- బహుజన రాజ్యం పార్టీ డిమాండ్
- ఇందిరా పార్క్ వద్ద రౌండ్ టేబుల్ మీటింగ్
ముషీరాబాద్, వెలుగు : రాజ్యాంగబద్ధంగా చట్టసభల్లో ఓబీసీ, బీసీ వర్గాలకు 27 శాతం రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని బహుజన రాజ్యం పార్టీ డిమాండ్ చేసింది. శుక్రవారం ఇందిరాపార్క్ వద్ద ఆ పార్టీ ఆధ్వర్యంలో వ్యవస్థాపక అధ్యక్షుడు లాల్ నాయక్ అధ్యక్షతన రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. దీనికి ఎంపీలు ఆర్ కృష్ణయ్య, ఈటల రాజేందర్, ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్, స్టూడెంట్స్ ఫెడరేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు అశోక్ నాయక్ హాజరయ్యారు. ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ బీసీల రాజకీయ రిజర్వేషన్ల అంశాన్ని ప్రభుత్వాలు ప్రాధాన్యత గా పరిశీలించి చర్యలు చేపట్టాలని కోరారు.
కేంద్రం బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు పెట్టి చట్టసభల్లో ఆమోదం తెలపాలని డిమాండ్ చేశారు. దేశంలో 2,646 బీసీ కులాలుండగా , ఇందులో 2,550 కులాలు ఇంతవరకు పార్లమెంటు గేటు దాటలేదన్నారు. రాష్ట్రంలో 136 కులాలుండగా 120 కులాలు అసెంబ్లీలో అడుగు పెట్టకపోవడం చూస్తుంటే అణిచివేత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. రాజ్యాంగ రచించేప్పుడే బీసీలకు రాజకీయ రిజర్వేషన్లు కల్పించాల్సి ఉండెనని, కానీ అలా చేయకుండా అన్యాయం చేశారన్నారు. లంబాడా పొలిటికల్ జేఏసీ కన్వీనర్ బాలాజీ నాయక్, రాష్ట్ర అధ్యక్షుడు మల్లేష్ నాయక్, మహిళా అధ్యక్షురాలు శైలజ పాల్గొన్నారు.
