- ప్రాజెక్టు పురోగతి, చెల్లింపు సామర్థ్యం చూడలేదా?
- భూమి కేటాయింపు రద్దు ప్రక్రియలో ఉండగానే రుణం
- ఎస్‌బీఐ తీరుపై హైకోర్టు ఆశ్చర్యం
- బ్యాంకు పిటిషన్‌లో సీబీఐని ప్రతివాదిగా చేర్చిన కోర్టు
హైదరాబాద్, వెలుగు: ఫ్యాబ్ సిటీలో రూ.20 వేల కోట్ల (2.2 బిలియన్ డాలర్ల) పెట్టుబడితో సెమీకండక్టర్ పరిశ్రమ ఏర్పాటు చేస్తామని 100 ఎకరాలు తీసుకున్న సెమ్ ఇండియా ఫ్యాబ్ ప్రైవేట్ లిమిటెడ్ పనులను పరిశీలించకుండానే ఎస్‌బీఐ భారీ రుణం మంజూరు చేయడంపై హైకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. కంపెనీ ఆదాయ వనరులు, చెల్లింపు సామర్థ్యం, క్షేత్రస్థాయిలో పనుల పురోగతిని పరిశీలించకుండా కేవలం భూమిని తాకట్టు పెట్టుకుని రుణం ఎలా ఇచ్చారని ప్రశ్నించింది. ప్రభుత్వం భూమి కేటాయింపు రద్దు ప్రక్రియ చేపట్టిన సమయంలోనే రుణం మంజూరు చేయడంపై విస్మయం వ్యక్తం చేసింది.
రుణ రికవరీకి ప్రభుత్వం అడ్డుపడకుండా ఉత్తర్వులివ్వాలని ఎస్‌బీఐ దాఖలు చేసిన పిటిషన్‌లో సీబీఐని ప్రతివాదిగా చేర్చింది. తదుపరి విచారణను డిసెంబర్ 4కు వాయిదా వేసింది. సెమ్ ఇండియాకు కేటాయించిన 100 ఎకరాల్లో పనులు చేపట్టకపోవడంతో 78 ఎకరాలను వెనక్కి తీసుకుంటూ ప్రభుత్వం 2010 ఫిబ్రవరి 9న జీవో 9 జారీ చేసింది. అయితే అంతకుముందే 2008లోనే ప్రాజెక్టు పనుల్లో పురోగతి లేదని ఫ్యాబ్‌సిటీ సంస్థ కంపెనీకి నోటీసులు ఇచ్చింది. ఆర్థిక వనరుల సమీకరణ (ఫైనాన్షియల్ క్లోజర్) వివరాలు కూడా సమర్పించలేదు. ఈ పరిస్థితుల్లో ఎస్‌బీఐ రుణం మంజూరు చేసింది. కంపెనీ భూమిని తనఖా పెట్టి రుణం తీసుకున్న విషయం కూడా ఫ్యాబ్‌సిటీ సంస్థకు వేలం నోటీసు అందేవరకు తెలియలేదని కాగ్ నివేదికలో పేర్కొంది.
లోన్‌కు ప్రాతిపదిక ఏంటని ప్రశ్న?
రుణం మంజూరు చేసే సమయంలో కంపెనీ కనీసం రూ.10 వేల కోట్ల పెట్టుబడి పెట్టినట్లు ఆధారాలు లేవని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. 2023లో ఇదే హైకోర్టు సెమ్ ఇండియా భూమి స్వాధీనాన్ని సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసిందని గుర్తుచేశారు. 12 ఏళ్లయినా 22 ఎకరాల్లో అసంపూర్తి షెడ్ మినహా ప్రాజెక్టులో పురోగతి లేదని అప్పటి తీర్పులో పేర్కొన్న విషయాన్ని ప్రస్తావించారు.
కేవలం భూమిని పూచీకత్తుగా తీసుకుని ఇంత భారీ రుణం మంజూరు చేయడం సమంజసం కాదని అసంతృప్తి వ్యక్తం చేశారు. రుణం మొత్తంపై కూడా వేర్వేరు వివరాలు వెలుగులోకి వచ్చాయి. 2009 జూన్‌లో రూ.100 కోట్ల రుణం తీసుకున్నట్లు కాగ్ నివేదిక పేర్కొనగా, హైకోర్టులో ఎస్‌బీఐ తరఫు న్యాయవాది అసలు రుణం రూ.169 కోట్లని, వడ్డీతో కలిపి బకాయి రూ.640 కోట్లకు పైగా ఉందని గతంలో వెల్లడించారు. తాజా విచారణలో రూ.500 కోట్ల రుణం ప్రాతిపదికపై కోర్టు ప్రశ్నలు లేవనెత్తింది. భూమి స్వాధీనానికి సంబంధించి 2010 జీవోతోపాటు 2023 ఆగస్టు 3న జారీ చేసిన ప్రొసీడింగ్స్‌ను సవాల్ చేస్తూ ఎస్‌బీఐ ఈ పిటిషన్ దాఖలు చేసింది. ఈ వ్యవహారానికి సంబంధించిన పత్రాలన్నీ సీబీఐ తరఫు న్యాయవాదికి అందించాలని రిజిస్ట్రీని హైకోర్టు ఆదేశించింది.
