శరీరానికి అత్యవసర పోషకాలలో విటమిన్ B12 కీలకం. రక్తకణాల తయారీ, మెదడు పనితీరు, నరాలు ఆరోగ్యంగా ఉండాలంటే ఈ విటమిన్ అవసరం. ఇది లోపిస్తే రక్తహీనత, జ్ఞాపకశక్తి తగ్గడం వంటి మేజర్ ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఎక్కువ కాలం నిర్లక్ష్యం చేస్తే నరాలపై శాశ్వత ప్రభావం పడే ప్రమాదం ఉంది. అటువంటి విటమిన్ B12 లోపంతో మన దేశంలో సగానికి పైగా ప్రజలు బాధపడుతున్నారు. ముఖ్యంగా టీనేజర్లు.. ఎంతలా అంటే ప్రతి ముగ్గురిలో ఇద్దరు కౌమార దశలో ఉన్న పిల్లలు విటమిన్ B12 లోపంతో కాలం వెల్లదీస్తున్నారు. ఇవి కాకి లెక్కలు కావు.. ఇది స్వయంగా ప్రభుత్వ సంస్థలు నిర్వహించిన సర్వేలు చెబుతున్నాయి.
దేశంలో పోషకాహార లోపం సమస్య చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు విస్తరించిందని ICMR-నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ (NIN) నిర్వహించిన సంపద (SAMPADA) జాతీయ సర్వే వెల్లడించింది. ముఖ్యంగా విటమిన్ B12 లోపం ఆందోళనకర స్థాయిలో ఉన్నట్లు గుర్తించింది. 10నుంచి-19 ఏళ్ల బాలురలో 66.1 శాతం, బాలికల్లో 65.4 శాతం మందికి ఈ లోపం ఉంది. అంటే ప్రతి ముగ్గురు కౌమారదశలోని పిల్లల్లో ఇద్దరికి దాదాపుగా B12 కొరత ఉన్నట్టే. పిల్లలు, మహిళలు, పురుషులు, గర్భిణులు, వృద్ధులు.. ఇలా అన్ని వయసుల వారిని ఈ సమస్య బాధిస్తోంది.
చిన్న వయసు నుంచే..
2023-నుంచి25 మధ్య నిర్వహించిన ఈ సర్వేలో 35 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 183 జిల్లాల నుంచి 2 లక్షల మందిని సర్వేలో భాగస్వాములను చేశారు. దాదాపు1.7 లక్షలకు పైగా బ్లడ్ శాంపిల్స్ పరీక్షించారు. 12నుంచి -59 నెలల చిన్నారుల్లో 37.3 శాతం, 5-నుంచి9 ఏళ్ల పిల్లల్లో 46.5 శాతం మందికి విటమిన్ B12 లోపం ఉన్నట్లు తేలింది. 20నుంచి-59 ఏళ్ల పురుషుల్లో 60.4 శాతం, అదే వయసు మహిళల్లో 55.2 శాతం మందికి ఈ సమస్య ఉంది. గర్భిణుల్లో 63.1 శాతం, పాలిచ్చే తల్లుల్లో 51.8 శాతం మందికి B12 లోపం ఉన్నట్లు గుర్తించారు.
రక్తహీనతకు, పోషకాల లోపానికి తేడా..
కౌమార బాలికల్లో 46.3 శాతం మందికి రక్తహీనత ఉండగా, 65.4 శాతం మందికి B12 లోపం ఉంది. బాలురలో ఎనిమియా 22.8 శాతం ఉండగా B12 లోపం 66.1 శాతంగా ఉంది. అంటే B12 లోపం ఉన్న ప్రతి ఒక్కరికీ రక్తహీనత ఉంటుందని కాదు. ఐరన్, ఫోలేట్, B12 వంటి పోషకాల లోపాలు రక్తహీనతకు కారణమవుతాయి. అలసట, బలహీనత, ఏకాగ్రత తగ్గడం, నరాల సమస్యలు వంటి ఇబ్బందులు కూడా B12 లోపంతో రావచ్చు.
ఈ గణాంకాలు దేశంలో పోషకాహార లోపం ఎంత విస్తృతంగా ఉందో స్పష్టం చేస్తున్నాయి. ముఖ్యంగా చిన్న వయసు నుంచే విటమిన్ B12 లోపం ఆందోళన కలిగించే విషయం. పిల్లల ఎదుగుదల, చదువుపై ఏకాగ్రత, శారీరక ఆరోగ్యంపై తీవ్రప్రభావం పడే అవకాశం ఉంది. అందుకే పోషకాహారంపై కుటుంబాలతో పాటు ప్రభుత్వాలు కూడా ప్రత్యేక దృష్టి పెట్టాలి. పాఠశాల స్థాయిలో పోషకాహార అవగాహన, అవసరమైన వైద్య పరీక్షలు, లోపం గుర్తించి సరైన చికిత్స అందించాలి. రక్తహీనత నివారణ చర్యలతోపాటు B12 వంటి సూక్ష్మపోషకాల లోపాలను గుర్తించి పరిష్కరించినప్పుడే ఆరోగ్యవంతమైన భవిష్యత్ తరాన్ని నిర్మించగలం.
సంపద రిపోర్టు కోసం.. వెబ్ సైట్ https://www.nin.res.in/ebooks/Sampada_Anaemia_BM_Factsheet.pdf.
