న్యూఢిల్లీ: భారత్–అమెరికా మధ్య ట్రేడ్ డీల్ త్వరలోనే ఖరారయ్యే అవకాశముందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వెల్లడించారు. ఒప్పందం ఖరారుకు ఉన్న అడ్డంకులు, అమలుకు సంబంధించిన అంశాలు కొలిక్కి వస్తున్నాయని చెప్పారు. శుక్రవారం ఢిల్లీలో జరిగిన ఇండియా డెట్ క్యాపిటల్ మార్కెట్ సమిట్‌లో వర్చువల్‌గా పాల్గొన్న ఆయన.. భారత్–అమెరికా ట్రేడ్ డీల్ పైనా మాట్లాడారు. రెండు దేశాల మధ్య చర్చలతో సానుకూల వాతావరణం ఏర్పడిందన్నారు.
కేంద్ర ప్రభుత్వం స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల (ఎఫ్‌టీఏ) దిశగా ముందుకు సాగుతున్నదని గోయల్ చెప్పారు. జీఎస్టీ విధానాన్ని ఈజీ చేయడంతోపాటు దేశంలో ఆర్థిక కార్యకలాపాలు పెరిగేలా తక్కువ ట్యాక్స్ కొనసాగిస్తున్నట్లు తెలిపారు. అక్టోబర్‌లో జీఎస్టీ వసూళ్లు ఆల్‌టైమ్ రికార్డు సృష్టించాయని, ఒకే నెలలో ఎగుమతులు 90 బిలియన్ డాలర్లకు చేరాయని వెల్లడించారు. పలు దేశాలతో కుదుర్చుకున్న ఎఫ్‌టీఏలు ఇంకా అమల్లోకి రావాల్సి ఉందని, అవి అమలైతే ఎగుమతులు, పెట్టుబడులకు మరింత ఊతం లభిస్తుందని చెప్పారు.
మార్చి, ఏప్రిల్‌లో ఇండియా–ఈయూ డీల్
యూరోపియన్ యూనియన్ (ఈయూ)తో ట్రేడ్ డీల్ఈ ఏడాది చివరికి ఖరారవుతుందని గోయల్ ఆశాభావం వ్యక్తం చేశారు. వచ్చే ఏడాది మార్చి లేదా ఏప్రిల్ నాటికి అమల్లోకి వచ్చే అవకాశం ఉందన్నారు. మరోవైపు, తయారీ రంగంలో అధిక ఉత్పత్తి సామర్థ్యం ఉందన్న కారణం చూపుతూ భారత్ నుంచి ఎగుమతులపై అమెరికా 25% వరకు అదనపు టారీఫ్‌లు విధించాలని ప్రతిపాదించింది. భారత్‌తో డీల్ కుదిరితే ఈ టారీఫ్‌లు 17 శాతానికి తగ్గించే అవకాశం ఉందని అమెరికా సంకేతాలిచ్చింది.
అధిక టారిఫ్‌ల ప్రతిపాదనలు ఉన్నప్పటికీ భారత్‌కు అమెరికా అతిపెద్ద ఎగుమతి మార్కెట్‌గా కొనసాగుతున్నది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఏడు నెలల్లో అమెరికాకు భారత్ చేసిన ఎగుమతుల విలువ 59.52 బిలియన్ డాలర్లుగా నమోదైంది. గతేడాది ఇదేకాలంలో ఈ విలువ 52 బిలియన్ డాలర్లుగా ఉంది.
