ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) దెబ్బతో ఐటీ ఉద్యోగాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. గతంలో వందల మంది చేసే పనులను ఇప్పుడు ఏఐ టూల్స్ కొన్ని నిమిషాల్లోనే చేస్తుండటంతో ఐటీ కంపెనీలు కొత్తగా రిక్రూట్ మెంట్లను తగ్గించాయి. ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసి ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న ఫ్రెషర్లకు అవకాశాలకు కత్తెర పడింది. ఏఐ ఎఫెక్ట్ తో భారీగా క్యాంపస్ ప్లేస్ మెంట్స్ తగ్గించాయి ఐటీ కంపెనీలు. ఎంతలా అంటే ఏడాదిలో దాదాపు ముప్పై శాతం క్యాంపస్ రిక్రూట్ మెంట్స్ డౌన్ అయ్యాయి.
తమిళనాడులోని పలు ఇంజనీరింగ్ కళాశాలల్లో 2026లో క్యాంపస్ ప్లేస్‌మెంట్లు 20 శాతం వరకు తగ్గినట్లు నివేదికలు చెబుతున్నాయి. అన్నా యూనివర్సిటీలో గతేడాది నవంబర్ నాటికి సాఫ్ట్‌వేర్, ప్రొడక్ట్ డెవలప్‌మెంట్ విభాగాల్లో 498 మందికి ఉద్యోగాలు రాగా.. ఈ ఏడాది 416 మందికే వచ్చాయి. హిందుస్థాన్ ఇన్‌స్టిట్యూట్‌లో ఐటీ ఉద్యోగ ఆఫర్లు 10 నుంచి 15 శాతం తగ్గాయి. వెల్లూరు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలోనూ ఉద్యోగ ఆఫర్లు 5 శాతం పడిపోయాయి.
సాధారణంగా ఐటీ కంపెనీలు కొత్తగా చేరిన ఉద్యోగులతో కోడింగ్, సాఫ్ట్‌వేర్ టెస్టింగ్ వంటి పనులు చేయించేవి. ఇప్పుడు ఆ పనుల్లో చాలా వరకు ఏఐ సాయంతోనే పూర్తవుతున్నాయి. దీంతో ఆయా పనుల కోసం ఎక్కువ మంది ఉద్యోగులను తీసుకోవాల్సిన అవసరం కంపెనీలకు తగ్గుతోంది. ఫలితంగా ఫ్రెషర్ల నియామకాలపై ప్రభావం పడుతోంది.
అయితే ఏఐ వల్ల అన్ని ఉద్యోగాలూ తగ్గడం లేదు. ఏఐ, క్లౌడ్ కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీ, డేటా ఇంజనీరింగ్ వంటి రంగాల్లో నైపుణ్యం ఉన్నవారికి మంచి అవకాశాలు లభిస్తున్నాయి. ఇలాంటి ప్రత్యేక నైపుణ్యాలున్న ఫ్రెషర్లకు రూ.15 లక్షల నుంచి రూ.16 లక్షల వరకు వార్షిక ప్యాకేజీలు కూడా అందుతున్నాయి.
ఈ పరిస్థితులతో ఇంజనీరింగ్ కళాశాలలు కూడా తమ బోధనా విధానాలను మారుస్తున్నాయి. విద్యార్థులకు ఏఐ టూల్స్‌పై అవగాహన, ప్రాక్టికల్ శిక్షణ, ఇంటర్న్‌షిప్‌లు అందించడంపై దృష్టి పెడుతున్నాయి. ఏఐ రాకతో ఐటీ ఉద్యోగాల స్వరూపమే మారుతోంది. ఇకపై కేవలం కోడింగ్ నేర్చుకుంటే సరిపోదు.. ఏఐతో కలిసి పనిచేయగల నైపుణ్యాలు కూడా పెంచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.
