- అత్యధికంగా యాదాద్రిలో 13 సెంటీమీటర్లు నమోదు
- హైదరాబాద్ సిటీని నెలరోజుల తర్వాత పలకరించిన వాన
- పలుచోట్ల 8 సెంటీమీటర్ల మేర వర్షపాతం
- నేడూ 15 జిల్లాల్లో వర్షాలు: వాతావరణ శాఖ
- రాత్రి ఉష్ణోగ్రతలు 4 డిగ్రీల మేర పడిపోవచ్చని వెల్లడి
హైదరాబాద్, వెలుగు: ఇటీవల బంగాళాఖాతంలో మూడు తుఫాన్లు వచ్చినా రాష్ట్రంపై పెద్దగా వానల ప్రభావం లేదు. కానీ తాజాగా ఎలాంటి తుఫాన్లు, వాతావరణశాఖ హెచ్చరికలు లేకపోయినా అకస్మాత్తుగా వర్షాలు పడుతున్నాయి. అనుకోకుండా పడుతున్న వర్షాలతో ఊరట వచ్చినా.. చేతికొచ్చిన పంటలు దెబ్బతింటుండడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గురువారం రాత్రి మొదలైన వాన శుక్రవారం తెల్లవారుజాము వరకు కురవడంతో యాదాద్రి భువనగిరి, హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి, రంగారెడ్డి, సంగారెడ్డి, నాగర్‌కర్నూల్ జిల్లాలు తడిసిముద్దయ్యాయి. ముఖ్యంగా అర్ధరాత్రి ఒంటి గంట తర్వాత హైదరాబాద్‌లో ఒక్కసారిగా ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురవడంతో నగర వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. బంగాళాఖాతంలోని నైరుతి ప్రాంతం నుంచి తమిళనాడు తీరం, మన్నార్ గల్ఫ్ వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతుండడం, తెలంగాణపై తూర్పు, ఆగ్నేయ దిశల నుంచి గాలులు వీస్తుండటమే ఆకస్మిక వర్షాలకు కారణమని వాతావరణ శాఖ వెల్లడించింది.
ఎక్కడెక్కడ ఎంత వర్షపాతమంటే..!
యాదాద్రి జిల్లాలో వర్షాలు జోర్దార్గా పడ్డాయి. అత్యధికంగా యాదాద్రి కలెక్టరేట్ వద్ద ఏకంగా 13 సెంటీమీటర్ల భారీ వర్షం కురిసింది. ఆలేరు మండలం షరాజ్‌పేటలో 10 సెంటీమీటర్లు, బొమ్మలరామారంలో 9, భువనగిరి మండలం హన్మాపూర్‌లో 9, ఆలేరు మండలం గోలకొండలో 8.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. సంగారెడ్డి జిల్లా వట్‌పల్లిలో 6 సెంటీమీటర్ల వర్షం పడింది. గుండ్ల మాచనూర్‌లో 5 సెంటీమీటర్లు, నాగర్‌కర్నూల్ జిల్లా తాడూరు మండలం ఎంగంపల్లిలో 4.5 , తోటపల్లిలో 4.5 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది.
పెరగనున్న చలి
శనివారం కూడా పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశమున్నట్టు వాతావరణ శాఖ వెల్లడించింది. నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో వర్షాలు పడే చాన్స్ ఉంది. హైదరాబాద్ నగరంలో మబ్బులు పట్టి తేలికపాటి జల్లులు పడొచ్చని వెల్లడించింది.
