డీలిమిటేషన్‌పై చివరి దాకా పోరాడుతం..బిల్లును ఓడిస్తామన్న రాహుల్

డీలిమిటేషన్‌పై చివరి దాకా పోరాడుతం..బిల్లును ఓడిస్తామన్న రాహుల్
  •   సోనియా నివాసంలో కాంగ్రెస్ స్ట్రాటజీ మీటింగ్
  •     బిల్లుకు జై కొడితే కూటమిలో కుదరదు
  •     పవార్ పార్టీకి కాంగ్రెస్ పరోక్ష హెచ్చరిక

    
న్యూఢిల్లీ: పార్లమెంట్ ప్రత్యేక సిట్టింగ్‌లో కేంద్రం తేనున్న డీలిమిటేషన్ బిల్లును అడ్డుకునేందుకు కాంగ్రెస్ సర్వశక్తులూ ఒడ్డేందుకు సిద్ధమవుతోంది. సంఖ్యాబలం అనుకూలంగా లేకపోయినా బిల్లుపై చివరిదాకా పోరాడుతామని, ప్రతిపక్షాలన్నింటినీ ఏకం చేసేందుకు ప్రయత్నిస్తామని లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పార్టీ నేతలకు చెప్పినట్లు కాంగ్రెస్ పార్టీ వెల్లడించింది. కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్ సోనియా గాంధీ నివాసంలో శుక్రవారం జరిగిన పార్లమెంటరీ స్ట్రాటజీ గ్రూప్ భేటీలో ఖర్గే, రాహుల్, సీనియర్ నేతలు పాల్గొన్నారు. ‘బీజేపీ తన రాజకీయ ప్రయోజనాల కోసమే బిల్లును మళ్లీ తెస్తోంది. గతంలో లాగే ఈసారీ దాన్ని ఓడించేందుకు చివరిదాకా పోరాడుతాం. ప్రతిపక్షాలన్నింటినీ కలుపుకొని పోయేందుకుww ప్రయత్నిస్తాం. అయితే ఇది ఆయా పార్టీల వైఖరిపై ఆధారపడి ఉంటుంది’ అని రాహుల్ అన్నట్లు సమాచారం. డీఎంకే, సమాజ్‌వాదీ పార్టీ, ఎన్సీపీ (శరద్ పవార్) వంటి పార్టీల మద్దతు కీలకమని ఆయన పేర్కొన్నట్లు తెలిసింది. లోక్‌సభలో ‘మోసపూరిత మూడింట రెండొంతుల మెజారిటీ’ సాధించేందుకే మోదీ సర్కారు ప్రత్యేక సెషన్​ను వాడుకుంటోందని కాంగ్రెస్ ఆరోపించింది.

పవార్ పార్టీకి హెచ్చరిక

డీలిమిటేషన్‌పై ప్రతిపక్షాల ఉమ్మడి వైఖరికి భిన్నంగా వెళ్తే ఇండియా కూటమిపై ప్రభావం పడుతుందని కాంగ్రెస్ సంకేతాలిచ్చింది. ఎన్సీపీ (ఎస్పీ) బిల్లుకు అనుకూలంగా ఓటేస్తే తమ వైఖరిని పునఃసమీక్షించుకోవాల్సి వస్తుందని, కూటమిలో ఏ పార్టీ అయినా ఉమ్మడి ప్రతిజ్ఞను వదిలేస్తే ‘బిజినెస్ యాజ్ యూజువల్’గా ఉండదని కాంగ్రెస్ సీనియర్ నేత ఒకరు అన్నారు. సోమవారం లోక్‌సభ ముందుకు బిల్లు రానున్నా, ముసాయిదా బిల్లులను ఎంపీలకు ఇప్పటిదాకా పంపలేదని, ప్రతిపక్ష ఎంపీలను చీకట్లో ఉంచి కీలక రాజ్యాంగ మార్పులు చేయాలని చూస్తోందని కాంగ్రెస్ ఆరోపించింది. శనివారం ఖర్గే ఆధ్వర్యంలో ప్రతిపక్ష పార్టీలతో మరోసారి చర్చలు జరపనున్నట్లు కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ చెప్పారు.

ఎవరు ఎక్కడ ఓటేయాలో కూడా..

లోక్‌సభ ప్రస్తుత బలాన్ని కొనసాగించాలని, ఇప్పుడున్న సీట్లలోనే మహిళా రిజర్వేషన్ అమలు చేయాలని, రాష్ట్రాలవారీ సీట్ల పంపకాన్ని రాబోయే 25 ఏండ్లు మార్చొద్దని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోందని గొగోయ్ చెప్పారు. ‘మొదట సర్ ద్వారా ఎవరు ఓటేయాలో, ఎవరు వేయకూడదో మోదీ, అమిత్ షా నిర్ణయించారు. ఇప్పుడు డీలిమిటేషన్ ద్వారా ఎవరు ఎక్కడ ఓటేయాలో నిర్ణయిస్తారా?’ అని ప్రశ్నించారు. ఎన్నికల సంఘాన్ని మోదీ సర్కారు తోలుబొమ్మగా మార్చిందని, డీలిమిటేషన్ ద్వారా పార్లమెంట్‌లో బలం పెంచుకుని రాజ్యాంగాన్ని మార్చడమే బీజేపీ అసలు లక్ష్యమని ఆరోపించారు. ఒకేరోజు 140 మందికి పైగా ప్రతిపక్ష ఎంపీలను సస్పెండ్ చేయడాన్ని, సీఈసీకి చట్టపరమైన రక్షణ కల్పిస్తూ తెచ్చిన చట్టాన్ని గుర్తుచేశారు.

మహిళా రిజర్వేషన్ ఇప్పటికే చట్టం: జైరాం

ప్రత్యేక సిట్టింగ్ ఉద్దేశంపై కేంద్రం దేశాన్ని తప్పు దోవ పట్టిస్తోందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ ఆరోపించారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించే నారీశక్తి వందన్ అధినియం 2023 సెప్టెంబర్‌లోనే ఏకగ్రీవంగా పాసైందని, దాన్ని వెంటనే అమలు చేయాలని ఖర్గే డిమాండ్ చేసినా 2026 ఏప్రిల్ 16 రాత్రి 10.40 గంటల దాకా కేంద్రం నోటిఫై చేయలేదని ‘ఎక్స్’లో పేర్కొన్నారు. ‘ప్రత్యేక సెషన్ మహిళా రిజర్వేషన్ కోసం కాదు. అది ఇప్పటికే చట్టం. దాన్ని ప్రధాని, హోం మంత్రి జోడీ మూడేండ్లుగా అటకెక్కించారు’ అని విమర్శించారు. డీలిమిటేషనే ప్రత్యేక సిట్టింగ్ అసలు ఎజెండా అని, ప్రస్తుత పరిస్థితుల్లో ఈ ప్రక్రియను ఎన్నికల సంఘానికి అప్పగిస్తే నియోజకవర్గాల భౌగోళిక స్వరూపాన్ని ప్రభుత్వం తారుమారు చేసే అవకాశం ఉందని ఆరోపించారు. ‘భయంతో ఉన్న ప్రధాని తీసుకున్న నిస్సహాయ చర్య ఇది. దీన్ని గట్టిగా ఎదుర్కొంటాం’ అని అన్నారు.