- 2018 నుంచి ఇప్పటివరకు 9 సార్లు అగ్ని ప్రమాదాలు
- మొఘల్‌పురా టౌన్‌ప్లానింగ్‌లో రెండేండ్లలో నాలుగు సార్లు నిప్పు
- శుక్రవారం ఖైరతాబాద్ జోన్ఆఫీసులో అగ్గి
- 2018లో కూడా అకౌంట్స్, ఆడిట్ విభాగాల్లో ఫైర్
- అన్ని చోట్లా తగలబడిన విలువైన పత్రాలు
హైదరాబాద్ సిటీ, వెలుగు: జీహెచ్ఎంసీ కార్యాలయాల్లో వరుసగా చోటుచేసుకుంటున్న అగ్నిప్రమాదాలు కలకలం రేపుతున్నాయి. ఈ ప్రమాదాల్లో టౌన్ ప్లానింగ్, ట్యాక్స్, అకౌంట్స్, రెవెన్యూ విభాగాలకు చెందిన కీలక రికార్డులు దగ్ధం కావడం చూస్తే ప్రమాదవశాత్తు జరుగుతున్నాయా? లేక ఆయా ఆఫీసుల్లోని అధికారులు, సిబ్బంది చేసే అక్రమాలు బయటపడతాయనే ఇలా చేస్తున్నారా అన్న సందేహాలు కలుగుతున్నాయి. తాజాగా శుక్రవారం ఖైరతాబాద్ జోనల్ ఆఫీసులోని రెండో అంతస్తులోని ఫైనాన్స్ సెక్షన్‌లో చెక్కులు, కీలక ఆర్థిక రికార్డులు భద్రపరిచిన గదిలో మంటలు చెలరేగి విలువైన పత్రాలు కాలిపోయాయి.
అయితే, జీహెచ్ఎంసీ ఆఫీసుల్లో అగ్ని ప్రమాదాలు జరిగి ఫైల్స్, డాక్యమెంట్లు బుగ్గి కావడం మొదటిసారి కాదు. 2018 నుంచి ఇప్పటివరకు జీహెచ్ఎంసీకి సంబంధించిన పలు ఆఫీసుల్లో తొమ్మిది వరకు అగ్ని ప్రమాదాలు జరగ్గా...అన్ని చోట్లా ఫైల్స్ కాలి బూడిదయ్యాయి. వరుసగా జీహెచ్ఎంసీ ఆఫీసుల్లోనే ఫైర్యాక్సిడెంట్లు జరుగుతుండడం, కొన్ని చోట్ల రిపీట్అవుతుండడం, ముఖ్యమైన ఫైల్స్కాలిపోతుండడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 2022 జనవరి 12న సికింద్రాబాద్ జోనల్ ఆఫీసులోని మూడో అంతస్తులోని ట్యాక్స్ సెక్షన్‌లోనూ మంటలు చెలరేగాయి.
ఎక్కడెక్కడ జరిగాయంటే..
ఖైరతాబాద్జోనల్ఆఫీసులో గతంలోనూ అగ్ని ప్రమాదం జరిగింది. 2018 ఫిబ్రవరి 6న ఖైరతాబాద్ జోనల్ ఆఫీసులోనే అకౌంట్స్, ఆడిట్ విభాగాల్లో ఫైర్యాక్సిడెంట్జరిగి 295 పెండింగ్ రన్నింగ్ బిల్లులకు సంబంధించిన ఫైళ్లు కాలిపోయినట్లు అప్పటి నివేదికల్లో వెల్లడైంది. తొమ్మిది కంప్యూటర్లు, మూడు ప్రింటర్లు, స్కానర్లు కూడా అగ్నికి ఆహుతయ్యాయి. 2023 మే 11న మొఘల్‌పురా స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో జరిగిన అగ్నిప్రమాదంలోనూ టౌన్ ప్లానింగ్‌కు సంబంధించిన పలు ముఖ్యమైన రికార్డులు దగ్ధమయ్యాయి. 2025 మే 5న మొఘల్‌పురా టౌన్ ప్లానింగ్ విభాగంలో అగ్నిప్రమాదం జరగ్గా..ఇదే బిల్డింగులో రెండేళ్ల వ్యవధిలో నాలుగు సార్లు ఫైర్యాక్సిడెంట్లు చోటుచేసుకున్నాయి. ఇక 2025 నవంబర్13న కుత్బుల్లాపూర్ సర్కిల్ ఆఫీసులో జరిగిన అగ్నిప్రమాదంలో ట్యాక్స్ రిటర్నులు, టౌన్ ప్లానింగ్‌కు సంబంధించిన రికార్డులు పూర్తిగా కాలిపోయాయి.
