చేవెళ్లలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు యువకులు స్పాట్ డెడ్

చేవెళ్లలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు యువకులు స్పాట్ డెడ్

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మున్సిపల్ పరిధిలోని దేవుని ఎర్రవల్లి గేటు సమీపంలో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వాసవి కాంక్రీట్ కంపెనీకి చెందిన లారీ యూటర్న్ తీసుకుంటున్న సమయంలో వెనుక నుంచి వేగంగా వచ్చిన ద్విచక్రవాహనం లారీని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై ప్రయాణిస్తున్న కొన్నింటి గౌతమ్ (20), కొన్నింటి వంశీ (20) అక్కడికక్కడే మృతిచెందారు. 

మృతులిద్దరూ వికారాబాద్ జిల్లా పరిగి మండలం సైదుపల్లి గ్రామానికి చెందినవారిగా పోలీసులు గుర్తించారు. గౌతమ్ చేవెళ్లలోని బైక్ జోన్‌లో మెకానిక్‌గా పనిచేస్తుండగా, వంశీ ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నట్లు తెలిసింది. వంశీ స్వగ్రామం నుంచి చేవెళ్ల వచ్చి గౌతమ్‎ను కలిశాడు. అనంతరం ఇద్దరు కలిసి స్నేహితుడిని కలిసేందుకు మోకిలా వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. 

లారీని ఢీకొన్న అనంతరం ఇద్దరూ లారీ కింద పడటంతో తీవ్ర గాయాలై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.