- ఇందులో రూ.40.57 కోట్లునగదు రూపంలోనే
- అండాల దందాతో లింకుపై పోలీసుల ఆరా
- బేగంపేట కార్పొరేట్ ఆఫీసులో సోదాలు.. ల్యాప్‌టాప్‌లు, ఫైళ్లు సీజ్
- 29 నగరాల్లో 46 కేంద్రాలు.. మదీనాగూడ ఏఆర్టీ బ్యాంక్‌పై ఫోకస్
హైదరాబాద్, వెలుగు: అండాల సేకరణ, విక్రయ దందా కేసులో ‘ఒయాసిస్ ఫెర్టిలిటీ’ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. బంజారాహిల్స్ కేంద్రంగా ఏర్పాటైన ‘సద్గురు హెల్త్‌కేర్ సర్వీసెస్’ అనుబంధ సంస్థ ఒయాసిస్ ఫెర్టిలిటీ ఆర్థిక వ్యవహారాలపై మేడ్చల్–మల్కాజిగిరి పోలీసులు దృష్టి పెట్టారు. ఈ రెండు సంస్థల పేరిట ఉన్న హెచ్డీఎఫ్సీ, ఎస్బీఐ ఖాతాల్లో జరిగిన లావాదేవీలను పరిశీలిస్తున్నారు.
ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి నవంబర్ 26 వరకు, అంటే ఎనిమిది నెలల్లోనే సద్గురు హెల్త్‌కేర్ హెచ్డీఎఫ్సీ ఖాతాలో 41,867 లావాదేవీలు జరిగాయని, రూ.247.11 కోట్ల దాకా జమ అయ్యాయని పోలీసులు గుర్తించారు. ఇందులో రూ.40.57 కోట్లు నగదు రూపంలో వచ్చాయి. ఈ నగదుకు అండాల సేకరణ వ్యవహారంతో ఏమైనా సంబంధం ఉందా అనే కోణంలో పోలీసులు వివరాలు రాబడుతున్నారు. 2026 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో సంస్థ ఆదాయం రూ.291 కోట్లుగా నమోదైంది. అక్టోబర్ 27న ఒయాసిస్ హాస్పిటల్ పేరిట రూ.49,990 జమ కావడం వంటి లావాదేవీల వెనుక లోగుట్టు ఏంటో తేల్చే పనిలో పోలీసులు ఉన్నారు.
2009లో బంజారాహిల్స్‌లో మొదలై..
ఒయాసిస్ ఫెర్టిలిటీ కేంద్రాలను నిర్వహిస్తున్న ‘సద్గురు హెల్త్‌కేర్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్’ 2009 మే 15న హైదరాబాద్‌లో ఏర్పాటైంది. కంపెనీ రికార్డుల ప్రకారం సహ వ్యవస్థాపకుడు, వాటాదారు గేదెల వెంకట సూర్యకిరణ్ సంస్థ ఏర్పాటైన రోజే డైరెక్టర్‌గా, అదే ఏడాది జులై 1న మేనేజింగ్ డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టారు. డాక్టర్ గేదెల దుర్గారావు డైరెక్టర్‌గా, నిషాంత్ శర్మ నామినీగా ఉన్నారు. 2009లో బంజారాహిల్స్‌లో తొలి క్లినిక్‌తో ప్రారంభమైన ఒయాసిస్ నెట్వర్క్ ఇప్పుడు 29 నగరాల్లో 46 కేంద్రాలకు విస్తరించిందని, వీటిలో తెలంగాణలో 14, ఏపీలో 12 ఉన్నాయని దర్యాప్తులో తేలింది. మదీనాగూడ ఏఆర్టీ బ్యాంకుపై పోలీసులు ప్రధానంగా దృష్టి పెట్టారు. ఇక్కడి నుంచే గచ్చిబౌలి, ఉప్పల్ సెంటర్లకు అండాల కేటాయింపు జరిగినట్లు విచారణలో వెల్లడైంది. ఏఆర్టీ బ్యాంకు రిజిస్టర్లు, ఎగ్ డోనర్ల అగ్రిమెంట్లు, క్లినిక్‌ల బిల్లులు, బ్యాంకు లావాదేవీలను పూర్తిగా పరిశీలిస్తే తప్ప అండాల దందా ఎన్ని కోట్లలో జరిగిందో చెప్పలేమని పోలీస్ ఉన్నతాధికారులు అంటున్నారు.
కార్పొరేట్ ఆఫీసులో సోదాలు
బేగంపేట సర్దార్ పటేల్ రోడ్‌లోని ఒయాసిస్ హాస్పిటల్ కార్పొరేట్ ఆఫీసులో పోలీసులు గురు, శుక్రవారాల్లో సోదాలు చేశారు. ఏఆర్టీ బ్యాంకులు, ఫెర్టిలిటీ సేవలు, డోనర్ల రికార్డులతో పాటు ల్యాప్‌టాప్‌లు, ఇతర డిజిటల్ పరికరాలు, ఫైళ్లను స్వాధీనం చేసుకున్నారు. అండాల దానం కోసం మహిళల నియామకం, రిజిస్ట్రేషన్, వైద్య పరీక్షలు, స్క్రీనింగ్, రిఫరల్ వివరాలతో పాటు ఆర్థిక లావాదేవీల రికార్డులనూ సీజ్ చేశారు. సంస్థలో పనిచేస్తున్న వారి బాధ్యతలు, పాత్రలను తెలిపే పత్రాలను కూడా పరిశీలిస్తున్నారు. స్వాధీనం చేసుకున్న పరికరాలు, పత్రాలను ఫోరెన్సిక్ విశ్లేషణకు పంపారు. అసిస్టెడ్ రీప్రొడక్టివ్ టెక్నాలజీ (రెగ్యులేషన్) చట్టం–2021 నిబంధనలు పాటించారా, ఉల్లంఘించారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఈ వ్యవహారంలో డబ్బు ఎక్కడి నుంచి వస్తోంది, ఎవరెవరికి ఎంత చెల్లిస్తున్నారు, మధ్యవర్తులకు ఎంత కమీషన్ అందుతోంది, అండాలు ఇచ్చిన మహిళలకు ఎంత పరిహారం ఇస్తున్నారనే అంశాలపై లోతుగా ఆరా తీస్తున్నారు.
