తప్పుబట్టిన బెంచ్.. శనివారం దీపం వెలిగించిన తర్వాతే తదుపరి వాదనలు వింటామని తేల్చి చెప్పింది.
