- డీలిమిటేషన్ బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం
- ప్రతి రాష్ట్రంలో 50 శాతం
- చొప్పున సీట్లు పెరిగే అవకాశం
- దేశవ్యాప్తంగా లోక్‌సభ స్థానాలు 550 నుంచి 850కి
- తెలంగాణలో ఎంపీ సీట్లు 17 నుంచి 26కు..
- ఇందులో మహిళలకు తొమ్మిది సీట్లు రిజర్వ్
- 179కి అసెంబ్లీ సీట్లు.. ఉమెన్ కోటా 60 స్థానాలు
- డ్రాఫ్ట్ నోటిఫికేషన్ విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం
న్యూఢిల్లీ, వెలుగు:రాష్ట్రం నుంచి ఢిల్లీకి వెళ్లే ఎంపీలు 17 నుంచి 26 మంది కానున్నారు. అసెంబ్లీలో అడుగుపెట్టే ఎమ్మెల్యేల సంఖ్య 119 నుంచి 179కి చేరనుంది. డీలిమిటేషన్‌తో ముడిపడిన రాజ్యాంగ సవరణ బిల్లుకు కేంద్ర కేబినెట్ శుక్రవారం ఆమోదం తెలిపింది. ప్రతి రాష్ట్రంలో లోక్‌సభ, అసెంబ్లీ సీట్లను ఒకేలా 50% పెంచి, రాష్ట్రాల వాటాను 2051 వరకు ఫ్రీజ్ చేసేలా బిల్లును సవరించారు. అదే లెక్కన అసెంబ్లీ సీట్లూ పెరిగితే రాష్ట్రంలో కొత్తగా 60 నియోజకవర్గాలు పుట్టుకొస్తాయి. ఇందులో మూడో వంతు సీట్లు మహిళలకు దక్కనుండటంతో ఏ సీటు ఎవరికి మిగులుతుందోనని పార్టీలు అప్పుడే లెక్కలు మొదలుపెట్టాయి. ఈ నెల 30 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ బిల్లులు ఆమోదం పొందడం దాదాపు ఖాయంగా కనిపిస్తున్నది. ప్రస్తుతం లోక్‌సభలో ఖాళీలు పోగా 540 మంది ఎంపీలు ఉండగా, 2/3 మెజారిటీకి 360 ఓట్లు అవసరం. 320 మంది ఎంపీల సొంత బలం ఉన్న ఎన్డీఏ.. ఎన్సీపీఐ (20), శివసేన షిండే వర్గం(6), ఎన్సీపీ శరద్‌పవార్(8), వైఎస్ఆర్సీపీ(4) మద్దతుతో 358 కి చేరింది.
అంటే మ్యాజిక్ ఫిగర్‌కు కేవలం రెండు అడుగుల దూరంలో నిలిచింది. ఈసారి బిల్లులను ఎలాగైనా గట్టెక్కించాలనే పట్టుదలతో ఉన్న ఎన్డీఏ సర్కారు విపక్ష ఎంపీల మద్దతు కూడగట్టే క్రమంలో డీ లిమిటేషన్ బిల్లులో పలు సవరణలు ప్రతిపాదించింది. దీనికి కేబినెట్ఆమోదముద్ర వేసింది. ఈ ప్రతిపాదనల ప్రకారం బిల్లు చట్టరూపం దాల్చితే దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో 50 శాతం చొప్పున సీట్లు పెరుగుతాయి. ఈ లెక్కన ప్రస్తుత లోక్ సభ స్థానాల సంఖ్య 550 నుంచి 850 వరకు పెరుగుతుంది. తెలంగాణలోనూ 50 శాతం చొప్పున కొత్తగా 9సీట్లు పెరిగే అవకాశముంది. అంటే ప్రస్తుతం ఉన్న 17 లోక్ సభ స్థానాల సంఖ్య 26 కు చేరుతుంది. అసెంబ్లీ స్థానాలు కూడా పెరుగుతాయి.
1971 జనాభా లెక్కల ఆధారంగా
1971 జనాభా లెక్కల ఆధారంగా రాష్ట్రాల్లోని లోక్‌సభ సీట్ల వాటా/నిష్పత్తినే 2051 వరకు కొనసాగించాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించింది. అంటే మరో 25 ఏండ్ల పాటు ఈ డీలిమిటేషన్ అమలులో ఉంటుంది. తాజాగా ప్రతిపాదిస్తున్న 50 శాతం సీట్ల పెంపు వల్ల రాష్ట్రాలపై ఎలాంటి ఎఫెక్ట్(జనాభా వల్ల) పడదని కేంద్రం భావిస్తున్నది. కుటుంబ నియంత్రణ కార్యక్రమాల వల్ల జనాభాను నియంత్రించిన రాష్ట్రాలకు ఎలాంటి నష్టం జరగదని చెబుతోంది. డీలిమిటేషన్ బిల్లుతో లోక్ సభ స్థానాల పెంపుతో పాటే మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించుకోవడం ద్వారా మహిళలకు చట్ట సభల్లో 33 శాతం(మూడింట ఒక వంతు) రిజర్వేషన్లు దక్కనున్నాయి.
