- అనంత్ సింగ్ కూతురు పెండ్లికి 5 లక్షల మంది అతిథులు
- రూ.50 కోట్ల ఖర్చు.. 10 ఎకరాల్లో తాజ్ మహల్ తరహా సెట్
పాట్నా: బిహార్లోని మొకామా ఎమ్మెల్యే అనంత్ సింగ్ చిన్న కూతురు శివాంగి సింగ్ పెండ్లి వేడుకలో భోజనాల దగ్గర తీవ్ర గందరగోళం నెలకొంది. పాట్నా జిల్లాలోని అనంత్ సింగ్ సొంతూరు నద్వాన్లో బుధవారం జరిగిన ఈ పెండ్లికి దాదాపు 4 నుంచి 5 లక్షల మంది అతిథులు హాజరయ్యారు. భోజనాల కౌంటర్ల దగ్గర జనం ఒక్కసారిగా ఎగబడటంతో తోపులాట జరిగింది. ప్లేట్లు, పూరీల కోసం జనం ఒకరినొకరు తోసుకున్నారు. రద్దీ ఎక్కువ కావడంతో వంట సిబ్బంది ఎత్తైన వేదికల నుంచి విస్తర్లను, ప్లేట్లను గాల్లోకి విసిరారు.
కిందపడిన ఆహారాన్ని జనం ఏరుకుని తింటున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ప్లేట్లు సరిపోక గ్లాసులనే ప్లేట్లుగా వాడుకోవడం, అట్టపెట్టెల్లో భోజనం నింపుకెళ్లడం, స్వీట్ల కౌంటర్ దగ్గర రసగుల్లాల కోసం కొట్లాట వంటి వీడియోలూ వైరల్ అయ్యాయి. తోపులాటలో ఓ వ్యక్తి కూర గిన్నెలో పడిపోయిన వీడియో కూడా చర్చనీయాంశంగా మారింది.
150 రకాల వంటకాలు
‘ఛోటే సర్కార్’గా పేరొందిన అనంత్ సింగ్ కూతురు శివాంగి సింగ్కు రిషికేశ్ కుమార్ తో వివాహం జరిగింది. ఈ పెండ్లిని దాదాపు రూ.50 కోట్ల ఖర్చుతో నిర్వహించినట్లు సమాచారం. ఇందుకోసం 10 ఎకరాల స్థలంలో తాజ్ మహల్ తరహాలో ప్రత్యేక సెట్ వేశారు. 150కి పైగా శాకాహార వంటకాలు వడ్డించేందుకు దాదాపు 300 వంట కేంద్రాలు, 500 మంది వంటవాళ్లు, 30 ఫుడ్ స్టాళ్లు ఏర్పాటు చేసినట్లు తెలిసింది.
అనంత్ సింగ్ అందరికీ సాధారణ ఆహ్వానం పలకడంతో ఊహించని స్థాయిలో జనం తరలివచ్చారు. దీంతో ఆ గ్రామానికి వెళ్లే రోడ్లలో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ నెలకొంది. భారీ ఏర్పాట్లు చేసినా రద్దీ నియంత్రణలో వైఫల్యంతో భోజనాల దగ్గర ఇబ్బందులు తలెత్తాయి.
