నాగార్జునసాగర్‌‌‌‌ నీటి పంపకాల్లో తెలంగాణకు అన్యాయం : శ్రీనివాస్‌‌‌‌ గౌడ్‌‌‌‌

నాగార్జునసాగర్‌‌‌‌ నీటి పంపకాల్లో తెలంగాణకు అన్యాయం : శ్రీనివాస్‌‌‌‌ గౌడ్‌‌‌‌
  • తప్పిదాలకు అధికారులతో పాటు మంత్రులనూ శిక్షించాలి: శ్రీనివాస్‌‌‌‌ గౌడ్‌‌‌‌

న్యూఢిల్లీ, వెలుగు: నాగార్జునసాగర్‌‌‌‌ నీటి పంపకాల్లో తెలంగాణకు అన్యాయం జరిగిందని మాజీ మంత్రి శ్రీనివాస్‌‌‌‌ గౌడ్‌‌‌‌ విమర్శించారు. శుక్రవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో కరువు కాంగ్రెస్‌‌‌‌ ప్రభుత్వం తెచ్చిందేనని అన్నారు. కృష్ణా, తుంగభద్ర జలాలు సముద్రం పాలవుతున్నా తెలంగాణకు తాగునీరు అందించలేకపోతున్నారని మండిపడ్డారు. సాగునీటి తప్పిదాలకు ఈఈ స్థాయి అధికారిని సస్పెండ్‌‌‌‌ చేసి చేతులు దులుపుకోవడం సరికాదన్నారు.

ఇరిగేషన్‌‌‌‌ శాఖ, సంబంధిత జిల్లా మంత్రులు నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలని డిమాండ్‌‌‌‌ చేశారు. డెడ్‌‌‌‌ స్టోరేజ్‌‌‌‌ నుంచి టన్నెల్‌‌‌‌ ద్వారా నీటిని తరలించే ప్రణాళిక ఎవరిదో చెప్పాలని నిలదీశారు. 8 కిలోమీటర్ల దూరంలోని రిజర్వాయర్లను నింపలేని ప్రభుత్వం.. 800 కిలోమీటర్ల దూరంలోని కుప్పానికి ఏపీ నీటిని తరలిస్తుంటే ఎందుకు మౌనంగా ఉందని ప్రశ్నించారు. రైతులకు ఎకరాకు నష్టపరిహారం ఇచ్చి, క్షమాపణ చెప్పాలని డిమాండ్‌‌‌‌ చేశారు. సీఎం వ్యక్తిగత విమర్శలు మాని ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలన్నారు.