పునర్విభజనతో దక్షిణాదికి నష్టం లేదు..ప్రస్తుత సీట్లలో 50% పెంపు: డాక్టర్‌ లక్ష్మణ్‌

పునర్విభజనతో దక్షిణాదికి నష్టం లేదు..ప్రస్తుత సీట్లలో 50% పెంపు: డాక్టర్‌ లక్ష్మణ్‌

హైదరాబాద్, వెలుగు: వచ్చే నెలలో పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాలు జరగనున్నాయని, పునర్విభజన, మహిళా రిజర్వేషన్ల బిల్లులు ప్రధాన ఎజెండాగా ఉంటాయని బీజేపీ రాజ్యసభ సభ్యుడు డాక్టర్‌ లక్ష్మణ్‌ తెలిపారు. జనగణన తర్వాత డీలిమిటేషన్‌ చేస్తే దక్షిణాదికి అన్యాయం జరుగుతుందనే వాదనలో నిజం లేదన్నారు. జనగణనకు ముందే బిల్లు తెస్తున్నందున నష్టం ఉండదని, ప్రస్తుతం ఉన్న సీట్లలో 50 శాతం పెరుగుతాయని చెప్పారు. శుక్రవారం హైదరాబాద్‌లో ఆయన మీడియాతో చిట్‌చాట్‌ చేశారు.

పునర్విభజన బిల్లు 50 ఏళ్లుగా పెండింగ్‌లో ఉందని, దానికి పరిష్కారం చూపడమే ప్రధాని మోదీ లక్ష్యమని పేర్కొన్నారు. 2029 ఎన్నికల్లోనే మహిళలు చట్టసభల్లో అడుగుపెట్టాలనే ఉద్దేశంతో కేంద్రం బిల్లు తెస్తోందన్నారు. దేశ ప్రయోజనాల కోసం కేంద్రం ఏ బిల్లు తెచ్చినా ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తున్నాయని విమర్శించారు. కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీకి కులగణనపై అవగాహన లేదని విమర్శించారు.