2030 నాటికి బాల్య వివాహ రహిత తెలంగాణే లక్ష్యం: డీజీపీ సీవీ ఆనంద్

2030 నాటికి బాల్య వివాహ రహిత తెలంగాణే లక్ష్యం: డీజీపీ సీవీ ఆనంద్

హైదరాబాద్: తెలంగాణను 2030 నాటికి బాల్య వివాహ రహిత రాష్ట్రంగా మార్చడమే లక్ష్యంగా పోలీసు శాఖ ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని డీజీపీ సీవీ ఆనంద్ సూచించారు. 2024 నుంచి 2026 నవంబర్ 25 వరకు రాష్ట్రవ్యాప్తంగా 31 పోలీస్ యూనిట్ల పరిధిలో బాల్య వివాహాలకు సంబంధించి 1,497 కేసులు నమోదైనట్లు వెల్లడించారు. ప్రతి బాల్య వివాహం ఒక చిన్నారి భవిష్యత్తును దెబ్బతీస్తుందని ఆయన పేర్కొన్నారు. బాల్య వివాహాల నివారణలో పోలీసులు చురుకైన పాత్ర పోషించాలని ఆదేశించారు. ఎక్కడైనా బాల్య వివాహం జరుగుతున్నట్లు సమాచారం అందితే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. 

బాల్య వివాహం జరుగుతోందనే అనుమానం వచ్చినా పోలీసులకు సమాచారం ఇవ్వాలని, ఫిర్యాదు చేయడానికి పూర్తి వివరాలు తెలిసి ఉండాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. అందిన సమాచారంపై తక్షణమే కేసులు నమోదు చేసి, వేగవంతంగా దర్యాప్తు చేపట్టాలని అధికారులకు సూచించారు. నేరాల నియంత్రణ, సైబర్ భద్రత, డ్రగ్స్ నిర్మూలన, రోడ్డు ప్రమాదాల నివారణతో పాటు బాల్య వివాహాల అరికట్టడంలో సమన్వయంతో పనిచేస్తూ ప్రజలకు మెరుగైన పోలీసు సేవలు అందించాలని పోలీసు అధికారులకు దిశానిర్దేశం చేశారు.

శుక్రవారం (నవంబర్ 27) కామారెడ్డి జిల్లా పోలీసు శాఖ పనితీరు, నేరాల నియంత్రణ, సైబర్ నేరాల రికవరీ, రోడ్డు ప్రమాదాల నివారణ తదితర అంశాలపై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆస్తి నేరాల నియంత్రణకు పోలీస్ పెట్రోలింగ్‌ను మరింత పెంచాలని ఆదేశించారు. నేరాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలను గుర్తించి ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని, అంతర్రాష్ట్ర నేర ముఠాల కార్యకలాపాలను అడ్డుకునేందుకు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. 

సైబర్ నేరాల రికవరీలో కామారెడ్డి పోలీసులకు ప్రశంసలు

సైబర్ నేరాల బాధితులు కోల్పోయిన నగదును తిరిగి రాబట్టడంలో కామారెడ్డి జిల్లా పోలీసులు సాధించిన ఫలితాలను డీజీపీ అభినందించారు. సైబర్ మోసాల్లో బాధితులు కోల్పోయిన మొత్తంలో 61 శాతం నగదును రికవరీ చేసినట్లు వెల్లడించారు. 2025లో 69 శాతం సైబర్ నగదు రికవరీ సాధించినట్లు పేర్కొన్నారు.

మొబైల్ ఫోన్ల రికవరీలో కామారెడ్డి జిల్లా రాష్ట్రంలో ఏడో స్థానంలో నిలిచింది. జిల్లాలో మొత్తం 7,285 మొబైల్ ఫోన్లు పోగా, వాటిలో 3,683 ఫోన్లను పోలీసులు తిరిగి స్వాధీనం చేసుకున్నారు. ఏఐ ఆధారిత సైబర్ మోసాలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు, పోలీసులు అప్రమత్తంగా ఉండాలని డీజీపీ సూచించారు.

