న్యూఢిల్లీ: రాష్ట్రాలవ్యాప్తంగా లోక్సభ సీట్లను 50 శాతం పెంచాలన్న కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనకు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు సంపూర్ణ మద్దతు తెలిపారు. నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ బిల్లులకు అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ఇవ్వాలని ఆయన కోరారు. శుక్రవారం (నవంబర్ 27) కేంద్ర మంత్రి కుమారస్వామితో కలిసి చంద్రబాబు ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు.
50 శాతం లోక్ సభ, రాష్ట్ర అసెంబ్లీల సీట్ల పెంపు నిర్ణయం ప్రాతినిధ్యం విషయంలో దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్న ఆందోళనలను పరిష్కరిస్తుందని చెప్పారు. డీలిమిటేషన్ బిల్లుపై ప్రతిపక్ష పార్టీలు స్పష్టమైన వైఖరి తీసుకోవాలని కోరారు. గతంలో బిల్లుల ఆమోదం విషయంలో జరిగిన తప్పులను మళ్లీ చేయవద్దని హితవు పలికారు. దేశ నిర్మాణంలో మహిళలు సమాన భాగస్వాములు కావాలని, వారికి 33 శాతం రిజర్వేషన్లు కల్పించడం అవసరమని పేర్కొన్నారు.
సీట్ల పెంపు వివరాలు
నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా సీట్లను 50 శాతం పెంచడం వల్ల దక్షిణ రాష్ట్రాలు తమ ప్రస్తుత ప్రాతినిధ్య వాటాను నిలుపుకోగలవని చంద్రబాబు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ లోక్సభ సీట్లు 25 నుంచి 38కి, తెలంగాణ సీట్లు 17 నుంచి 26కు పెరుగుతాయని తెలిపారు. తమిళనాడులో 39 నుంచి 59కి, కర్ణాటకలో 28 నుంచి 42కు, కేరళలో 20 నుంచి 30కి సీట్ల సంఖ్య పెరుగుతుందని వివరించారు.
ఐదు దక్షిణ రాష్ట్రాల సంయుక్త బలం 129 నుంచి 195 సీట్లకు పెరుగుతుందని తెలిపారు. సీట్లు పెరిగినా మొత్తం పార్లమెంటరీ ప్రాతినిధ్యంలో దక్షిణాది రాష్ట్రాల వాటా 23.76 శాతంగానే యథాతథంగా ఉంటుందని స్పష్టం చేశారు. ఏపీ వాటా 4.6 శాతం, తమిళనాడు 7.18 శాతం, కర్ణాటక 5.16 శాతం, తెలంగాణ 3.13 శాతం, కేరళ 3.68 శాతంగా కొనసాగుతాయని వెల్లడించారు.
జనాభా నియంత్రణపై ఆందోళన
కుటుంబ నియంత్రణ పాటించడం వల్ల దక్షిణాది రాష్ట్రాలు తమ పార్లమెంటరీ వాటాను కోల్పోతామని గతంలో భయపడ్డాయని చంద్రబాబు చెప్పారు. సంతానోత్పత్తి రేటు తగ్గుతున్న నేపథ్యంలో జనాభా నిర్వహణపై దృష్టి పెట్టాలని సూచించారు. పెద్ద కుటుంబాలకు ప్రోత్సాహకాలు ఇవ్వాలని, ఎక్కువ మంది పిల్లలను కనేలా ప్రజలను ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. రాష్ట్రాలవ్యాప్తంగా సీట్లను 50 శాతం పెంచి, 2051 వరకు వాటి ప్రస్తుత ప్రాతినిధ్య నిష్పత్తిని కొనసాగించే ప్రతిపాదనకు కేంద్ర మంత్రివర్గం నవంబర్ 27న ఆమోదం తెలిపింది. ఈ లోక్సభ విస్తరణ ‘నారీ శక్తి వందన అధినియం’ కింద మహిళా రిజర్వేషన్ల అమలుతో ముడిపడి ఉంది.
