ఒకేసారి 3 బిల్లులు  2 రాజ్యాంగసవరణలు!  మహిళా రిజర్వేషన్ కోసం కేంద్రం ప్యాకేజీ 

ఒకేసారి 3 బిల్లులు  2 రాజ్యాంగసవరణలు!  మహిళా రిజర్వేషన్ కోసం కేంద్రం ప్యాకేజీ 
  • మూడింట రెండొంతుల మెజారిటీ తప్పనిసరి
  • ఈసారి పాసవుతాయని కేంద్రం ధీమా
  • పార్టీల నుంచి పూర్తి హామీ వచ్చాకే ప్రత్యేక సిట్టింగ్
  • సరిహద్దులకు 2011 లెక్కలు.. సీట్ల నిష్పత్తికి 1971 లెక్కలు

న్యూఢిల్లీ: లోక్‌సభ, అసెంబ్లీల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ అమలు కోసం కేంద్రం ఒకేసారి మూడు బిల్లులు పార్లమెంట్ ముందుకు తెస్తోంది. వీటిలో రెండు రాజ్యాంగ సవరణ బిల్లులు కాగా, మరొకటి సాధారణ బిల్లు. కేంద్ర కేబినెట్ శుక్రవారం ఆమోదం తెలిపిన ఈ బిల్లులను ఈ నెల 30 నుంచి జరిగే ప్రత్యేక సిట్టింగ్‌లో ప్రవేశపెట్టనున్నారు. 2029 లోక్‌సభ ఎన్నికల కంటే ముందే మహిళా రిజర్వేషన్ అమలు చేయడమే లక్ష్యమని అధికార వర్గాలు తెలిపాయి. ఏప్రిల్‌లో ఇలాంటి బిల్లులే వీగిపోయినా, ఈసారి మూడూ తప్పక పాసవుతాయని కేంద్రం ధీమాగా ఉంది. ‘ఈసారి మూడు బిల్లులూ పాసవుతాయని పూర్తి నమ్మకంతో ఉన్నాం. చాలా పార్టీలు, నేతలతో సంప్రదించాం. వారి నుంచి పూర్తి హామీ వచ్చాకే ప్రత్యేక సిట్టింగ్ పెట్టాలని నిర్ణయించాం’ అని ఓ అధికారి చెప్పారు.

రాజ్యాంగ సవరణలే అసలు పరీక్ష

సాధారణ బిల్లు పాసు కావాలంటే సభలో సాధారణ మెజారిటీ చాలు. కానీ రాజ్యాంగ సవరణ బిల్లులకు లోక్‌సభ, రాజ్యసభల్లో హాజరై ఓటేసిన వారిలో మూడింట రెండొంతుల మద్దతు తప్పనిసరి. రాష్ట్రాల ప్రాతినిధ్యాన్ని మార్చే సవరణలు కాబట్టి కనీసం సగం రాష్ట్రాల అసెంబ్లీల ఆమోదం కూడా కావాలి. ఏప్రిల్ 17న ప్రవేశపెట్టిన రాజ్యాంగ సవరణ బిల్లుకు 298 మంది అనుకూలంగా, 230 మంది వ్యతిరేకంగా ఓటేయడంతో అవసరమైన 352 ఓట్లు రాక 
వీగిపోయింది. అందుకే ఈసారి ఆ బిల్లును తీవ్రంగా వ్యతిరేకించిన డీఎంకే, ఎన్సీపీ (ఎస్పీ) వంటి పార్టీల మద్దతు కోసం బిల్లుల్లో కీలక మార్పులు చేసినట్లు సదరు అధికారి వెల్లడించారు.

ఈ సారి మార్పులు ఇవీ

కొత్త బిల్లుల్లో ప్రతి రాష్ట్రానికి కేటాయించిన లోక్‌సభ, అసెంబ్లీ సీట్లను 50 శాతం పెంచుతున్నట్లు స్పష్టంగా పేర్కొన్నారు. లోక్‌సభ సీట్లు గరిష్ఠంగా 850కి పెరుగుతాయి. కొన్ని కేంద్రపాలిత ప్రాంతాలు మినహా ప్రతి రాష్ట్రంలో నియోజకవర్గాలు 50 శాతం పెరుగుతాయి. నియోజకవర్గాల సరిహద్దులను 2011 జనాభా లెక్కల ఆధారంగా పునర్విభజిస్తారు. రాష్ట్రాల మధ్య సీట్ల నిష్పత్తిని మాత్రం 1971 జనాభా లెక్కల ఆధారంగానే నిర్ణయిస్తారు. ఇప్పటి జనాభా ఆధారంగా డీలిమిటేషన్ చేస్తే లోక్‌సభలో తమ వాటా తగ్గుతుందనే దక్షిణాది రాష్ట్రాల ఆందోళనను తొలగించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నారు. ఉత్తరాది రాష్ట్రాలతో పోలిస్తే దక్షిణాది రాష్ట్రాలు జనాభా నియంత్రణను సమర్థంగా అమలు చేశాయని అధికార వర్గాలు పేర్కొన్నాయి.