ఐదు పోలీస్ స్టేషన్ల పరిధిలోనే 42 శాతం నేరాలు

జిల్లాలో నమోదవుతున్న మొత్తం నేరాల్లో 42 శాతం ఐదు పోలీస్ స్టేషన్ల పరిధిలోనే జరుగుతున్నట్లు సమీక్షలో గుర్తించారు. కామారెడ్డి, దేవునిపల్లి, బాన్సువాడ, బిచ్కుంద, బిక్కనూరు పోలీస్ స్టేషన్లపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు సూచించారు.

కామారెడ్డి పట్టణంలో మరో పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయడానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని, బాన్సువాడలో కొత్త పోలీస్ స్టేషన్‌తో పాటు మహిళా పోలీస్ స్టేషన్, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లాలో 182 పోలీసు పోస్టులు ఖాళీగా ఉన్నట్లు సమీక్షలో వెల్లడైంది.

ఆపరేషన్ కవచ్‌తో అంతర్రాష్ట్ర ముఠాలకు చెక్

మహారాష్ట్ర, కర్ణాటక సరిహద్దు ప్రాంతాల్లో అంతర్రాష్ట్ర నేర ముఠాల కదలికలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని డీజీపీ ఆదేశించారు. ఆపరేషన్ కవచ్ ద్వారా నేరగాళ్ల కార్యకలాపాలను అడ్డుకోవాలని సూచించారు. డ్రగ్స్ నియంత్రణకు పోలీసు అధికారులు, సిబ్బంది ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని పేర్కొన్నారు. 

2029 నాటికి నషా ముక్త్ భారత్ లక్ష్య సాధనలో భాగంగా జిల్లాలో విస్తృత చర్యలు చేపట్టాలన్నారు. జిల్లాలో ఇప్పటివరకు 400 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. డ్రగ్స్ కేసుల్లో నిందితుల ఆస్తులను జప్తు చేసేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. మాదకద్రవ్యాలకు బానిసైన బాధితుల పునరావాసం కోసం డీ-అడిక్షన్ కేంద్రం ఏర్పాటు అవసరమని అభిప్రాయపడ్డారు.

రోడ్డు ప్రమాదాల నివారణకు 25 బ్లాక్ స్పాట్లు గుర్తింపు

జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు 25 బ్లాక్ స్పాట్లను గుర్తించినట్లు సమీక్షలో వెల్లడించారు. ముఖ్యంగా జాతీయ రహదారి 44 (NH-44), 765D రహదారులపై ప్రమాదాల నివారణకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు.

అక్రమ ఇసుక రవాణాపై కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు. 2026 నవంబర్ వరకు అక్రమ ఇసుక రవాణాకు సంబంధించి 193 కేసులు నమోదు చేసి, 281 వాహనాలను సీజ్ చేసినట్లు వివరించారు.

ఆన్‌లైన్ గేమింగ్, రౌడీషీట్లపై ప్రత్యేక నిఘా

ఆన్‌లైన్ గేమింగ్‌కు సంబంధించిన కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రత్యేక నిఘా కొనసాగించాలని డీజీపీ సూచించారు. 2026లో ఇప్పటివరకు 376 గేమింగ్ కేసులు నమోదైనట్లు తెలిపారు. రౌడీషీటర్ల కదలికలను నిరంతరం పర్యవేక్షించాలని, 2026లో జిల్లాలో 135 కొత్త రౌడీషీట్లు తెరిచినట్లు పేర్కొన్నారు.

ప్రతి పోలీస్ స్టేషన్‌లో సీసీటీఎన్ఎస్ (CCTNS), ఈ-సాక్ష వ్యవస్థలను సమర్థంగా వినియోగించాలని సూచించారు. పోలీసు సిబ్బంది ఆరోగ్య పరిరక్షణ కోసం ఫిట్‌కాప్ కార్యక్రమాన్ని అమలు చేయాలని, పోలీస్ వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.