విచారణ ఉంటది..ఫలితమే ఉండదు..
అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు ఆయా విభాగాల్లోని అక్రమ నిర్మాణాలు, భవన నిర్మాణ అనుమతులు ఇచ్చినవి, ఆస్తి పన్ను, భూవివాదాలకు సంబంధించిన ఫైళ్లు కాలిపోతున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. అయితే, ప్రమాదం జరిగినప్పుడు అధికారులు విచారణ చేస్తున్నా.. ఏం తేల్చారన్నది బయటకు రావడం లేదు. ఎంక్వైరీ చేసి వారి నివేదికల్లో చెప్పిందేమిటి? బాధ్యులుగా ఎవరిని తేల్చారు? ఎవరిపైన అయినా చర్యలు తీసుకున్నారా? ప్రమాదాలు జరిగినప్పుడు ఆఫీసుల్లోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారా? దగ్ధమైన రికార్డులకు సంబంధించిన డిజిటల్ బ్యాకప్ అందుబాటులో ఉందా? అనేవి చెప్పడం లేదు. పైగా ఫైర్యాక్సిడెంట్జరిగిన ప్రతిసారి షార్ట్‌సర్క్యూటే కారణమని ప్రాథమికంగా అంచనా వేసి చెప్తున్నారు. జీహెచ్ఎంసీ కార్యాలయాల్లో ఇప్పటివరకు జరిగిన అన్ని అగ్ని ప్రమాదాలకు కూడా ఇదే కారణం చెప్పారు. మరి అదే నిజమైతే జీహెచ్ఎంసీ ఆఫీసుల్లో ఫైర్ సేఫ్టీని ఎందుకు సీరియస్‌గా తీసుకోవడం లేదన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా అన్ని జోనల్, సర్కిల్ ఆఫీసుల్లో సమగ్ర ఫైర్ సేఫ్టీ ఆడిట్ నిర్వహించి, కీలక రికార్డులకు డిజిటల్ బ్యాకప్ ఏర్పాటు చేయాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి.
ఖైరతాబాద్ జోనల్ ఆఫీసులో రికార్డులు బూడిద
పంజాగుట్ట : ఖైరతాబాద్ జీహెచ్‌ఎంసీ జోనల్ ఆఫీసులోని రెండో అంతస్తులో ఉన్న రికార్డులు భద్రపరిచే గదిలో శుక్రవారం తెల్లవారుజామున అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో కీలక ఫైళ్లతో పాటు ఫర్నిచర్, కంప్యూటర్లు, బిల్లులు, ఇతర ఆఫీసు సామగ్రి కాలిపోయింది. 2018 లో నాలాల పూడిక తీత పనుల్లో జరిగిన భారీ అవినీతికి సంబంధించిన వివరాలు, పూడిక తీతలో ఉపయోగించిన వాహనాలకు సంబంధించిన పేపర్లు, వాటి బిల్లులు ఇదే గదిలో భద్రపరిచనట్లు సమాచారం. అప్పటి విచారణ ఇటీవల ప్రారంభమైందని, ఆ గుట్టు బయటపడొద్దనే ఇలా చేసి ఉంటారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. విలువైన రికార్డులు భద్రపరిచే ఈ రూమ్ దగ్గర సెక్యూరిటీ, సీసీ కెమెరాలు లేకపోవడాన్ని అడ్వాంటేజ్‌గా తీసుకున్నారేమోనన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. తెల్లవారుజామున 3 గంటలకు కరెంట్ పోయిందని, 5గంటలకు తన కొడుకు ఆరోగ్యం బాగోలేక ఇంటికి వెళ్లిపోయినట్టు నైట్ వాచ్‌మన్ చెప్తున్నాడు. ఇదే అవకాశంగా భావించి ఎవరైనా నిప్పు పెట్టారా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. మరోవైపు ప్రమాదంపై కనీసం పీఎస్‌లో ఫిర్యాదు చేయకపోవడం చూస్తే ఏదో జరిగి ఉంటుందని ఆ శాఖలోని సిబ్బంది గుసగుసలాడుకుంటున్నారు.