ఎస్సీ, ఎస్టీ రిజర్వ్డ్ సీట్లలో కూడా మహిళలకు సబ్‌కోటా ఉంటుంది. డీలిమిటేషన్‌తో రాష్ట్రాల్లో సీట్ల సంఖ్యను పెంచడం ద్వారా జనరల్ సీట్లు తగ్గకుండా మహిళలకు సీట్లు కేటాయించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 2023 నాటి 106 వ రాజ్యాంగ సవరణ చట్టం(నారీ శక్తి వందన్ అధినియం) ప్రకారం.. డీలిమిటేషన్ పూర్తయిన తర్వాతే మహిళా రిజర్వేషన్లు అమల్లోకి వస్తాయని విశ్లేషకులు చెబుతున్నారు.
తెలంగాణలో 179 అసెంబ్లీ సీట్లు..!
కేంద్రం డీలిమిటేషన్ బిల్లును తెరపైకి తేవడంతో పునర్విభజన చట్టం ప్రకారం తెలుగు రాష్ట్రాల్లో నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) అంశం మరోసారి తెరపైకి వచ్చింది. 2014 ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోని సెక్షన్ 26(1) ప్రకారం ఏపీ అసెంబ్లీ స్థానాల సంఖ్య 175 నుంచి 225కు, తెలంగాణ అసెంబ్లీ స్థానాల సంఖ్య 119 నుంచి 153కు పెరగాల్సి ఉంది. కేంద్ర ప్రతిపాదించిన డ్రాఫ్ట్ బిల్ ప్రకారం యాభై శాతం సీట్లు పెరుగుతాయి. అంటే ప్రస్తుతం 119 అసెంబ్లీ సీట్లున్నాయి. డీలిమిటేషన్ తర్వాత179 సీట్ల వరకు చేరే అవకాశం ఉంటుంది. ఇందులో 60 సీట్లు మహిళలకు రిజర్వ్ అయ్యే అవకాశం ఉంది. అలాగే 17 పార్లమెంటు స్థానాలు 26కు చేరే అవకాశం ఉంది. అందులో 9 సీట్లు మహిళలకు రిజర్వ్ అవుతాయి. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఆ రాష్ట్రంలో ప్రస్తుతం 175 అసెంబ్లీ స్థానాలున్నాయి. అవి కాస్తా 262–263 అసెంబ్లీ సీట్లకు చేరుతాయి. కొత్తగా 87–88 నియోజకవర్గాలు ఏర్పాటవుతాయి. ఇందులో మూడో వంతు.. అంటే దాదాపు 87–88 సీట్లు మహిళలకు రిజర్వ్ అవుతాయి. అదే విధంగా ప్రస్తుతం ఏపీలో 25 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. 50 శాతం పెంపుతో 37 నుంచి38కి చేరే అవకాశం ఉంది. ఇందులో మూడో వంతు మహిళలకు అంటే దాదాపు 12 నుంచి13 సీట్లు రిజర్వ్ అవుతాయి.
డీలిమిటేషన్ డ్రాఫ్ట్ బిల్లులో ఏముంది?
- లోక్‌సభ @ 850 గరిష్ఠ పరిమితి 550 నుంచి 850కి. రాష్ట్రాలకు 815, యూటీలకు 35.
- అందరికీ 50% పెంపు ప్రతి రాష్ట్రంలో ఎంపీ, ఎమ్మెల్యే సీట్లు ఒకేలా 50 శాతం పెరుగుతాయి.
- లోక్‌సభ 543 నుంచి 815కు.
- అసెంబ్లీ @ 650 రాష్ట్ర అసెంబ్లీ గరిష్ఠ పరిమితి 500 నుంచి 650కి.
- 2051 వరకు ఫ్రీజ్ సీట్ల పంపకం, సరిహద్దులు పాతికేండ్లు మారవు.
- మహిళలకు మూడో వంతు ఎస్సీ, ఎస్టీ మహిళలు సహా 33% సీట్లు వాళ్లకే.
- 15 ఏండ్ల కోటా రొటేషన్ పద్ధతిలో రిజర్వేషన్; పార్లమెంట్ పొడిగించొచ్చు.
- జనరల్ సీట్లు తగ్గవు కొత్త సీట్లతోనే మహిళా కోటా.
- జనగణన కోసం ఆగక్కర్లే డీలిమిటేషన్ ఎప్పుడు, ఏ లెక్కలతో చేయాలో పార్లమెంటే నిర్ణయిస్తుంది.
- రాష్ట్రాలవారీ లెక్క లేదు ఏ రాష్ట్రానికి ఎన్ని సీట్లనేది క్లియర్ గా బిల్లులో చెప్పలేదు.
- గట్టెక్కాలంటే పార్లమెంట్‌లో మూడింట రెండొంతుల మెజారిటీ + సగం రాష్ట్రాల ఆమోదం.
- సోమవారం సభలోకి ఈ నెల 30న లోక్‌సభ ముందుకు
