చెన్నై: తమిళనాడు అధికార పార్టీ ఎమ్మెల్యే అరుళ్ విఘ్నేశ్ను పోలీసులు శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. మహిళా ఐఏఎస్ ఆఫీసర్ ను వేధింపులకు గురిచేశారనే కేసులో ఎమ్మెల్యేను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. వాట్సాప్లో అసభ్యకరమైన సందేశాలు పంపడం, అనుచితంగా ప్రవర్తించడం, మద్యం మత్తులో తన అధికారిక నివాసానికి రావడం వంటి చర్యలకు పాల్పడ్డారంటూ ఎమ్మెల్యేపై ఓ మహిళా ఐఏఎస్ ఆఫీసర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఎమ్మెల్యే అరుళ్ విఘ్నేశ్ పై కేసు నమోదు చేశారు.
ఈ కేసులో చర్యలు తీసుకోవడంలో జాప్యం ఎందుకు జరుగుతోందని విజయ్ ప్రభుత్వాన్ని మద్రాస్ హైకోర్టు ప్రశ్నించిన 3 రోజుల తర్వాత ఈ అరెస్ట్ జరిగింది. ఎమ్మెల్యే అరెస్ట్ తర్వాత డీఎంకే అధినేత ఎం.కె. స్టాలిన్ స్పందిస్తూ.. విఘ్నేశ్ ను కాపాడేందుకు మంత్రులు, టీవీకే మిత్రపక్షాల నేతలు ఈ ఫిర్యాదును పక్కన పెట్టారని ఆరోపించారు. సదరు అధికారిణిని సోషల్ మీడియాలో లక్ష్యంగా చేసుకున్నారని, రాజీ పడాలంటూ ఆమెపై ఒత్తిడి తెచ్చారని విమర్శించారు.
మద్రాస్ హైకోర్టు, జాతీయ మహిళా కమిషన్ జోక్యం చేసుకున్న తర్వాతే ఈ అరెస్ట్ జరిగిందని స్టాలిన్ అన్నారు. ఒత్తిళ్లు ఎదురైనా ధైర్యంగా ముందుకు వచ్చి అధికారికంగా ఫిర్యాదు చేసిన అధికారిణిని ఆయన అభినందించారు. 116 రోజుల పాటు ఎలాంటి చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యం వహించినందుకు ప్రభుత్వం జవాబుదారీగా ఉండాలని డిమాండ్ చేశారు.
