ఎప్పుడొచ్చామన్నది కాదన్నయ్యా!..సేవ చేశామా లేదా అన్నది ముఖ్యం :కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేశ్

ఎప్పుడొచ్చామన్నది కాదన్నయ్యా!..సేవ చేశామా లేదా అన్నది ముఖ్యం :కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేశ్
  • ఎంపీ ఈటలపై కంటోన్మెంట్​ ఎమ్మెల్యే ఫైర్​ 
  • బహిరంగ చర్చకు రావాలని సవాల్​ 

కంటోన్మెంట్​, వెలుగు :  కంటోన్మెంట్ అభివృద్ధిపై బహిరంగ చర్చకు తాను సిద్ధంగా ఉన్నానని, 'టూరిస్ట్' ఎంపీ ఈటల రాజేందర్‌కు చర్చకు వచ్చే దమ్ముందా? అని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేశ్ సవాల్ విసిరారు. శుక్రవారం కార్ఖానా వార్డు-3లోని ప్రభుత్వ బాలికల స్కూల్​లో ఎస్‌డీఎఫ్ ద్వారా రూ. 30 లక్షలతో ఏర్పాటు చేసిన ఫ్లోరింగ్, సోలార్ ప్యానెల్స్, సీసీ కెమెరాలు, ఆర్వో వాటర్ ప్లాంట్‌ను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మల్కాజిగిరి ఎంపీ ఈటల తనను 'ఫస్ట్ టైం ఎమ్మెల్యే' అంటూ వ్యాఖ్యానించారని, ఎవరైనా ఏ పనినైనా మొదటిసారి నుంచే ప్రారంభిస్తారన్నారు. 

‘రాజకీయాల్లోకి ఎప్పుడు వచ్చామన్నది కాదు..సేవ చేశామా లేదా? అన్నదే ముఖ్యం’ అని అన్నారు. మరి 30 ఏండ్ల రాజకీయ అనుభవం, ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచానని చెప్పుకుంటున్న ఈటల అనుభవం కంటోన్మెంట్ అభివృద్ధికి ఏం ఉపయోగపడిందని విమర్శించారు. నియోజకవర్గ అభివృద్ధి పనులకు సంబంధించి కేంద్రం నుంచి కనీసం అవసరమైన ఎన్ఓసీలను కూడా తీసుకురాలేకపోయారని మండిపడ్డారు. మీడియా మిత్రుల సమక్షంలో ఒక చర్చా వేదిక ఏర్పాటు చేయాలని, మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచిన తాను కంటోన్మెంట్‌కు ఏం తీసుకొచ్చానో, ఆరుసార్లు ఎమ్మెల్యేగా చేసి ప్రస్తుతం ఎంపీగా ఉన్న ఈటల మల్కాజిగిరి పార్లమెంట్ పరిధికి ఏం చేశారో ప్రజల ముందే తేల్చుకుందామని సవాల్ విసిరారు.